Odisha Train Accident: 43 రైళ్ల రద్దు, 38 దారి మళ్లింపు - వందేభారత్ వాయిదా..!!
ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. భారీగా ప్రాణ నష్టం చోటు చేసుకుంది. వందల మంది గాయాల బారిన పడ్డారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు ఈ ప్రమాదంలో 233 మంది మరణించినట్లు ఒడిశా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. 900 మంది ప్రయాణీకులు గాయపడ్డారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు తరలించారు. సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. కాసేపట్లో ఘటనా స్థలికి ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ చేరుకోనున్నారు.

ప్రమాదం నేపథ్యలో 43 రైళ్లను రద్దు చేస్తూ రైల్వే శాఖ ప్రకటించింది. అదే విధంగా 38 రైళ్లను దారి మళ్లించారు. ప్రమాదం జరిగే సమయానికి ఖరగ్‌పూర్‌లో ఉన్న చెన్నై-హౌరా (12480) రైలును జరోలీ మీదుగా పంపించారు. అలాగే.. వాస్కోడిగామా-షాలీమార్ (18048) రైలును కటక్ మీదుగా పంపించారు. సికింద్రాబాద్-షాలీమార్ వీక్లీ (22850) రైలును కటక్ మీదుగా నడుపుతున్నారు.
హౌరా-పూరీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (12837), హౌరా-బెంగళూరు సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (12863), హౌరా చెన్నై మెయిల్ (12839), హౌరా-సంబల్‌పూర్ ఎక్స్‌ప్రెస్ (20831) రైళ్లను రద్దు చేశారు. ప్రధాని చేతుల మీదుగా శనివారం జరగాల్సిన గోవా-ముంబై వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభోత్సవాన్ని కూడా రద్దు చేశారు.

మూడు రైళ్లు ఢీ కొనటంతో జరిగిన ఈ ప్రమాదం పైన రైల్వే శాఖ విచారణ ప్రారంభించింది. ముందుగా గాయపడిన వారికి సహాయక చర్యలు అందించటం లక్ష్యంగా ప్రకటించింది. ఈ రైలు ప్రమాదానికి సంబంధించిన వివరాలు అందించేందుకు ఒడిశా ప్రభుత్వం ఒక హెల్ప్‌లైన్, పశ్చిమబెంగాల్ ప్రభుత్వం, రైల్వే శాఖ మరికొన్ని హెల్ప్‌లైన్ నంబర్లను ఏర్పాటుచేశాయి.
ఈ రైళ్లలో తెలుగువారు ఎవరైనా ఉంటే వారి ఆచూకీ కోసం విశాఖపట్నం, విజయనగరం స్టేషన్లలో సంప్రదించేందుకు అధికారులు హెల్ప్‌లైన్ నంబర్లను ప్రకటించారు. శనివారం ఉదయం ప్రధాని మోదీ వీడియో అనుసంధానం ద్వారా గోవా - ముంబాయి వందేభారత్ రైలు ప్రారంభిచాల్సి ఉంది. ఈ ప్రమాదంతో కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు కొంకణ్ రైల్వే అధికారులు ప్రకటించారు.

ప్రమాదం జరిగిన బాలేశ్వర్ లో సహాయక చర్యలు ముమ్మరం చేసారు. బోల్తా పడిన బోగాల నుంచి ప్రయాణీకులను బయటకు తీస్తున్నారు. సహాయం అందించాలంటూ ప్రయాణీకులు ఆర్తనాదాలతో ఆ ప్రాంతం మొత్తం బీతావాహంగా మారిపోయింది. మరణించిన ప్రయాణీకుల కుటుంబాలకు ఒడిశా, రైల్వే శాఖ పరిహారం ప్రకటించాయి. రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు.
ఘటనా స్థలికి సహాయక చర్యలు పరిశీలించేందుకు అక్కడకు రైల్వే మంత్రి అశ్విణి వైష్ణవ్ చేరుకుంటున్నారు. హౌరా నుంచి చెన్నై వెళ్లున్న రైలు కావటంతో బెంగాల్, ఒడిశా, ఏపీ, తమిళనాడు కు చెందిన ప్రయాణీకులు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. సికింద్రాబాద్ - షాలిమార్ వారంతపు రైళ్లను కటక్, అంగోల్ మీదుగా దారి మళ్లించినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.












Click it and Unblock the Notifications