ప్రధాని మోడీ సిగ్గుతో తలదించుకోవాలి.. రాహుల్ గాంధీ సంచలన పోస్ట్ !
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ మహారాజా యశ్వంతరావ్ ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఆసుపత్రిలోని పీడియాట్రిక్ సర్జరీ వార్డులో ఎలుకల కాటుకు గురైన ఇద్దరు నవజాత శిశువులు మరణించారు. ఈ సంఘటన ఆసుపత్రి నిర్వహణలో ఘోర నిర్లక్ష్యాన్ని బయటపెట్టింది.
శిశువులపై దాడి మరణాలు..
ఆగస్టు 30–31 రాత్రి ఇద్దరు శిశువులు ఎలుకల కాటుకు గురయ్యారు. ఒకరి చేతికి, మరొకరి భుజానికి గాయాలయ్యాయి. వారిలో ఒకరు కేవలం 1.2 కిలోల బరువున్న చిన్నారి. మంగళవారం ఒకరు, బుధవారం మరొకరు మృతి చెందారు. వైద్యులు కారణం ఇన్‌ఫెక్షన్, పుట్టుకతో వచ్చిన సమస్యలని చెబుతున్నా, ఎలుకల కాటు వారి ఆరోగ్యాన్ని మరింత దెబ్బతీసింది.

ఆసుపత్రి లోపాలు వెలుగులోకి..
ఘటనకు నాలుగు–ఐదు రోజుల ముందే వార్డులో ఎలుకలు కనిపించినట్లు సిబ్బంది ఒప్పుకున్నారు. అయినప్పటికీ ఎటువంటి ఫిర్యాదు నమోదు కాలేదు. ఎం.జి.ఎం. మెడికల్ కాలేజ్ డీన్ డా. అరవింద్ ఘంగోరియా కూడా భద్రతా ప్రమాణాలు ఉల్లంఘించబడ్డాయని అంగీకరించారు. ప్రస్తుతం బాధ్యులపై చర్యలు తీసుకుని, ఉన్నతస్థాయి కమిటీ ద్వారా దర్యాప్తు ప్రారంభించారు.
రాహుల్ గాంధీ ఆగ్రహం..
లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ.. ఇది ప్రమాదం కాదు, ఇది పూర్తిగా హత్య. అమానుషం, భయంకరం, సున్నితత్వం లేనిది. తల్లి తన బిడ్డను కోల్పోవడానికి ప్రభుత్వం నేరుగా బాధ్యత వహించాలని అన్నారు. అలాగే నవజాత శిశువుల భద్రతను కూడా నిర్ధారించలేని ప్రభుత్వం అధికారంలో ఉండే అర్హత ఏమిటి? ప్రధాని మోడీ, సీఎం సిగ్గుతో తలదించుకోవాలి” అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఆరోగ్య శాఖపై విమర్శలు..
రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ఆరోగ్యశాఖ ప్రైవేటీకరణ కారణంగా మంచి చికిత్స ధనవంతులకు మాత్రమే అందుతోందని అన్నారు. పేదలకు మిగిలిన ప్రభుత్వ ఆసుపత్రులు సురక్షితం కాదని, ఇవి “మరణాల నిలయాలు”గా మారాయని ఆరోపించారు. “ప్రతి ఘటనకీ విచారణ అన్న మాటలతో తప్పించుకోవడం ఆగాలి. మేము మౌనంగా ఉండము” అని స్పష్టం చేశారు.
ఎన్‌జిఓల డిమాండ్
జన స్వస్థ్య అభియాన్ మధ్యప్రదేశ్ ప్రతినిధి అముల్య నిధి, జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (NCPCR) ను ఆశ్రయించారు. ప్రభుత్వ ఆసుపత్రిలోని నవజాత శిశువుల ఐసీయూ వార్డులో పరిశుభ్రతా ప్రమాణాలు పాటించకపోవడమే ఈ ఘటనకు కారణమని ఆరోపించారు. “నిర్లక్ష్యం వల్ల ఎలుకలు శిశువులను కరిచాయి. ఇది వ్యవస్థ వైఫల్యానికి నిదర్శనం” అన్నారు.
ఈ సంఘటన వెలుగులోకి రాగానే దేశవ్యాప్తంగా ఆగ్రహం వెల్లువెత్తింది. సోషల్ మీడియాలో ప్రజలు #JusticeForInfants హ్యాష్‌ట్యాగ్ తో ప్రభుత్వాన్ని ఖండిస్తున్నారు. వైద్య నిపుణులు, ప్రజా సంఘాలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో తక్షణ సంస్కరణలు, భద్రతా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications