Goa Elections 2022 : నెహ్రూపై మోడీ వ్యాఖ్యలకు రాహుల్ కౌంటర్-ప్రజల దృష్టిమరల్చేందుకే
గోవా అసెంబ్లీ ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ ప్రచారం వేడెక్కుతోంది. ఇప్పటికే గోవా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న ప్రధాని మోడీ, రాహుల్ గాంధీ వంటి నేతలు కౌంటర్లు, ఎన్ కౌంటర్లతో ఎన్నికల రణరంగాన్ని వేడెక్కిస్తున్నారు. ఇదే క్రమంలో ప్రధాని మోడీ తాజాగా చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇవాళ కౌంటర్ ఇచ్చారు.
గోవా ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ ఇక్కడి ప్రజల దృష్టి మరల్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించారు. గోవాలో అసలు సమస్యలైన పర్యావరణం, నిరుద్యోగం వంటి అంశాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే ప్రధాని మోడీ కాంగ్రెస్ పార్టీపై, భారత తొలి ప్రధాని, తన ముత్తాత జవహర్ లాల్ నెహ్రుపై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. నెహ్రూ కోరుకుంటే 1947లో విదేశీ శక్తుల నుంచి గోవాను విముక్తం చేయగలిగి ఉండే వారంటూ మోడీ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన రాహుల్... రెండో ప్రపంచ యుద్ధం అనంతర పరిస్ధితుల్ని మోడీ సరిగ్గా అర్ధం చేసుకోలేకపోయారని విమర్శించారు.

తాజాగా మపువాలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ప్రధాని మోడీ.. నెహ్రూకు గోవాను పోర్టుగీస్ నుంచి విముక్తం చేసేందుకు 15 ఏళ్లు పట్టిందని విమర్శించారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన రాహుల్.. చరిత్రను అర్ధం చేసుకోకుండా నెహ్రూపై విమర్శలు చేయడం ద్వారా ప్రజల దృష్టి మరల్చేందుకు ప్రధాని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కర్నాటలో వివాదాస్పదమైన హిజాబ్ పై స్పందించేందుకు రాహుల్ గాంధీ నిరాకరించారు. గోవా ప్రజల్ని వివాదాస్పద అంశాల్లోకి చొప్పించేందుకు తాను ప్రయత్నించబోనన్నారు. గోవాలో కాంగ్రెస్ పార్టీ సునాయాసంగా గెలవబోతోందని, ఎలాంటి ఎన్నికల అనంతర పొత్తులు అవసరం లేదన్నారు.












Click it and Unblock the Notifications