Republic Day Parade: ఎంత ఖర్చ అవుతుందో తెలుసా?
భారతదేశ సార్వభౌమత్వాన్ని ప్రపంచానికి చాటిచెప్పే అత్యంత అట్టహాసమైన వేడుక జనవరి 26న ఢిల్లీ వేదికగా జరిగే గణతంత్ర దినోత్సవ కవాతు(Republic Day Parade). అజేయమైన సైనిక శక్తిని, అద్భుతమైన సాంస్కృతిక వైవిధ్యాలను కళ్లకు కట్టే ఈ మహా ప్రదర్శన కేవలం దేశ గౌరవానికి ప్రతీక. యుద్ధ ట్యాంకులు, ఫైటర్ జెట్లు, సైనికుల కవాతు, రాష్ట్రాల శకటాలు చూస్తే ఎవరికైనా గర్వంతో గుండె నిండిపోతుంది. కానీ ఈ మహా ప్రదర్శన వెనుక ఎంత ఖర్చు అవుతుందో, ప్రభుత్వం టిక్కెట్ల ద్వారా ఎంత ఆదాయం పొందుతుందో చాలా మందికి తెలియదు. పార్లమెంటరీ ప్రశ్నలు, ఆర్టీఐల ద్వారా బయటపడ్డ లెక్కలు చూస్తే నిజంగానే ఆశ్చర్యమే కలుగుతుంది.
మొదటి గణతంత్ర దినోత్సవ పరేడ్ జరిగిన 1951లో ఖర్చు ఎంతంటే... కేవలం రూ.18 వేలే. అప్పట్లో ఏర్పాట్లు సింపుల్‌గా ఉండేవి. కానీ కాలం మారింది. దేశం ఎదిగింది. సైన్యం ఆధునికమైంది. విదేశీ అతిథులు, హైటెక్ ఆయుధాలు, భద్రతా ఏర్పాట్లు పెరిగాయి. ఫలితంగా ఖర్చు కూడా దూసుకెళ్లింది. 1956 నాటికి రూ.5.75 లక్షలు, 1988 నాటికి దాదాపు రూ.70 లక్షలు అయ్యాయి. ఇక 2008కి వచ్చేసరికి ఈ ఖర్చు ఏకంగా రూ.145 కోట్లకు చేరిందని అంచనాలు చెబుతున్నాయి. 2015లో అయితే దాదాపు రూ.320 కోట్ల వరకు ఖర్చు అయినట్టు సమాచారం. అంటే ఒకప్పుడు వేలలో ఉన్న వేడుక, ఇప్పుడు కోట్లలోకి మారిపోయింది.

Republic Day Parade..తమ బడ్జెట్ నుంచే..
ఇంత ఖర్చు ఎలా లెక్క పెడతారు అంటే... అసలు ఒకే ఖాతాలో లెక్కే ఉండదు. రక్షణ శాఖ, ఇతర కేంద్ర మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ రంగ సంస్థలు.. అందరూ తమ తమ ఏర్పాట్లకు తమ బడ్జెట్ నుంచే ఖర్చు చేస్తారు. రక్షణ శాఖలోని సెరిమోనియల్ విభాగం మాత్రమే ప్రతి ఏడాది సుమారు రూ.1.3 నుంచి 1.5 కోట్ల వరకు కేటాయిస్తుంది. కానీ అది మొత్తం ఖర్చులో చాలా చిన్న భాగమే. నిజానికి మొత్తం వ్యయం దీని కంటే చాలా ఎక్కువే.
టిక్కెట్ల అమ్మకాలు..
ఇప్పుడు టిక్కెట్ల విషయం చూస్తే ఇంకో నిజం బయటపడుతుంది. ఇంత భారీ వేడుక అయినా, టిక్కెట్ల అమ్మకాల ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం చాలా తక్కువ. 1986లో టిక్కెట్ల ద్వారా వచ్చిన మొత్తం కేవలం రూ.7.47 లక్షలే. 2018 నుంచి 2020 మధ్య సగటున ఏడాదికి రూ.34 లక్షల వరకు వచ్చాయి. కరోనా సమయంలో ప్రేక్షకులపై ఆంక్షలు పెట్టడంతో 2022లో ఈ ఆదాయం కేవలం రూ.1.14 లక్షలకే పడిపోయింది. పరిస్థితులు మెరుగుపడిన 2023లో మళ్లీ టిక్కెట్ల ద్వారా సుమారు రూ.28.36 లక్షలు వచ్చాయి. అంటే వందల కోట్ల ఖర్చుతో పోలిస్తే, ఈ ఆదాయం చాలా స్వల్పమే.
మొత్తానికి గణతంత్ర దినోత్సవ పరేడ్ అనేది డబ్బు సంపాదించే కార్యక్రమం కాదు. ఇది దేశ గౌరవం, సంప్రదాయం, ఐక్యతకు చిహ్నం. కోట్ల రూపాయలు ఖర్చు అయినా, ఆ రోజు దేశభక్తి గుండెల్లో నింపే శక్తి ముందు ఆ లెక్కలు చిన్నవే. ప్రపంచానికి "ఇది భారతదేశం" అని గర్వంగా చెప్పే వేదికగా గణతంత్ర దినోత్సవ కవాతు నిలుస్తూనే ఉంటుంది.












Click it and Unblock the Notifications