50 రైల్వే స్టేషన్లలో జనరిక్ మందుల షాపులు-తెలుగు రాష్ట్రాల్లో ఇక్కడే...
రైల్వే స్టేషన్లలో ప్రయాణికులకు పలు కొత్త కొత్త సదుపాయాలు కల్పిస్తూ ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న భారతీయ రైల్వే.. ఇప్పుడు మరో ప్రయోగం చేస్తోంది. ఇప్పటికే తాగునీరు, ఆహారాన్ని చౌక ధరలకే అందిస్తున్న రైల్వేలు ఇకపై జనరిల్ మందుల్ని కూడా రైల్వే స్టేషన్లలో అందించేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా పలు ఎంపిక చేసిన స్టేషన్లలో ముందుగా ఈ స్టోర్లు ప్రారంభిస్తున్నారు.
ప్రధాన మంత్రి భారతీయ జన ఔషధి కేంద్రాల పేరుతో రైల్వే స్టేషన్లలో జనరిక్ మందుల షాపుల్ని ప్రారంభించేందుకు భారతీయ రైల్వే సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో 50 స్టేషన్లను ఎంపిక చేసింది.ఇందులో తక్కువ ధరకే జనరిక్ మందుల్ని ప్రయాణికులకు అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా తెలుగురాష్ట్రాల్లోనూ రెండు రైల్వే స్టేషన్లలో ఈ షాపులు త్వరలో ఏర్పాటు కాబోతున్నాయి.

ఏపీలోని తిరుపతి రైల్వే స్టేషన్ తో పాటు తెలంగాణలోని సికింద్రాద్ రైల్వే స్టేషన్లలో ఈ జన్ ఔషధి మెడికల్ షాపులు ఏర్పాటు కాబోతున్నాయి. లక్షల సంఖ్యలో ప్రయాణికులు ప్రయాణిస్తున్న రద్దీ స్టేషన్లను ముందుగా వీటి కోసం ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా తిరుపతి, సికింద్రాబాద్ స్టేషన్లు పైలట్ ప్రాజెక్టులో భాగంగా ఎంపికయ్యాయి. రాబోయే రోజుల్లో దశల వారీగా మిగతా స్టేషన్లలోనూ ఈ జనరిక్ మందుల షాపులు ప్రారంభిస్తారు.
ఎంపిక చేసిన రైల్వే స్టేషన్లలో జనరిక్ మందుల షాపుల ఏర్పాటు కోసం లైసెన్స్ కలిగిన వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తారు. ఆ తర్వాత ఐఆర్ఈపీఎస్ ద్వారా ఈ వేలం నిర్వహించి అందులో ఎంపికైన వారికి ఈ షాపులు పెట్టుకునేందుకు అనుమతులు ఇస్తారు. ఇలా మెడికల్ షాపులు పెట్టుకునే వారు కేంద్రం ఎంపిక చేసిన నోడల్ ఏజెన్సీతో ఒప్పందం చేసుకుని ఈ షాపుల్ని నిర్వహించాల్సి ఉంటుంది. వీటి డిజైన్లను అహ్మదాబాద్ కు చెందిన ఎన్ఐడీ సంస్ధకు అప్పగించారు.












Click it and Unblock the Notifications