కరోనాకు విరుగుడుగా ఎర్ర చీమల చట్నీ- త్వరలో కేంద్రం ఆమోదం ? ఆయుష్, సీఎస్‌ఐర్ పరిశీలన
మన దేశంలో కరోనా భయాలు ఏ స్ధాయిలో ఉన్నాయో దాని విరుగుడు కోసం జరుగుతన్న ప్రయత్నాలు కూడా అదే స్ధాయిలో ఉన్నాయి. అధికారికంగా వ్యాక్సిన్ కోసం ఓవైపు పరిశోధనలు జరుగుతున్న తరుణంలోనే కరోనాకు విరుగుడుగా పనిచేసే ఆయుర్వేదం, ఇతర మందులపై పరిశోధనలు కూడా అంతే స్ధాయిలో సాగుతున్నాయి. ఇందులో తాజాగా తెరపైకి వచ్చిన ఎర్ర చీమల చట్నీ ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. సెలబ్రిటీ ఛెఫ్ గోర్డాన్ రామ్సే కనిపెట్టిన ఈ చట్నీ వ్యవహారమేంటో తేల్చాలని ఒడిశా హైకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది.

ఎర్ర చీమల చట్నీ వాడకం
మన దేశంలోని ఏజెన్సీ ప్రాంతాలున్న రాష్ట్రాల్లో ఎర్ర చీమలను రోగనిరోధక ఆహార పదార్ధాలుగా వాడుతున్నారు. ఇందులో ఒడిశా, ఛత్తీస్‌ఘడ్ వంటి రాష్ట్రాల్లో ఉన్న గిరిజిన ప్రాంతాల్లో ఎర్ర చీమలతో చట్నీతో పాటు సూప్ కూడా తయారు చేస్తారు. దీన్ని తీసుకుంటే ఫ్లూ లక్షణాలున్న వ్యాధులన్నీ మటుమాయం అవుతాయని గిరిజనుల నమ్మకం. దగ్గు, సాధారణ జలుబు, శ్వాస సంబంధ సమస్యలు,, అలసట, ఇతర రోగాలపై ఈ ఎర్ర చీమల చట్నీ, సూప్ బాగా పనిచేస్తాయని గిరిజనులు చెబుతుంటారు. ఎర్ర చీమలను, పచ్చి మిరపకాయలను కలిపి దీన్ని తయారు చేస్తారు.

ఎర్ర చీమల చట్నీతో కరోనా మాయం
ఫ్లూ సంబంధిత వ్యాధులకు, ఇతర రోగాలకు మందుగా పనిచేస్తున్న ఎర్ర చీమల చట్నీని కరోనాకు మందుగా వాడొచ్చని తాజాగా ఓ ప్రచారం మొదలైంది. ఒడిశాలోని బారిపడ ప్రాంతానికి చెందిన ఇంజనీర్, పరిశోధకుడు నయాథర్ పథియాల్ ఎర్రచీమల చట్నీతో కరోనా తగ్గుతుందని ముందుగా గతేడాడి జూన్‌లోనే ప్రకటించారు. ఈ చట్నీలో ఫార్మిక్ యాసిడ్, ప్రొటీన్, విటమిన్ బీ 12, జింక్, ఐరన్ రోగనిరోధక శక్తిని పెంచి కరోనాపై పోరాడే శక్తినిస్తాయని ఆయన పేర్కొన్నారు. ఒడిశా, బెంగాల్, బీహార్, ఛత్తీస్‌ఘడ్, ఏపీ, అస్సాం, హిమాచల్ ప్రదేశ్, మణిపూర్, నాగాలాండ్, త్రిపుర, మేఘాలయ రాష్ట్రాల్లో గిరిజనుల రోగనిరోధకశక్తికి ఇదే కారణమని వెల్లడించారు. ఇప్పటికీ గిరిజన ప్రాంతాల్లో కరోనా వ్యాప్తి లేకపోవడానికీ ఇదే కారణమని పేర్కొన్నారు. దీనిపై మరింత పరిశోధన చేస్తే కచ్చితంగా ప్రయోజనం ఉంటుందని పథియాల్ సూచించారు.

కేంద్రం అనుమతించే అవకాశం
ఒడిశాకు చెందిన పథియాల్ తన ప్రతిపాదనను కేంద్రం అమలు చేయాలని కోరుతూ ఒడిశా హైకోర్టులో ప్రజాప్రయోజన వాజ్యం వేశారు. దీనిపై తాజాగా స్పందించిన ఒడిశా హైకోర్టు ఈ వ్యవహారమేంటో తేల్చాలని కేంద్ర ప్రభుత్వంలోని ఆయుష్ మంత్రిత్వశాఖకూ, పరిశోదనా సంస్ధ సీఎస్ఐఆర్‌కూ నోటీసులు పంపింది. పథియాల్ ప్రతిపాదనలను ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని వారిని ప్రశ్నించింది. దీంతో ఇప్పుడు ఆయుష్ మంత్రిత్వశాఖతో పాటు సీఎస్‌ఐఆర్ కూడా ఎర్ర చీమల చట్నీపై దృష్టిసారించాయి. దీని వాడకం వల్ల కరోనా తగ్గుతుందో లేదో తేల్చబోతున్నాయి. ఆయుష్ మంత్రిత్వశాఖ అయితే త్వరలో దీని వాడకాన్ని అనుమతించే దిశగా అడుగులేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.