జమ్మూకశ్మీర్ కు రాష్ట్ర హోదా తిరిగిస్తామని రాహుల్ హామీ-మోడీ పనైపోయిందని ఎద్దేవా..!
రెండో విడత అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న జమ్మూ కాశ్మీర్ లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇవాళ ప్రచారం నిర్వహించారు. శ్రీనగర్ లో జరిగిన ఎన్నికల ర్యాలీలో రాహుల్ కీలక ప్రసంగం చేశారు. ముఖ్యంగా జమ్మూకశ్మీర్ కు కేంద్రం రద్దు చేసిన రాష్ట్ర హోదాను తిరిగి ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. వెంటనే కేంద్రం రాష్ట్ర హోదా ఇవ్వాలని, లేకపోతే తామే అధికారంలోకి వచ్చాక దాన్ని గిఫ్ట్ గా ఇస్తామని తెలిపారు.
గతంలో కేంద్ర పాలిత ప్రాంతాల్ని రాష్ట్రాలుగా చేసిన చరిత్ర ఉందని, అలాగే రాష్ట్రాల్ని విడదీసి కొత్త రాష్ట్రాలు కూడా ఏర్పాటు చేసిన చరిత్ర ఉందని రాహుల్ గాంధీ గుర్తుచేశారు. కానీ తొలిసారి రాష్ట్రాన్ని చీల్చి కేంద్రపాలిత ప్రాంతం ఏర్పాటు చేసిన చరిత్ర కాశ్మీర్ లోనే ఉందన్నారు. కాబట్టి తిరిగి కాశ్మీర్ ప్రజలు కోల్పోయిన రాష్ట్ర హోదాను తిరిగి వారికి ఇప్పించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి తీసుకుంటుందని రాహుల్ హామీ ఇచ్చారు.

దేశంలో నిరుద్యోగం, ధరల పెరుగుదల వంటి ఎన్నో సమస్యలు ఉన్నాయని, కానీ ప్రధాని మోడీ మాత్రం రాష్ట్రాల మధ్య , ప్రజల మధ్య, మతాల మధ్య, వర్గాల మధ్య చిచ్చుపెట్టే పనిలో ఉన్నాయని రాహుల్ ఆక్షేపించారు. ఇవన్నీ చేయగలనన్న ఆయన ఆత్మవిశ్వాసాన్ని తాము ఎప్పుడో దెబ్బతీశామన్నారు. అయితే అది ఆయన విద్వేష బాటలో కాకుండా ప్రేమతోనే చేశామని రాహుల్ తెలిపారు. ఇప్పుడు ప్రధాని మోడీ మన్ కీ బాత్ ఎవరూ వినడం లేదని, ఆయన కామ్ కీ బాత్ (పనికొచ్చే మాటలు)చెప్పాలని రాహుల్ సూచించారు.












Click it and Unblock the Notifications