
రాహుల్ గాంధీ: భారత్ జోడో యాత్రలో కన్యాకుమారి నుంచి నడుస్తున్న తెలుగు వారు ఏం చెబుతున్నారు?

కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తెలుగు రాష్ట్రాల్లో పూర్తయింది. తెలంగాణ నుంచి మహారాష్ట్రకు వెళ్లారు రాహుల్.
రాహుల్‌తో పాటు 120 మంది కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకూ కలసి నడుస్తున్నారు. భిన్న నేపథ్యాలు, భిన్న రాష్ట్రాలకు చెందిన వారు ఈ యాత్రలో పాల్గొంటున్నారు.
ఈ యాత్రలో కన్యాకుమారి నుంచి రాహుల్‌తోపాటు నడుస్తోన్న తెలుగు వాళ్లతో బీబీసీ మాట్లాడింది. వాళ్లంతా ఇప్పటికే ఐదు రాష్ట్రాల్లో 1400 కిలోమీటర్లు దాటి ప్రయాణం చేసి వచ్చారు.

ఆయా రాష్ట్రాల్లో అనుభవాలు, కాంగ్రెస్ పరిస్థితి, రాహుల్ వ్యక్తిత్త్వం.. లాంటి అంశాలను వాళ్లు బీబీసీతో పంచుకున్నారు.
ఈ యాత్రలో యువత కంటే మధ్య వయసు వాళ్లే ఎక్కువ ఉన్నారు. వారి మధ్య కనిపించింది 26 ఏళ్ల అనులేఖ. కరీంనగర్‌కు చెందిన అనులేఖ లా చదివుతూ కాంగ్రెస్ విద్యార్థి విభాగం ఎన్ఎస్‌యూఐలో పనిచేసేది. ఆ సంఘంలో ప్రస్తుతం జాతీయ కార్యదర్శి అవడంతో పాటూ ఒడిశా రాష్ట్ర ఇంచార్జిగా కూడా ఉంది. చురుకుగా పనిచేస్తోన్న అమ్మాయి కావడంతో యాత్రలో పాల్గొనే అవకాశం ఇచ్చింది ఏఐసీసీ.
- 'పాకిస్తాన్ జిందాబాద్’ అన్న యువతిని రాహుల్ హత్తుకున్నారా?
- కాంగ్రెస్‌పై గాంధీల పట్టు ఎలా సడలిపోయింది, నేతలు మారారా, పరిస్థితులు మారాయా?

రాహుల్‌ను సోషల్ మీడియాలో చూసి జడ్జ్ చేయడం కాదు- అనులేఖ
''నేను ఎన్‌ఎస్‌యూఐలో చేరిన కొత్తల్లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి రాహుల్ గాంధీ వచ్చారు. సీనియర్లు అంతా ఆయనతో ఫోటోలు దిగి మాట్లాడుతున్నారు. నేను దూరం నుంచి చూస్తున్నాను. మాట్లాడాలి అనుకున్నాను కానీ, సంకోచిస్తున్నాను. అంతలో రాహుల్ నన్ను చూసి, అక్కడి నుంచే సైగ చేశారు. నన్ను అనుకోలేదు. పది నిమిషాల్లో ఆయన నా పక్కకు వచ్చి కూర్చున్నారు. ఏ ఊరు, ఏం చదువుతున్నావు అంటూ మాట్లాడారు. అలా రాహుల్‌తో మొదటిసారి మాట్లాడాను’’అన్నారు అనులేఖ.
లెఫ్ట్, రైట్ కాకుండా సెంటర్ పార్టీ కాబట్టే కాంగ్రెస్‌లో చేరాను అంటున్నారు అనులేఖ. రాహుల్‌ను చాలా దగ్గరగా చూశారామె.
''రాహుల్ చాలా మంచి వారు. సోషల్ మీడియాలో చూసి జడ్జ్ చేయడం కాదు. మీరు దగ్గర నుంచి చూసి జడ్జ్ చేయాలి. నేను రెండు నెలలుగా చూస్తున్నా. రాహుల్ ఎప్పుడూ ఎవర్నీ చీదరించుకోవడం, కోప్పడడం చూడలేదు’’ అంటూ రాహుల్ గురించి చెప్పుకొచ్చారు అనులేఖ.

