హోమ్ లోన్ ఈఎంఐల మరింత చవక- రియల్ బూమ్
RBI repo rate 2025: భారతీయ రిజర్వ్ బ్యాంక్ కీలక వడ్డీ రేట్లను తగ్గించింద. 25 బేసిస్ పాయింట్ల మేర కుదించింది. ఆర్బీఐ రెపొ రేట్‌ను తగ్గించడం వరుసగా ఇది రెండోసారి కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆర్బీఐ గవర్నర్‌గా సంజయ్ మల్హోత్ర బాధ్యతలను స్వీకరించిన తరువాత దీన్ని తగ్గించడం ఇది రెండోసారి. దీనివల్ల ఈఎంఐల భారం కొంత మేర తగ్గుతుందనే అంచనాలు ఉన్నాయి.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంటే 2025- 2026లో ఆర్బీఐ ప్రకటించిన మొట్టమొదటి మానిటరింగ్ పాలసీ కమిటీ ఇదే. ఇందులో రెపొ రేట్ల తగ్గిస్తూ ఆర్బీఐ తీసుకున్న చర్యలు.. మున్ముందు ఆర్థిక విధానాలు ఎలా ఉంటాయనేది చెప్పకనే చెప్పినట్టయింది. మానిటరింగ్ పాలసీని న్యూట్రల్ నుండి అకామడేటివ్ బదలాయించడం చర్చనీయాంశమౌతోంది.

రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్లు ప్రకటించడం వల్ల హోమ్ లోన్లు, వాటి ఈఎంఐలు చవకగా మారొచ్చనే అంచనాలు మార్కెట్ వర్గాల్లో వ్యక్తమౌతోన్నాయి. తాజా తగ్గింపుతో రెపో రేటు 6 శాతానికి చేరుకుంది. ఇదివరకు 6.25గా ఉండేది.
రెపో రేట్ల తగ్గింపును బ్యాంక్ బజార్ డాట్ కామ్ సీఈఓ అదిల్ షెట్టి విశ్లేషించారు. ఆర్థిక వృద్ధిని పెంచడానికి అనుకూలంగా ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోందని చెప్పారు. రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించి 6 శాతానికి చేర్చడం స్వాగతించదగ్గదేనని పేర్కొన్నారు.
ఈ రేటు తగ్గింపు.. బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు అందజేసే రుణాలను మరింత విస్తృతం చేయడానికి, కొత్త వారిని దీని పరిధిలోకి తీసుకుని రావడానికి, లోన్ సౌకర్యాలను చేరువ చేయడానికి ఉద్దేశించినట్లుగా తాను అంచనా వేస్తోన్నానని ఆదిల్ షెట్టి చెప్పారు. ఫలితంగా- రియల్ ఎస్టేట్ రంగానికి ఊతమిచ్చినట్టవుతుందని పేర్కొన్నారు.
రెపొ రేట్ తగ్గించడం వల్ల కలిగే ప్రయోజనాలను కమర్షియల్ బ్యాంకులు ఎంత మేర రుణగ్రహీతలకు బదిలాయిస్తాయనే అంశంపైనే ఇది ఆధారపడి ఉందని వివరించారు. 25 బేసిస్ పాయింట్ల రేటు తగ్గింపుతో గృహ రుణాలపై ప్రస్తుతం వసూలు చేస్తోన్న లోన్ మొత్తం ఎనిమిది శాతం కంటే తక్కువకు వచ్చే అవకాశం ఉందని ఆదిల్ షెట్టి అభిప్రాయపడ్డారు.
ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులో ఉన్న హోమ్ లోన్ కనిష్ట లోన్ రేటు 8.10, 8.35 శాతం మధ్య ఉంటోంది. సాధారణంగా క్రెడిట్ స్కోర్ 750 కంటే అధికంగా ఉన్న రుణ గ్రహీతలకు మాత్రమే ఈ హోమ్ లోన్ కనిష్ట లోన్ రేటు 8.10 వర్తిస్తోంది. అలాగే- రీఫైనాన్స్‌లో మాత్రమే అందుబాటులో ఉంటోంది. ఇది 8 శాతం కంటే దిగువకు రావొచ్చని ఆదిల్ షెట్టి తెలిపారు.












Click it and Unblock the Notifications