ఆర్‌బీఐ: ఏటీఎంలలో నగదు లేకపోతే బ్యాంకులకు జరిమానా.. రిజర్వు బ్యాంకు కీలక నిర్ణయం - ప్రెస్‌రివ్యూ

ఏటీఎంలో నో క్యాష్ బోర్డు

ఏటీఎంలలో డబ్బులు లేకపోవడంతో ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) తాజాగా కీలక నిర్ణయం తీసుకుందని ఈనాడు తెలిపింది.

''ఏటీఎంలలో నగదు అందుబాటులో లేని సమయం నెలకు 10 గంటలు దాటితే.. బ్యాంకులకు ఒక్కో ఏటీఎంకు రూ.10 వేల చొప్పున జరిమానా విధిస్తామని ప్రకటించింది.

ఈ ఏడాది అక్టోబరు 1 నుంచి తాజా నిబంధన అమల్లోకి వస్తుందని ఓ ప్రకటనలో వెల్లడించింది.

ఏటీఎంలు ఖాళీ అయిన వెంటనే బ్యాంకులు తిరిగి డబ్బు నింపకపోవడంతో ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్న సంగతి తమ దృష్టికి వచ్చినట్లు ఆర్‌బీఐ తెలిపింది.

ఈ నేపథ్యంలో వాటిలో నోట్ల లభ్యతను పర్యవేక్షించే వ్యవస్థను బలోపేతం చేసుకోవాల్సిందిగా బ్యాంకులు, వైట్‌ లేబుల్‌ ఏటీఎం (డబ్ల్యూఎల్‌ఏ) ఆపరేటర్లను ఆదేశించినట్లు పేర్కొంది.

డబ్ల్యూఎల్‌ఏల్లో నగదు అందుబాటులో లేకపోతే.. వాటికి డబ్బు అందజేసే బాధ్యతను కలిగి ఉన్న బ్యాంకులకు జరిమానా విధిస్తామని తెలిపింది’’అని ఈనాడు వివరించింది.

మూత్రపిండాలు

భార్య సమ్మతి అవసరం లేదు.. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్‌ చేయండి: తెలంగాణ హైకోర్టు

మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్న చెల్లెలికి మూత్రపిండం దానం చేసేందుకు ముందుకొచ్చిన అన్నకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించిందని సాక్షి ఓ కథనం ప్రచురించింది.

''భార్య అనుమతి ఉంటే తప్ప కిడ్నీ దానం చేసేందుకు అనుమతించబోమంటూ అపోలో హాస్పిటల్స్‌ చేస్తున్న వాదనను న్యాయమూర్తి తోసిపుచ్చారు.

భార్యాభర్తల మధ్య విడాకుల కేసు నడుస్తున్నందున భార్య సమ్మతి లేకుండానే కిడ్నీ దానానికి అనుమతించాలని, వెంటనే కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ శస్త్రచికిత్స నిర్వహించాలని అపోలో ఆస్పత్రిని ఆదేశించారు.

ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ టి.అమర్‌నాథ్‌గౌడ్‌ మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు.

నగరానికి చెందిన కె. వెంకట్‌ నరేన్‌ (39), బి.మాధురిలు అన్నాచెల్లెళ్లు. మాధురికి 2012లో వివాహమైంది. మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న మాధురిని పరీక్షించిన అపోలో వైద్యులు ఆమెకు మూత్రపిండం ట్రాన్స్‌ప్లాంటేషన్‌ తప్పనిసరని తేల్చారు.

వైద్య పరీక్షల అనంతరం వెంకట్‌ నరేన్‌ మూత్రపిండాన్ని అమర్చేందుకు అనుకూలంగా ఉందని నిర్ధారించారు.

అయితే వెంకట్‌ నరేన్‌ భార్య సమ్మతి ఉంటే తప్ప ట్రాన్స్‌ప్లాంటేషన్‌ శస్త్రచికిత్స నిర్వహించబోమన్నారు. దీంతో వెంకట్‌ నరేన్‌ హైకోర్టును ఆశ్రయించారు’’అని సాక్షి తెలిపింది.

''మా’’పై ఆరోపణలు.. హేమకు షోకాజ్ నోటీసులు

'మా’ అసోసియేషన్‌ ఎన్నికల వివాదం రోజురోజుకీ ముదురుతోందని ఆంధ్రజ్యోతి ఓ కథనం ప్రచురించింది.

''అధ్యక్ష పదవికి పోటీ చేయనున్న నటి హేమ ప్రస్తుత 'మా’ ప్రెసిడెంట్‌ నరేశ్‌ నిధులను దుర్వినియోగం చేశారంటూ ఆరోపణలు చేశారు. ఆమె ఇతర సభ్యులకు పంపిన వాయిస్‌ మెసేజ్‌ లీక్‌ కావడంతో మరోసారి 'మా’లో మాటల యుద్ధం మొదలైంది.

