MH Elections: మోడీ, రాహుల్ అక్కర్లేని మహా పోరు-లోకల్ హవా ఏ రేంజ్ లో ఉందంటే ?
గత కొన్నేళ్లుగా దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ప్రధాని మోడీ, రాహుల్ గాంధీ కనిపించాల్సిందే. వారిని తమ రాష్ట్రాలకు రప్పించేందుకు నేతలు పోటీ పడేవారు. అలాగే ప్రతీ ఎన్నికల్లోనూ ప్రధాని మోడీ, రాహుల్ గాంధీ రెండు ప్రధాన కూటముల తరఫున స్టార్ క్యాంపెయినర్లుగా కనిపించే వారు. కానీ ఇప్పుడు పరిస్ధితి మారిపోయింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని గమనిస్తే ప్రధాని మోడీ, రాహుల్ గాంధీ కంటే స్థానిక నేతలకే ఇప్పుడు ఆదరణ ఎక్కువగా కనిపిస్తోంది.
మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే ఉద్ధవ్ థాక్రే నుంచి అధికారం లాక్కున్న తర్వాత పాలనపై తన ముద్ర వేసేందుకు చేసిన ప్రయత్నాలు ఆయన్ను మరాఠా నాయకుడిగా జనంలో మంచి మార్కులే తెచ్చిపెట్టాయి. అలాగే ఆరెస్సెస్ జోక్యంతో బీజేపీకి చెందిన డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కూడా స్థానికంగా గట్టి ప్రభావం చూపుతున్నారు. ఇది ఏ స్ధాయిలో ఉందంటే తనకు పట్టున్న నియోజకవర్గాల్లో మోడీ, అమిత్ షా, యోగీ వంటి అగ్రనేతల ప్రచారం అక్కర్లేదని చెప్పేవరకూ వెళ్లిపోయింది.

అటు ముస్లిం ఓటు బ్యాంకు మద్దతున్న శరద్ పవార్ ను టార్గెట్ చేస్తే ఇబ్బందులు తప్పవన్న సంకేతాలతో అజిత్ పవార్ సైతం వెనక్కి తగ్గారు. దీంతో పవార్ ల పోరు కూడా మరాఠా ఎన్నికల్లో చర్చనీయాంశంగా మారింది. మరోవైపు మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే కూడా తమను నిజమైన శివసేనగా గుర్తించాలని పోరాడుతున్నారు. దీంతో ఆయనపైనా జనంలో బాగా చర్చ జరుగుతోంది.
ఇలా ప్రతీ నేతా తమ ప్రాంతాల్లో పట్టు కోసం, ప్రభావం చూపడం కోసం చేస్తున్న పోరాటాలతో ఇక ప్రధాని మోడీ, రాహుల్ గాంధీ ప్రచారాల అవసరం వీరికి లేకుండా పోతోంది.
అలాగే మహారాష్ట్ర ఎన్నికల్లో జాతీయ అంశాల కంటే స్థానిక అంశాలైన కులం, అభ్యర్థి, మతం, పంటల ధరలపై రైతుల ఆందోళన, ద్రవ్యోల్బణం వంటి సమస్యలపైనే ఎక్కువగా చర్చ జరుగుతోంది. దీంతో బీజేపీ ఇక్కడ జాతీయ అంశాల్ని ప్రస్తావించేందుకు ఇష్టపడటం లేదని తెలుస్తోంది. ఇలా ఏవైపు చూసినా స్థానిక నేతలు, స్థానిక అంశాలే మహారాష్ట్ర ఫలితాన్ని నిర్ణయించేలా కనిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications