తెలంగాణపై కాంగ్రెస్ హైకమాండ్ ఫోకస్.. టీ కాంగ్ నేతలతో రాహుల్ సమావేశం..
తెలంగాణపై కాంగ్రెస్ హైకమాండ్ ఫోకస్ చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటేలా వ్యూహాలు రచిస్తోంది. సోమవారం సాయంత్రం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తెలంగాణ కాంగ్రెస్ నేతలతో సమావేశం కానున్నారు. తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితోపాటు సీనియర్ నాయకులు సమావేశం అవుతారు. కాంగ్రెస్ పార్టీలో అన్ని గ్రూపులను రాహుల్ గాంధీతో సమావేశానికి అధిష్టానం పిలిచింది. పార్టీ బలోపేతం, ప్రజా ఉద్యమాలపై పార్టీ శ్రేణులకు రాహుల్ గాంధీ దిశానిర్దేశం చేయనున్నారు.
గ్రూపు రాజకీయాలపై ప్రధానంగా చర్చించనున్నారు. రేవంత్ రెడ్డిని విభేదిస్తున్న ఎమ్మెల్యే జగ్గారెడ్డి, సీనియర్ నేత వి.హనుమంతరావుకు ఆహ్వానం అందింది.
సమావేశంలో రాహుల్ గాంధీ తెలంగాణ టూర్ షెడ్యూల్ ఖరారు చేసే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికలు జరిగే రాష్ట్రాలపై ఇప్పటి నుంచే దృష్టిసారిస్తోంది. తెలంగాణలో ఈసారి ఎలాగైనా పట్టు సాధించాలని ప్రయత్నంలో రాహుల్ గాంధీ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపించటానికి, భవిష్యత్ ఎన్నికల్లో పునర్ వైభవాన్ని తీసుకురావడంపై దృష్టి సారించారు.

రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ తిరిగి పుంజుకుంటుందని రాహుల్ భావించారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నేతలతో సమావేశం అయ్యారు. ఈ నెల 4వ తేదీన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలతో మరోసారి సమావేశం నిర్వహించనున్నారు. ప్రజాక్షేత్రంలోకి వెళ్లి పోరాటాలు చేయాల్సిన పరిస్థితులపై రాహుల్ గాంధీతో భేటీలో చర్చిస్తారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ చేయాల్సిన ఉద్యమాలకు కూడా కార్యాచరణ రూపొందించనున్నారని సమాచారం. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌లో జరుగుతున్న పరిణామాలను ఢిల్లీలోని ఆ పార్టీ నాయకత్వం పట్టించుకోవడం లేదనే వాదన వినిపించింది.
నేతల మధ్య నెలకొన్న ఈ విభేదాలను పరిష్కరించేందుకు కాంగ్రెస్ హైకమాండ్ చొరవ తీసుకున్న దాఖలాలు కనిపించలేదు. జాతీయస్థాయిలో కాంగ్రెస్ తీవ్ర ఒడిదొడుకులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్‌ను పట్టించుకునే వారే కరువయ్యారు. ఇక్కడ పార్టీ నేతలకు, శ్రేణులకు దిశానిర్దేశం చేసే నాయకులు లేకుండాపోయారు. రాహుల్ గాంధీ తెలంగాణ కాంగ్రెస్ నేతలకు అపాయింట్‌మెంట్ ఇచ్చి చర్చించేందుకు రావాలని కోరడంతో.. తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో కొత్త ఆశలు చిగురించాయి. మరీ ఈ ప్రయత్నాలు ఏమవుతాయో చూడాలీ మరీ.












Click it and Unblock the Notifications