తెలంగాణలో పార్టీ పరిస్థితి గురించి ఆమెతో ప్రస్తావించినప్పుడు, ఈ యాత్రకు పనిచేసినట్టే కాంగ్రెస్ వాళ్లు ఐక్యంగా పనిచేసి పార్టీని అధికారంలోకి తెస్తారని ఆమె ఆశాభావంతో ఉన్నారు. ఎక్కడా జరగనంత జెన్యూన్‌గా ఆంధ్రలో యాత్ర జరిగిందని ఆమె అంటున్నారు.
''యాత్రలో ఎన్నో కొత్త విషయాలు నేర్చుకుంటున్నాను. జనాల మధ్యలోంచి వెళుతుంటే పిలిచి మాట్లాడుతున్నారు. హత్తుకుంటున్నారు. టీ ఇస్తున్నారు. థ్యాంక్స్ చెబుతున్నారు. ఈ యాత్ర దేశ వైవిధ్యాన్ని కాపాడటానికి చేస్తున్నాం’’ అన్నారు అనులేఖ.
- మహిళను 'ఐటెం’ అని పిలవడం నేరమేనా, కోర్టులు ఏం చెప్పాయి, నటి ఖుష్బూ వివాదమేంటి ?
- బిల్కిస్ బానో: మోదీ ప్రభుత్వ అనుమతితోనే ఆ సామూహిక అత్యాచార దోషులను విడుదల చేశారా?

దేశం కోసం 150 రోజులు ఇచ్చేద్దాం అనుకున్నా - వెంకట్రామిరెడ్డి
సికింద్రాబాద్‌కు చెందిన వెంకట్రామిరెడ్డి కాంగ్రెస్ సేవాదళ్‌లో ఉన్నారు. గతంలో కాంగ్రెస్ నిర్వహించిన ఆజాదీ గౌరవ యాత్రలో కూడా ఆయన పాల్గొన్నారు.
''దేశం కోసం 150 రోజులు వదిలేయాలి అనుకున్నాను. అందుకే రాహుల్‌తో కలసి నడుస్తున్నాను. యాత్ర ప్రారంభం నుంచీ జనం పెరుగుతూనే ఉన్నారు. తమిళనాడు కంటే కేరళలో, కేరళ కంటే కర్ణాటకలో, కర్ణాటక కంటే తెలంగాణలో ఎక్కువ మంది వచ్చారు. కేవలం రాహుల్‌ను ఒకసారి చూడడం కోసమే లక్షల మంది వస్తున్నారు’’ అంటూ తన అనుభవాలు పంచుకున్నారు వెంకట్రామిరెడ్డి.

మీరు రాహుల్‌ని కలిశారా అని అడిగినప్పుడు, ఆ అనుభవాలు చెప్పుకొచ్చారాయన. ''రాహుల్ చాలా ఫ్రీగా ఉంటారు. వెల్ క్వాలిఫైడ్, ఇంటిలిజెంట్, అండస్టాండింగ్, ఫిజికల్ రెసిస్టెన్స్ ఉంది’’ అంటూ వివరించారు.
రాహుల్ ఫిజికల్ ఫిట్నెస్ గురించి చాలా అబ్బురంగా మాట్లాడారు వెంకట్రామిరెడ్డి. ''ముందురోజు ఎన్ని నొప్పులు వచ్చినా మళ్లీ మరునాడు 27 కిలోమీటర్లూ నడవడానికి సిద్ధమైపోతారు ఆయన. కూలీలు ఎలా అయితే ముందు రోజు ఎంత కష్టపడ్డా, తరువాతి రోజు పనికి సిద్ధమైపోతారో, రాహుల్ అదే స్ఫూర్తిగా చేస్తారు’’ అంటూ వివరించారు.
''మనకు నడవడంలో ఎన్ని కష్టాలు ఉన్నా మళ్లీ ప్రజలతో మాట్లాడేప్పుడు, వారి కష్టాలు వినేప్పుడు వాటి ముందు మనం పడే కష్టం ఎంత అనిపిస్తుంటుంది’’ అన్నారు వెంకట్రామిరెడ్డి.
- నరేంద్ర మోదీని నేరుగా ఢీకొట్టేందుకు రాహుల్ గాంధీ ఎందుకు సిద్ధపడటం లేదు?
- గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర్లోనే ఉన్నాయి, అయినా రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఆ రాష్ట్రానికి ఎందుకు వెళ్లడం లేదు?

