అధికారంలోకి వస్తే పేదలకు ప్రతి నెల రూ.6 వేలు : గోవాలో రాహుల్ గాంధీ వరాలు
గోవా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సమయం దగ్గర పడడంతో అన్ని పార్టీలు స్పీడ్ పెంచాయి. ఈ సారైనా తాము అధికారం చేపట్టేందుకు కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. జోరుగా ప్రచారం చేస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్ పార్టీ అవతరించినా .. అధికార పీఠాన్ని మాత్రం దక్కించుకోలేకపోయింది. కమలం వ్యూహంతో హస్తం చిత్తయింది. గోవా అధికార పీఠాన్ని బీజేపీ కైవసం చేసుకుంది.
Recommended Video

పేదలకు ప్రతి నెల రూ.6 వేలు
గోవాలో తమ పార్టీ అభ్యర్థుల తరపున కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గోవాలో కాంగ్రెస్ అధికారం చేపట్టాల్సిన అవశ్యకతను ప్రజలకు వివరించారు. అన్ని వర్గాలకు సామాజిక, ఆర్థిక న్యాయం జరగాలంటే అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని స్పష్టం చేశారు. పేదల కోసం తాము చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. గోవాలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పేదలకు ప్రతి నెల రూ.6వేల చొప్పున అందజేస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. అంటే ఒక్కో పేద కుటుంబానికి ఏడాదికి రూ.72 వేలు లబ్ధి చేకూరుతుందని వివరించారు.

కొత్త వారికి అవకాశం
బీజేపీ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయండంతో పాటు నిరుద్యోగులకు ఉపాధి కల్పించడంలో పూర్తిగా వైఫల్యం చెందిందని ఆగ్రహం వ్యక్తం చేశారు రాహుల్ గాంధీ. గత ఎన్నికల్లో చేసిన తప్పిదాలను ఈ సారి జరగకుండా చూసుకుంటామన్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో తాము నియంతలకు టికెట్లు ఇవ్వడం లేదన్నారు. కొత్త వారికి అవకాశం కల్పించినట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో భారీ మేజార్టీతో ఘన విజయం సాధిస్తుందని రాహుల్ గాంధీ ధీమా వ్యక్తం చేశారు.

వట్టి మాటలు భారతదేశానికి .. ఉద్యోగాలు మాత్రం చైనాకు
ప్రధాని మోదీ చెప్తున్న మేక్ ఇన్ ఇండియా అనేది వట్టి మాటలే అని రాహుల్ గాంధీ ఆరోపణలు చేశారు. ఈ పథకం చైనా నుంచి కొని తెచ్చుకోవడంగా మారిందని ఎద్దేవా చేశారు. వట్టి మాటలు భారతదేశానికి .. ఉద్యోగాలు మాత్రం చైనాకు అంటూ విమర్శించారు. కేంద్ర బడ్జెట్ లో చిన్న తరహా, మధ్య తరహా పరిశ్రమలను మోదీ ప్రభుత్వం పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ ప్రభుత్వం చిన్న తరహా పరిశ్రమలను సర్వనాశం చేసిందని దుయ్యబట్టారు.












Click it and Unblock the Notifications