హేమ ఆరోపణలను 'మా’ అధ్యక్షుడు నరేశ్‌, కార్యదర్శి జీవిత ఖండించారు. బాధ్యతారహితంగా మాట్లాడి 'మా’ ప్రతిష్ఠ దిగజారేలా చేసిందని క్రమశిక్షణా సంఘానికి ఫిర్యాదు చేశారు. దీంతో హేమకు షోకాజ్‌ నోటీసులు జారీ అయ్యాయి.

ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డీఆర్‌సీకి రాసిన లేఖలో అధ్యక్షుడు పేర్కొన్నారు. మూడు రోజుల్లో హేమ నుంచి సమాధానం రావాలని, అది సంతృప్తికరంగా ఉండాలని డీఆర్‌సీ తెలిపింది. లేని పక్షంలో క్రమశిక్షణా సంఘం నుంచి కఠిన చర్యలు తప్పవని తెలిపింది.

'మా’ అసోసియేషన్‌ ఎన్నికల నేపథ్యంలో అధ్యక్ష పదవికి పోటీ చేయనున్న అభ్యర్థులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్న నేపథ్యంలో చిరంజీవి కూడా స్పందించారు. 'మా’ క్రమశిక్షణ సంఘం ఛైర్మన్‌ కృష్ణంరాజుకు లేఖ రాశారు.

మా ఎన్నికలు వెంటనే జరపాలనీ, లేదంటే సంక్షేమ కార్యక్రమాలు నిలిచిపోతాయని లేఖలో పేర్కొన్నారు. సభ్యుల బహిరంగ ప్రకటనలతో 'మా’ ప్రతిష్ట మసకబారుతోందని చిరంజీవి లేఖలో కృష్ణంరాజును కోరారు’’అని ఆంధ్రజ్యోతి తెలిపింది.

జీఎస్‌ఎల్‌వీ

GSLV-F10 : జీఎస్‌ఎల్‌వీ రాకెట్‌ కౌంట్‌డౌన్‌ ప్రారంభం

నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్‌ ధావన్‌ అంతరిక్ష కేంద్రంలో జీఎల్‌ఎల్‌వీ రాకెట్‌ ప్రయోగానికి కౌంట్‌డౌన్‌ ప్రారంభమైందని నమస్తే తెలంగాణ తెలిపింది.

''బుధవారం ఉదయం 3.43 గంటలకు ఇస్రో శాస్త్రవేత్తలు కౌంట్‌డౌన్‌ ప్రారంభించగా.. గురువారం ఉదయం 5.43 గంటలకు జీఎల్‌ఎల్‌వీ-ఎఫ్‌10 రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లనుంది.

రాకెట్‌ ద్వారా 2,268 కిలోల బరువున్న జీఐశాట్‌-1 ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలో ప్రవేశ పెట్టనున్నారు.

ఈ ఉపగ్రహం ద్వారా దేశ రక్షణ వ్యవస్థకు, విపత్తుల నిర్వహణకు ఉపకరించే భూపరిశీలన అంశాలను తెలుసుకునే వీలుంది.

మంగళవారం ఇస్రో చైర్మన్‌ శివన్‌ నేతృత్వంలో షార్‌లో మిషన్‌ సంసిద్ధత సమావేశం జరిగింది. దశల వారీగా రాకెట్‌ అనుసంధానంపై సమీక్షించారు.

సాయంత్రం 5 గంటల నుంచి జరిగిన లాంచ్‌ ఆథరైజేషన్‌ బోర్డు (ల్యాబ్‌) సమావేశంలో ప్రయోగానికి అధికారికంగా అనుమతి ఇచ్చారు.

అనంతరం ప్రయోగ పనులను లాంచ్‌ ఆథరైజేషన్‌ బోర్డు(ల్యాబ్‌)కు అప్పగించారు. ల్యాబ్‌ చైర్మన్‌ ఆర్ముగం రాజరాజన్‌ ఆధ్వర్యంలో శాస్త్రవేత్తలు మధ్యాహ్నం మరోసారి సమావేశమై కౌంట్‌డౌన్, ప్రయోగంపై చర్చించారు.

ఈ క్రమంలో ఉదయం కౌంట్‌డౌన్‌ ప్రారంభం కాగా.. 26 గంటల పాటు కౌంట్‌డౌన్‌ కొనసాగిన అనంతరం గురువారం ఉదయం జీఎస్‌ఎల్‌వీ రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లనుంది’’అని నమస్తే తెలంగాణ తెలిపింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+