అప్యాయంగా మాట్లాడుతున్నారు - సంతోష్
వికారాబాద్‌కు చెందిన సంతోష్ యూత్ కాంగ్రెస్‌లో పనిచేస్తారు. ఆయన గతంలో కశ్మీర్ నుంచి కన్యాకుమారికి సైకిల్ యాత్ర చేశారు. ఇప్పుడు పార్టీ తరపున కన్యాకుమారి నుంచి కశ్మీర్‌కు నడుస్తున్నారు ఆయన. ''రాహుల్ ఎప్పుడూ ఒకటే చెబుతారు. ఇది రాజకీయ యాత్ర కాదు. తపస్సు అని. మేం ఈ యాత్రలో భారతదేశం గురించి సరికొత్తగా అర్థం చేసుకుంటున్నాం. భిన్నమైన ప్రజలతో కలిసే అవకాశం దొరికింది’’ అన్నారు సంతోష్.
దేశంలో జరుగుతోన్న విభజనకు వ్యతిరేకంగా, దేశ ఐక్యత కోసం నడుస్తున్నట్టు ఆయన చెప్పారు. సంబంధం లేని వారు ప్రేమగా ఆప్యాయంగా మాట్లాడుతూ, టీ ఇచ్చి కూర్చోబెడుతున్నారు అంటూ తన అనుభవాలు గుర్తు చేసుకున్నారు.

''ఆదోని దగ్గర ఒక గ్రామంలో నడుస్తున్నప్పుడు ఒక ముసలావిడ మమ్మల్ని ఆపింది. ఇందిరమ్మ మనవడిని నువ్వు చూశావా కలిశావా అని అడిగింది. రాహుల్‌తో కలసి మేం ఎందుకు నడుస్తున్నాం అని అడిగింది. రాహుల్‌ను పట్టుకున్న చేయ్యా ఇది అంటూ నా చేయి పట్టుకుంది. నాతో పాటూ ఉన్న మొత్తం ఆరుగురికీ టీ పెట్టి ఇచ్చింది. అయితే అన్నిటికీ మించి ఆమె రాజకీయ అవగాహన నాకు ఆశ్చర్యం కలిగించింది. 'కాంగ్రెస్ వస్తే అందరికీ అవకాశం వస్తుంది. ప్రాంతీయ పార్టీల్లో అలా ఉండదు’ అని అన్నది ఆమె. పనులు చూసుకునే పల్లెటూరి ముసలామె రాజకీయ అవగాహన నాకు ఆశ్చర్యం కలిగింది. పాలపై జీఎస్టీ గురించి బాధపడింది. తమ ఇందిరమ్మ ఇల్లు చూపించింది. యాత్ర నిండా ఇలా ఎన్నో అనుభవాలు ఉన్నాయి’’ అంటూ చెప్పుకొచ్చారు సంతోష్.

యాత్ర లక్ష్యం ఉన్నతమైనది - బెల్లయ్య నాయక్
మహబూబాబాద్‌కు చెందిన బెల్లయ్య నాయక్ కాంగ్రెస్ ఆదివాసీ విభాగంలో ఉన్నారు. ఆయనకు విస్తృతమైన రాజకీయ, సామాజిక, ఆర్థిక అంశాలపై లోతైన అవగాహన ఉంది. దేశంలోని రాజకీయ పరిస్థితులు, సామాజిక స్థితిగతులు, ఆర్థిక విధానాలు – ఇలా అన్నిటి గురించి సుదీర్ఘంగా, సవివరంగా మాట్లాడారు ఆయన.
''యాత్ర లక్ష్యం ఉన్నతమైనది. జనం స్పందన అద్భుతంగా ఉంది. అందుకే కాళ్లకు బొబ్బలెక్కినా ఎవరూ నడక ఆపడం లేదు. దిగ్విజయ్ సింగ్ వంటి 75 ఏళ్ల వారు కూడా నడుస్తున్నారు’’ అన్నారు బెల్లయ్య నాయక్.
బెల్లయ్య నాయక్ రాహుల్‌తో దగ్గరగా పనిచేశారు. ''ఆ మనిషిలో ముక్కుసూటితనం ఉంది. అబద్ధం లేదు. ప్రసన్నం చేసుకోవడానికి మాట్లాడడు. మనసులో ఏముంటే అదే అనేస్తాడు. చాలా నిజాయతీ, దయా గుణం – రెండూ ఉన్నవాడు. అన్నిటికీ మించి హంబుల్‌గా ఉంటాడు. ఈగో ఉండదు. ఈరోజుల్లో ఈగోలేని మనిషిని చూడడం కష్టం. పదవి, స్టేటస్, ఆకారం చూసి కాకుండా మనిషిని మనిషిగా గౌరవిస్తాడు’’ అంటూ తమ అధినేతను పొగడ్తల్లో ముంచెత్తారు నాయక్. కాంగ్రెస్ అధికారంలోకి రావాలంటే రాహుల్ పాదయాత్ర చేయాల్సిందే అని బెల్లయ్య నాయక్ నమ్మకం.
''రాహుల్ కాంగ్రెస్‌కు సెంటర్ అవుతారని అందరికంటే ముందు గుర్తించింది ఆర్ఎస్ఎస్. అందుకే ఆయన ఎంపీ కాకముందు నుంచే కోట్లు ఖర్చుపెట్టి ఆయనపై సోషల్ మీడియాలో చెడు ప్రచరం చేశారు. చేతకానివాడు, తెలివి లేదు, తిరుగుతాడు, నిలకడ లేదు – ఇలా చేయాల్సిన ప్రచారాలు అన్నీ చేసేశారు. ఇక చేయడానికి ఏమీ లేదు. కానీ రాహుల్ ఎక్కడా మాట తూల లేదు. నెగిటివ్‌గా పోలేదు. బాధ్యతయుతంగా మాట్లాడారు. తెలియనివి తెలుసుకుని ముందుకు పోతున్నారు’’ అంటూ వివరించిన బెల్లయ్య నాయక్, మోదీ ఆర్థిక విధానాలు గురించి యాత్రలో తోటి వారికి అవగాహన కల్పించారు.
''కాంగ్రెస్ దేశ సంపద సృష్టించింది. దాన్ని బీజేపీ కొందరికి పంచుతోంది. బలిసిన వాడికి దోచిపెట్టి, బక్క వాడికి ద్రోహం చేసే పార్టీ బీజేపీ. మేం పాదయాత్ర ద్వారా కాంగ్రెస్‌ను, దేశాన్నీ కాపాడుకుంటాం’’ అన్నారాయన.
- రాహుల్ గాంధీ: కాంగ్రెస్ వారసత్వ రాజకీయాలకు ఇదే ముగింపా?
- పంజాబ్‌లో 'ఆమ్ ఆద్మీ' క్లీన్ స్వీప్: కేజ్రీవాల్ ఈ అద్భుత విజయం ఎలా సాధించారు? కాంగ్రెస్ ఓటమికి సిద్ధూ ఎలా కారణమయ్యారు?

