అగ్ని మ్యాన్: డీఆర్డీవో శాస్త్రవేత్త రామ్ నారాయణ్ అగర్వాల్ కన్నుమూత
హైదరాబాద్: అగ్ని క్షిపణుల రూపకర్తగా గుర్తింపు పొందిన ప్రముఖ డీఆర్డీఓ శాస్త్రవేత్త డాక్టర్ రామ్ నారాయణ్ అగర్వాల్ (84) కన్నుమూశారు. గురువారం ఆయన హైదరాబాద్‌లో తుది శ్వాస విడిచారు. భారత దీర్ఘశ్రేణి బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమంలో ఆయన కీలక పాత్ర పోషించారు. అగ్ని క్షిపణులకు సంబంధించి మొదటి ప్రోగ్రామ్ డైరెక్టర్‌గా వ్యవహరించిన అగర్వాల్‌ను 'అగ్ని మ్యాన్'(అగ్ని క్షిపణి పితామహుడు)గా పేర్కొంటున్నట్లు డీఆర్డీవో వర్గాలు వెల్లడించాయి.
రామ్ నారాయణ్ అగర్వాల్ (Ram Narain Agarwal) మృతి పట్ల పలువురు శాస్త్రవేత్తలు సంతాపం వ్యక్తం చేశారు. డీఆర్డీవో ఒక లెజెండ్‌ను కోల్పోయిందని ఆ సంస్థ మాజీ చీఫ్, క్షిపణి శాస్త్రవేత్త డాక్టర్ జి. సతీశ్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అగర్వాల్ మృతి పట్ల డీఆర్డీవో ప్రగాఢ సంతాపం వ్యక్తం చేసింది. అగర్వాల్ డైరెక్టర్ ఏఎన్ఎల్‌గా పదవీ విరమణ చేశారని, రెండు దశాబ్ధాలకుపైగా అగ్ని క్షిపణి ప్రోగ్రాంకు సారథ్యం వహించిన ఘనత ఆయనదేనని ప్రశంసించింది.

పద్మశ్రీ, పద్మభూషణ్ వంటి ప్రతిష్టాత్మక పురస్కారాలు అందుకున్న డాక్టర్ రామ్ నారాయణ్ మృతి విచారకరమని డీఆర్డీవో పేర్కొంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు ఎక్స్(ట్విట్టర్) వేదికగా వ్యాఖ్యానించింది. అగర్వాల్ మృతి పట్ల పలువురు శాస్త్రవేత్తలతోపాటు రాజకీయ నాయకులు సంతాపం తెలిపారు.
రామ్ నారాయణ్ అగర్వాల్ 1941, జులై 24న వ్యాపారుల కుటుంబంలో జన్మించారు. మద్రాస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ లో అగర్వాల్ విద్యనభ్యసించారు. 1983లో ప్రారంభమైన అగ్ని క్షిపణి కార్యక్రమానికి అగర్వాల్ రెండు దశాబ్ధాలపాటు నాయకత్వం వహించారు.












Click it and Unblock the Notifications