భారత్ లో ఇథనాల్ బంకులొచ్చేశాయ్..: ఆ వెహికల్స్ కు మాత్రమే !!
దేశంలో ఇథనాల్ హవా మొదలైంది. పెట్రోల్, డీజిల్ కు ప్రత్యామ్నాయ ఇంధన మిషన్‌లో దీన్ని వినియోగంలోకి తీసుకుని రాబోతోంది కేంద్ర ప్రభుత్వం. ఇందులో భాగంగా దేశ రాజధానిలో మొట్టమొదటి ఇథనాల్ బంక్ ప్రారంభమైంది కూడా. ఢిల్లీలోని పుసా రోడ్ వద్ద ఉన్న ఇండియన్ ఆయిల్ అవుట్‌లెట్‌లో దీన్ని ఏర్పాటు చేశారు. దేశంలో ప్రారంభమైన మొదటి E85 ఫ్యూయెల్ స్టేషన్ ఇది. కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్ దీప్ సింగ్ పూరి ప్రారంభించారు.
దీంతో దేశంలో హై-ఎథనాల్ ఇంధన విక్రయాలు అధికారికంగా మొదలయ్యాయి. పెట్రోల్ కంటే దీని ధర చాలా తక్కువ. ఢిల్లీలో ఈ85 ఇంధనం ధరను లీటరుకు రూ. 82.12 పైసలుగా ఖరారు చేశారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఈ20 పెట్రోల్‌తో పోలిస్తే ఇది లీటరుకు సుమారు రూ. 20 వరకు తక్కువ. పెట్రోల్ బంకుల్లో వినియోగదారులు ఎటువంటి అయోమయానికి గురికాకుండా ఉండేందుకు, ఈ కొత్త డిస్పెన్సర్లకు ప్రత్యేకమైన బ్రాండింగ్, లేబుల్స్‌ను ఏర్పాటు చేశారు.

దీన్ని 85 కంప్లైంట్ ఇంజిన్లు ఉన్న వాహనాల్లో మాత్రమే వాడాల్సి ఉంటుంది. దేశంలో లభ్యమయ్యే E20 పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్, 80 శాతం పెట్రోల్ ఉంటాయి. E85 ఇంధనంలో 85 శాతం ఇథనాల్, 15 శాతం పెట్రోల్ మిశ్రమం ఉంటుంది. ఇథనాల్ వాడకం పెరగడం వల్ల పెట్రోల్ వినియోగం తగ్గి, ముడి చమురు దిగుమతులపై ఆధారపడటం తగ్గుతుంది. చెరకు, మొక్కజొన్న, బియ్యం వంటి వ్యవసాయ ఉత్పత్తుల నుండి ఎథనాల్ తయారు చేస్తారు.
ప్రాథమిక దశలో భాగంగా ఢిల్లీ-నేషనల్ కేపిటల్ రీజియన్ పరిధిలో మరిన్ని ఇథనాల్ బంకులు ఏర్పాటు కానున్నాయి. ముంబై-పూణే-నాగపూర్ కారిడార్లలో సుమారు 50 నుండి 100 వరకు E85 స్టేషన్లను నెలకొల్పాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఆ తర్వాత ఈ ఏడాది చివరి నాటికి 500 స్టేషన్ల నెట్‌వర్క్‌ను సిద్ధం చేయాలని భావిస్తోంది. అలాగే 2027 చివరి నాటికి దేశంలోని ప్రధాన నగరాల్లో 5,000 పైగా ఈ85 ఫ్యూయెల్ స్టేషన్లను ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి.
ముఖ్యంగా ఈ కొత్త ఇంధనాన్ని వాడే ముందు వాహనాల సామర్థ్యాన్ని గమనించడం అత్యంత ముఖ్యం. ప్రస్తుతం ప్రత్యేకంగా డిజైన్ చేసిన లేదా ఆ మేరకు కాలిబరేట్ చేసిన ఫ్లెక్స్ ఫ్యూయెల్ వాహనాలు మాత్రమే దీనిని ఉపయోగించగలవు. హీరో మోటోకార్ప్ తన స్ప్లెండర్ ప్లస్, హెచ్ఎఫ్ డీలక్స్ బైక్ రేంజ్‌ను ఈ విభాగంలో లాంచ్ చేసింది. వీటి ఇంజిన్, మెకానిజంలో సుమారు 39 మార్పులు చేయడంతో ఇవి E85 ఇంధనంపై సమర్థవంతంగా పనిచేస్తాయి. ఈ మార్పుల వల్ల బైక్‌ల పవర్ అవుట్‌పుట్ కూడా పెరిగింది.
మరోవైపు, మారుతి సుజుకి తన మొదటి ఫ్లెక్స్ ఫ్యూల్ కారు ఫ్లెక్స్ ఫ్యూయెల్ ను ఆవిష్కరించింది. ప్రస్తుతానికి ఇది వాణిజ్య అవసరాలకు అంటే ఫ్లీట్ ఆపరేటర్లు లేదా టాక్సీ సర్వీసుల కోసం అందుబాటులో ఉంటుంది. భవిష్యత్తులో ఈ కారును సాధారణ వినియోగదారులకు కూడా విడుదల చేసే అంశాన్ని పరిశీలిస్తోంది. ఈ వాహనం E100 ఇంధనంపై కూడా సునాయాసంగా నడుస్తుందని కంపెనీ స్పష్టం చేస్తోంది.












Click it and Unblock the Notifications