యాత్ర మొత్తంలో ఒకే ఒక ఆంధ్రా వ్యక్తి
ఈ మొత్తం యాత్రలో ఒకే ఒక ఆంధ్రా వ్యక్తి ఉన్నారు. గన్నవరానికి చెందిన సుంకర పద్మశ్రీ యాత్రలో రాహుల్‌తో పాటూ నడుస్తున్నారు. ఆంధ్రా రాజకీయాలు, రాహుల్‌తో నడక అనుభవాలు ఆమె బీబీసీకి వివరించారు.
మిగిలిన అన్ని రాష్ట్రాల్లో కంటే ఆంధ్రలో రాహుల్ యాత్రకు వచ్చిన మద్దతు ప్రత్యేకమైనది అంటారు పద్మశ్రీ. ఎవరూ తరలించకుండా, బస్సులు పెట్టకుండా స్వచ్ఛందంగా వేలాది మంది రాహుల్ యాత్రకు వచ్చారంటూ ఆంధ్రలో యాత్ర జరిగిన తీరును గుర్తు చేసుకున్నారు పద్మశ్రీ.
రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రలో సమస్యలను రాహుల్‌కు వివరించినట్టు చెప్పారు పద్మశ్రీ. ''ఆయన నాకు అరగంట సమయం ఇచ్చారు. ఆంధ్రాలో ప్రస్తుత పరిస్థితులు, రాజధాని సమస్య, రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ఇతర అంశాలు అన్నీ ఆయనకు వివరంగా చెప్పాను. అంతా ఓపిగ్గా విన్నారు. రాహుల్ ఒకటే చెప్పారు. 'డోంట్ వర్రీ. నేను ఉన్నాను. ఇప్పుడు అధికారంలో లేము కాబట్టి ఏమీ చేయలేకపోతున్నాం. కేంద్రం మీద ఒత్తిడి తేవడానికి చేయగలిగినంత చేస్తాం. కానీ మనం అధికారంలోకి వచ్చిన తరువాత ఆంధ్రకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం. ఆంధ్రప్రదేశ్ బాధ్యత నాది’ అంటూ ఆయన భరోసా ఇచ్చారు’’ అని చెప్పారు పద్మశ్రీ.
''రాష్ట్రంలో ఎవరు అధికారంలో ఉన్నా మోదీకి లొంగి, భయపడాల్సిన పరిస్థితి ఉంది. ప్రత్యేక హోదా, విభజన హామీలు నెరవేరకపోతే రాష్ట్రానికి పరిశ్రమలు వచ్చే పరిస్థితి లేదు. రాష్ట్రం కుంటుపడింది. ఈ సమయంలో కాంగ్రెస్ మాత్రమే రాష్ట్రానికి మేలు చేయగలదు. బీజేపీ మోసం చేసింది. ఆంధ్రులకు నమ్మక ద్రోహం చేశారు మోదీ, అమిత్ షాలు’’ అన్నారు పద్మశ్రీ.
''కాంగ్రెస్ ఎప్పుడూ మాట తప్పదు. అందుకే రెండు రాష్ట్రాల్లో నష్టపోయినా విభజన చేసింది. విభజన వల్ల కాంగ్రెస్ నష్టపోయింది. లాభపడలేదు. అయినా కాంగ్రెస్ చెప్పిందే చేస్తుంది. అందుకే అలాంటి పార్టీలో రాహుల్‌తో కలసి ఈ చరిత్రాత్మక యాత్రలో నడుస్తున్నా’’ అన్నారు పద్మశ్రీ.
ఇవి కూడా చదవండి:
- 140 ఏళ్ల కిందట అదృశ్యమైన బ్రిటిష్ నౌక.. ఇంగ్లిష్ చానల్ సముద్రంలో దొరికింది
- భూమిలో 650 అడుగుల లోతున 9 రోజులు కాఫీ పొడి తిని బతికారు - ప్రాణలతో ఎలా బయటకు వచ్చారంటే..
- COP27: వాతావరణ మార్పుల విషయంలో భారత్ ఏం చెప్పింది, ఏం చేసింది?
- రష్యా సైన్యాన్ని నిత్యం విమర్శిస్తున్న ఈ పుతిన్ 'ఇద్దరు మిత్రులు' ఎవరు?
- ట్విటర్‌లో సగం ఉద్యోగాల కోత - 'మరో దారి లేదు'.. ఎలాన్ మస్క్ సమర్థన
- డ్రోన్లు: భారతదేశం 2030 నాటికి ప్రపంచ డ్రోన్ హబ్‌గా అవతరిస్తుందా... అవకాశాలు, అవరోధాలు ఏమిటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)