పోలీసులపై బ్యారికేడ్లను ఎత్తిపడేసిన కాంగ్రెస్ వర్కర్స్..
Ayodhya Ram Mandir: అస్సాంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాహుల్ గాంధీ నిర్వహిస్తోన్న భారత్ జోడో న్యాయ్ యాత్ర అస్సాం చేరిన సందర్భంగా అక్కడ గందరగోళ వాతావరణం ఏర్పడింది. కాంగ్రెస్ నాయకులు, పోలీసుల మధ్య పెద్ద ఎత్తున వాగ్వివాదం చోటు చేసుకుంది. ఘర్షణ వాతావరణం నెలకొంది.
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర ఈ ఉదయం గువాహటికి సమీపించింది. నగరంలో ప్రవేశించడానికి పోలీసులు అనుమతి ఇవ్వలేదు. నగరం నలువైపులా బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. సిటీలోకి వచ్చే రహదారులను మూసివేశారు. పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరింపజేశారు. టియర్ గ్యాస్ వాహనాలనూ సిద్ధం చేశారు.

అంతకుముందే- అస్సాంలోని నాగౌన్‌లో గల ప్రాచీన భతద్రవ థాన్ ఆలయాన్ని సందర్శించడానికీ పోలీసులు అనుమతిని నిరాకరించిన విషయం తెలిసిందే. ఈ ఆలయాన్ని సందర్శించడానికి అనుమతి ఇవ్వాలంటూ గతంలోనే అస్సాం ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నాయకులు అక్కడి ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందజేసినప్పటికీ.. దాన్ని పోలీసులు తోసిపుచ్చారు.
ఆలయాన్ని సందర్శించాలనే ఉద్దేశంతో నాగౌన్‌కు చేరిన రాహుల్ గాంధీ, ఇతర నేతలకు పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత తలెత్తింది. పోలీసుల తీరును నిరసిస్తూ రాహుల్ గాంధీ రోడ్డుబై బైఠాయించారు. ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శులు జైరామ్ రమేష్, కేసీ వేణుగోపాల్, ఇతర నాయకులు ఆయనతో పాటు రోడ్డుపై కూర్చున్నారు.
ఇప్పుడు తాజాగా గువాహటిలోనికి అడుగు పెట్టడానికి రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్రకు అనుమతి ఇవ్వకపోవడంతో భగ్గుమన్నారు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు. పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. ఘర్షణకు దిగారు. బ్యారికేడ్లను దాటుకుని రావడానికి శతవిధాలా ప్రయత్నించారు.
ఒకదశలో బ్యారికేడ్లను ఎత్తి పోలీసుల మీదికి పడేశారు. గువాహటిలోనికి అడుగు పెట్టారు. వారిని పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నం చేయడంతో యుద్ధ వాతావరణం నెలకొంది. ఆ సమయంలో తన వాహనంపై నుంచి దీన్నంతా చూస్తూ ఉండిపోయారు రాహుల్ గాంధీ.












Click it and Unblock the Notifications