బీజేపీలోకి ఆరెస్సెస్ రాంమాధవ్, షా పార్టీ అధ్యక్షుడు?
న్యూఢిల్లీ: రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ (ఆర్ఎస్ఎస్) అధికార ప్రతినిధి రామ్ మాధవ్ భారతీయ జనతా పార్టీలో చేరనున్నారని జోరుగా వార్తలు వస్తున్నాయి. సమాచారం మేరకు రామ్ మాధవ్‌కు బీజేపీలో కీలక పాత్రను అప్పగించే అవకాశాలు ఉన్నాయి. ఆయనతో పాటు మరో ఆర్ఎస్ఎస్ నేత శివప్రకాశ్ కూడా కమలతీర్థం పుచ్చుకోనున్నారట.
రామ్ మాధవ్ ఆర్ఎస్ఎస్ ముఖ్య నేత. ఆయన బీజేపీలో చేరితే కీలక పదవి అప్పగించనున్నారని సమాచారం. పార్టీ ప్రధాన కార్యదర్శి లేదా అధికార ప్రతినిధి పదవిని ఆయనకు అప్పగించవచ్చునని అంటున్నారు. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో జరగనున్న సమావేశంలో ఆర్ఎస్ఎస్ నిర్ణయం తీసుకోనుంది.

రామ్ మాధవ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లా అమలాపురంకు చెందిన వారు. 1965లో జన్మించారు. 2003 నుండి ఆర్ఎస్ఎస్ అధికార ప్రతినిధిగా ఉంటున్నారు. 1981 నుండి రామ్ మాధవ్ ఆర్ఎస్ఎస్‌లో ఫుల్ టైం వర్కర్‌గా ఉంటున్నారు.
మరోవైపు, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక పార్లమెంటు స్థానాలను గెలిపించిన మరో బీజేపీ సీనియర్ నేత అమిత్ షాను తదుపరి పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకునే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో యూపీలోని 80 లోకసభ స్థానాల్లో బీజేపీ 72 స్థానాలను గెలుచుకుంది. అమిత్ షా యూపీ ఇంఛార్జిగా ఉండి.. ఎక్కువ స్థానాలలో గెలుపొందేందుకు కృషి చేశారు.












Click it and Unblock the Notifications