రైళ్లన్నీ నిలిపివేస్తామంటూ కేంద్రానికి యూనియన్ల హెచ్చరిక: ఎందుకంటే?
న్యూఢిల్లీ: రైల్వే సంఘాలు కేంద్ర ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశాయి. నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి దాని స్థానంలో పాత పింఛను విధానాన్ని పునరుద్ధరించాలని పలు రైల్వే, ఉద్యోగ, కార్మిక సంఘాలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. తమ డిమాండ్ నెరవేర్చకపోతే మే 1 నుంచి దేశ వ్యాప్తంగా అన్ని రైళ్ల సర్వీసుల్ని నిలిపివేస్తామని హెచ్చరించాయి.

పాత పింఛను పథకాన్ని పునరుద్ధరించాలన్న తమ డిమాండ్ ను పట్టించుకోవడం లేదని.. అందువల్లే ప్రత్యక్ష కార్యాచరణకు దిగడం తప్ప వేరే ప్రత్యామ్నాయం లేదని జాయింట్ ఫోరమ్ ఫర్ రెస్టోరేషన్ ఆఫ్ ఓల్డ్ పెన్షన్ స్కీం కన్వీనర్ శివ్ గోపాల్ మిశ్రా చెప్పుకొచ్చారు. పలు రైల్వే సంఘాలకు చెందిన ఉద్యోగులు, కార్మికులు ఏకతాటిపైకి వచ్చి జేఎఫ్ఆర్ఓపీఎస్ సంయుక్త వేదికగా ఏర్పడ్డారు.
ఈ వేదిక తరపున వివిధ సంఘాలకు చెందిన ప్రతినిధుల బృందం మార్చి 19న కేంద్ర రైల్వే మంత్రిత్వశాఖను కలిసి సమ్మె అంశంపై అధికారికంగా నోటీసు ఇవ్వాలని నిర్ణయించినట్లు కన్వీనర్ గోపాల్ మిశ్రా తెలిపారు. ఇతర ప్రభుత్వ సంఘాలు కూడా తమ పోరాటంలో భాగం కానున్నాయని ప్రకటనలో పేర్కొన్నారు. కొత్త పింఛను విధానం ఉద్యోగుల సంక్షేమ ప్రయోజనాలకు అనుగుణంగా లేదన్నారు. అందుకే తాము పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నట్లు వివరించారు.












Click it and Unblock the Notifications