Maha kumbhmela 2025: మహాకుంభ మేళాలో స్వచ్ఛమైన గాలి... ఏంటా మహిమ..?
ఉత్తర్ ప్రదేశ్ ప్రయాగ్ రాజ్ లో మహా కుంభమేళా క్రతువు జరుగుతోంది. ప్రతిరోజూ లక్షల సంఖ్యలో భక్తులు గంగా, యమునా, సరస్వతి నదుల త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఇప్పటికే దాదాపు 10కోట్ల మందికి పైగా భక్తులు త్రివేణీ సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించినట్లు ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. జనవరి 29 మౌని అమావాస్య రోజున మరో 10 కోట్ల మంది భక్తులు మహా కుంభమేళాకు హాజరవుతారని యూపీ సర్కార్ అంచనా వేస్తోంది. అయితే కోట్లమంది జనం మహాకుంభమేళాలో ఉన్నా అక్కడి గాలి మాత్రం కలుషితం కావడం లేదు. అక్కడి కోట్లాదిమంది భక్తులు ఇప్పుడు స్వచ్ఛమైన గాలిని పీలుస్తున్నారు. దానికి కారణం లేకపోలేదు. ప్రయాగ్ రాజ్ మున్సిపల్ కార్పొరేషన్ ముందుచూపే దీనికి కారణం. జపనీస్ టెక్నాలజీ అయిన మియావాకీ పద్ధతిలో అక్కడ ఓ చిన్నపాటి అడవినే సృష్టించారు.
కుంభమేళా దృష్ట్యా..
మహా కుంభమేళా దృష్ట్యా రెండేళ్ల క్రితం ప్రయాగ్ రాజ్ లోని 10 కీలక ప్రాంతాల్లో దాదాపు 20 ఎకరాల్లో ఐదు లక్షల చెట్లను పెంచారు. ఆ చెట్లు రోజూ 11.5 కోట్ల లీటర్ల ఆక్సిజన్ ను విడుదల చేస్తున్నాయి. రూ. 6 కోట్లు ఖర్చు చేసి మియావాకి పద్ధతిలో వీటిని పెంచారు. ఇప్పుడు ఆ చెట్లు ఒక్కోటి 25 నుంచి 30 అడుగుల ఎత్తుకు చేరి భక్తులకు స్వచ్చమైన గాలిని అందిస్తున్నాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా 63 రకాల మొక్కలను నాటారు. మర్రి, రావి, వేప, మహువా, మామిడి, చింత, తులసి, తామర, కదంబ, బ్రాహ్మి, ఉసిరి, రేగి, వెదురు, నిమ్మ, మునగ వంటివి ఉన్నాయి. పండ్ల మొక్కలు, ఔషధ మొక్కలు, అలంకార ప్రాయ మొక్కలన్నీ ఈ మినీ ఫారెస్ట్ లో ఉండటం విశేషం.

మియావాకి పద్దతి అంటే ఏంటి ?
జపాన్ లో సక్సెస్ అయిన మియావాకి పద్దతి గురించి ప్రయాగ్ రాజ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎన్బీ సింగ్ వివరించారు. ఈ మియావాకి విధానం ద్వారా కొంత ప్లేస్ లోనే అత్యధిక చెట్లను నాటొచ్చు. ఈ విధానాన్ని జపనీస్ బొటానిస్ట్ అకిరా మియావాకి 1970లో అభివృద్ధి చేశారు.
మియావాకి పద్ధతిలో ప్లాంటేషన్ ఎలా..?
మియావాకి ప్లాంటేషన్ విధానంలో స్వదేశీ రకానికి చెందిన మొక్కలను మల్టీ లేయర్ విధానంలో పెంచుతారు. ఈ టెక్నిక్ వల్ల సాధారణ చెట్ల కంటే పదింతలు స్పీడ్ తో పెరుగుతాయి. ఈ విధానం వల్ల మట్టి నాణ్యత కూడా పెరుగుతుందని ప్రొ. ఎన్బీ సింగ్ తెలిపారు.












Click it and Unblock the Notifications