రాష్ట్రపతి పాలనకు మళ్లీ గ్రీన్ సిగ్నల్.. మణిపూర్‌లో మరో ఆరు నెలలు పొడిగింపు !
దేశవ్యాప్తంగా ఈశాన్య రాష్ట్రం మణిపూర్ వ్యవహారం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను మరో ఆరు నెలలు పొడిగించనున్నారు. ఈ మేరకు ఈరోజు ( ఆగస్టు 5, 2025 ) రాజ్యసభలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అందుకు గాను సభ ఆమోదం తెలిపింది.
ఇప్పటికే జూలై 30న మణిపూర్‌లో రాష్ట్రపతి పాలనను పొడిగించేందుకు లోక్‌సభ తీర్మానాన్ని ఆమోదించిన సంగతి తెలిసిందే. ఎన్. బిరేన్ సింగ్ ఫిబ్రవరిలో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన తరువాత రాష్ట్రంలోని ఉద్రిక్తతలు మరింత భీకరంగా మారాయి. ఈ క్రమంలోనే రాజ్యాంగంలోని ఆర్టికల్ 356 ప్రకారం, ఫిబ్రవరి 13న రాష్ట్రపతి పాలన అమలులోకి వచ్చింది.

దాంతో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గెజిట్ ప్రకటన ప్రకారం.. మణిపూర్ శాసనసభ అధికారాలు పార్లమెంటుకు బదిలీ అయ్యాయి. గవర్నర్ అధికారాలను రాష్ట్రపతి ఉపయోగిస్తారు. అంటే గవర్నర్ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో పనిచేస్తారు. ఇది పార్లమెంటరీ ఆమోదానికి లోబడి ఆరు నెలలపాటు అమల్లో ఉంటుంది. ఆ తరువాత పరిస్థితిని బట్టి పొడిగించవచ్చని స్పష్టం చేశారు
అసలు సమస్యలు ఏమిటి?
మణిపూర్‌లో మెజారిటీ మెయిటీ కమ్యూనిటీ మరియు మైనారిటీ కుకి-జోమి తెగల మధ్య భిన్నాభిప్రాయాలు తీవ్ర ఘర్షణలకు దారితీశాయి. ఆదివాసీ హోదా, భూమి హక్కులు, ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ వంటి అంశాలు వాదనలకు కారణమయ్యాయి. దీంతో హింస, దాడులు, అస్థిరతలు మొదలవ్వగా.. ప్రభుత్వం దానిని అరికట్టడంలో విఫలమైంది. ఆ కారణంగా వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. 60,000 మందికి పైగా నిరాశ్రయులయ్యారు. ప్రభుత్వ సేవలు రద్దయ్యాయి. విద్య, ఆరోగ్యం, కమ్యూనికేషన్ రంగాలు పాడయ్యాయి. ఇంటర్నెట్ సేవలు నిలిపివేయడంతో ప్రజల జీవన ప్రమాణాలు భారీగా దెబ్బతిన్నాయి.
రాష్ట్రంలో పరిస్థితులు మెరుగైన తర్వాత కొత్త అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. మణిపూర్ ప్రజలకు మళ్లీ ప్రజాస్వామ్య పాలన అందించాలంటే, రాజకీయ పునర్నిర్మాణం, సమగ్ర శాంతి చర్చలు అవసరమని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications