చంద్రబాబు శిష్యరికం, పక్కరాష్ట్రం నాయకుల సలహాలు, రేవంత్ రెడ్డి స్కెచ్ వెనుక ఇవే లెక్కలు !
తెలంగాణా కాంగ్రెస్ చీఫ్‌గా రేవంత్ రెడ్డి పని తీరు ఆపార్టీ శ్రేణుల్లో అనేక మంది శత్రువులను సంపాదించిపెట్టింది. రేవంత్ రెడ్డి పనితీరు ఏకపక్షంగా ఉందని, తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వలస వచ్చిన రేవంత్ రెడ్డి చాలా ఎక్కువ చేస్తున్నాడని కొంతకాలం క్రితం వరకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బహిరంగంగానే ఆయన మీద విరుచుకుపడిన విషయం తెలిసిందే.
అయితే రేవంత్ రెడ్డి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి కొత్త ఉత్సహాన్ని తీసుకురావడంలో విజయం సాధించారని ఆ పార్టీలోని కొందరు నాయకులు అంటున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయానికి శక్తివంచనలేకుండా ప్రచారం చేసిన, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకత్వం వహించిన రేవంత్ రెడ్డి హైకమాండ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నట్లు కనిపిస్తోంది.

బీఆర్‌ఎస్ కంచుకోట అయిన కామారెడ్డిలో ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి జాతీయ అధ్యక్షుడు కే చంద్రశేఖర్ రావుపై రేవంత్ రెడ్డి పోటీ చేసి హాట్ టాపిక్ అయ్యారు. నారా చంద్రబాబు నాయుడు శిష్యుడిగా తెలుగుదేశం పార్టీ నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రేవంత్ రెడ్డి తెలంగాణ రాజకీయాల్లో ఎప్పుడు వార్తల్లో ఉండేవాడు. తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చిన రేవంత్ రెడ్డి 2017లో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
ప్రస్తుతం మల్కాజిగిరి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం తీసుకువచ్చారు. 2021 జులై నెలలో తెలంగాణ కాంగ్రెస్ చీఫ్‌గా నియమితులైన తర్వాత రేవంత్ రెడ్డి కేసీఆర్ ప్రభుత్వం మీద పోరాటం చెయ్యడానికి రోడ్ల మీదకు వచ్చి మీడియాలో విపరీతంగా కనిపించారు. తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీని ఇరకాటంలో పెట్టడానికి రేవంత్ రెడ్డి అనేక ప్రయత్నాలు చేశారు.

కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక సమస్యలపై వీధిపోరాటాలు చేసిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోని యువతకు అండగా నిలిచి వారిని ప్రోత్సహించారు.కర్ణాటకలోని కాంగ్రెస్ పార్టీ నాయకుల నుంచి సూచనలు, సలహాలు తీసుకున్న రేవంత్ రెడ్డి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ ఢీకొట్టారు. రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని వ్యతిరేకించిన నాయకుల్లో కొందరు తరువాత ఆయనకు మద్దతు పలికారు.
సొంత పార్టీలో వ్యతిరేకించి నిరసనలు తెలిపినప్పటికి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ అండతో రేవంత్ రెడ్డి వెనుకా ముందు ఆలోచించకుండా పక్కాప్లాన్ తో కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేశారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులతో నిత్యం టచ్ లో ఉన్న రేవంత్ రెడ్డి ఆ పార్టీలో గుర్తింపు తెచ్చుకున్నాడు. చివరికి కేసీఆర్‌కు పోటీగా నిలబడాలని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ రేవంత్ రెడ్డికి సూచించడంతో ఆయన ఇమేజ్ ఇంకా పెరిగిపోయింది.
2014లో తెలంగాణ రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ నుండి విడిపోయినప్పటి నుండి బీఆర్ఎస్ కు కంచుకోట అయిన కామారెడ్డిలో రేవంత్ రెడ్డి పోటీ చెయ్యడంతో ఆ నియోజక వర్గం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది. రేవంత్ రెడ్డి పోటీ చేసిన రెండవ నియోజక వర్గం కొడంగల్‌లో కూడా ఆయన ముందంజలో ఉన్నారు. మొత్తం మీద తెలంగాణలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రేవంత్ రెడ్డి ఇప్పుడు దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచారు.












Click it and Unblock the Notifications