రోడ్లు, రైళ్లు, రైల్వే స్టేషన్లు, స్టేడియంలు, విమానాశ్రయాలు.. అన్నీ ప్రైవేటుకు ఇచ్చేస్తాం - ప్రెస్ రివ్యూ

నిర్మలా సీతారామన్

రోడ్లు, రైళ్లు, విద్యుదుత్పత్తి, సరఫరా నుంచి.. గ్యాస్‌ పైప్‌ లైన్లు, మైనింగ్‌, విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు, మైదానాల దాకా.. అంతగా ఆదాయం రాని, వినియోగంలో లేని ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తులను ప్రైవేటుకు అప్పగించేందుకు మోదీ సర్కారు సిద్ధమైంది అని ఆంధ్రజ్యోతి దినపత్రిక ఒక కథనంలో పేర్కొంది.

తద్వారా.. 2022 నుంచి 2025 వరకూ.. అంటే నాలుగేళ్లలో రూ.6 లక్షల కోట్లను సమీకరించేందుకు భారీ ప్రణాళికలు రచించింది.

ఈ ఏడాది కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించిన నిర్ణయాల ప్రాతిపదికగా నీతీ ఆయోగ్‌ రూపొందించిన 'నేషనల్‌ మానిటైజేషన్‌ పైప్‌లైన్‌ను (ఎన్‌ఎంపీ)' కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సోమవారం ఆవిష్కరించారు.

నూతన మౌలిక సదుపాయాల కల్పనలో ప్రైవేట్‌ రంగ పెట్టుబడులను ఆహ్వానించడం ద్వారా ఉపాధి అవకాశాలను, అత్యధిక ఆర్థికాభివృద్దిని సాధించడం, గ్రామీణ- సెమీ అర్బన్‌ ప్రాంతాలను నిరంతరం విలీనం చేయడం ద్వారా సమగ్ర ప్రజా సంక్షేమం సాధించడం తమ లక్ష్యమని ఆమె తెలిపారు.

రహదారులు, రవాణా, రైల్వే, విద్యుత్తు, సహజవాయువు, పౌర విమానయానం, షిప్పింగ్‌, రేవులు, జల మార్గాలు, టెలీకమ్యూనికేషన్లు, ఆహారం, ప్రజాపంపిణీ, మైనింగ్‌, బొగ్గు, గృహనిర్మాణం, పట్టణ వ్యవహారాలు మొదలైన 20కి పైగా రంగాల్లో ప్రభుత్వ ఆస్తులను నగదుగా మార్చే కార్యక్రమం జరుగుతుందని ఆమె వెల్లడించారు.

అయితే ఆయా ఆస్తులపై యాజమాన్య హక్కులు కూడా ప్రభుత్వానివేనని, నిర్ణీతకాలం తర్వాత ప్రైవేటు భాగస్వామి ఆస్తిహక్కును ప్రభుత్వానికి తిరిగి అప్పగించడం తప్పనిసరి అని ఆమె వివరించారు.

కాగా.. నీతిఆయోగ్‌ ఎన్‌ఎంపీలో భాగంగా రూపొందించిన జాబితాలోని ఆస్తుల్లో విశాఖపట్టణం రేవు బెర్తులు, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి విమానాశ్రయాలు ఉన్నాయి.

రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు రహదారులు కూడా ఉన్నాయి.

థర్డ్ వేవ్

మూడో ముప్పు తథ్యం

కరోనా మూడో ఉద్ధృతి.. సెప్టెంబరు, అక్టోబరులో దేశాన్ని చుట్టుముట్టనుందని రెండు కీలక సంస్థలు కేంద్రాన్ని హెచ్చరించాయి. మూడో వేవ్‌ తథ్యమని అవి పేర్కొన్నాయి అని ఈనాడు పేర్కొంది.

'' సెప్టెంబరులోనే దాదాపు రోజుకు 5 లక్షల కేసులు నమోదయ్యే అవకాశం ఉందని, దాదాపు రెండు లక్షల ఐసీయూ పడకలను సిద్ధం చేసుకోవాలని తెలిపాయి. ఈ మేరకు జాతీయ ప్రకృతి వైపరీత్య నిర్వహణ సంస్థ(ఎన్‌ఐడీఎం), నీతి ఆయోగ్‌ కేంద్రాన్ని అప్రమత్తం చేశాయి. హోంమంత్రిత్వశాఖ అధీనంలోని ఎన్‌ఐడీఎం.. కరోనా మూడో దశ ముప్పుపై తన నివేదికను ప్రధానమంత్రి కార్యాలయానికి సమర్పించింది. ఇందులో కొవిడ్‌-19 ముప్పుపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. నీతి ఆయోగ్‌ కూడా కీలక వ్యాఖ్యలు చేసింది. ఆగస్టులోనే రోజుకు 4 నుంచి 5 లక్షల కేసులు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. మూడో ఉద్ధృతిలో ఆసుపత్రుల్లో 23 శాతం మంది చేరతారని, దాదాపు రెండు లక్షల ఐసీయూ పడకలను కేంద్రం సిద్ధం చేసుకోవాలని నీతి ఆయోగ్‌ సభ్యుడు వీకే పాల్‌ తెలిపారు.

రానున్న 2 నెలలే కీలకం

కొవిడ్‌-19 పోరులో భారత్‌కు సెప్టెంబరు, అక్టోబరు నెలలు కీలకం కానున్నాయని జాతీయ ప్రకృతి వైపరీత్య నిర్వహణ సంస్థ తన నివేదికలో స్పష్టం చేసింది. వైరస్‌లో మార్పులు అధికమైతే సెప్టెంబరులోనే రోజుకు 5 లక్షల కేసులు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. పరిస్థితులను బట్టి సెప్టెంబరు నుంచి అక్టోబర్‌ చివరినాటికల్లా ఎప్పుడైనా దేశంలో మూడో ఉద్ధృతి కనిపించవచ్చని పేర్కొంది. ఇందులో చిన్నారులపై ఎక్కువ ప్రభావం కనిపిస్తుందని చెప్పే ఆధారాలు ఎక్కడా లేవని స్పష్టంచేసింది. ఒకవేళ వస్తే మాత్రం పిల్లలకు సరిపడా వైద్యసౌకర్యాలు దరిదాపుల్లోకూడా లేవని ఆందోళన వ్యక్తంచేసింది. వ్యాక్సిన్‌ కార్యక్రమం మందకొడిగా సాగడంపై కూడా ఈ నివేదిక చర్చించింది. ప్రస్తుతం 7.6 శాతం మంది మాత్రమే పూర్తిస్థాయిలో టీకాలు వేసుకున్నారని, ఈ సంఖ్య పెరగకపోతే రోజుకు ఆరు లక్షల కేసులు నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది.

ఆంధ్రప్రదేశ్ స్కూళ్లు

బడికి వేళాయే..

రాష్ట్రంలో అంగన్‌వాడీలు సహా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు బడులు, కాలేజీలు వచ్చే నెల 1వ తేదీ నుంచి తిరిగి ప్రారంభమవుతున్నాయి. ఈ మేరకు అన్ని రకాల విద్యా సంస్థల్లో ప్రత్యక్ష బోధన మొదలుపెట్టాలని సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమీక్షలో నిర్ణయించారు అని సాక్షి దినపత్రిక ఓ కథనం ప్రచురించింది.

గ్రామాలు, పట్టణాల్లోని అన్ని విద్యాసంస్థలు, వసతి గృహాలను శుభ్రపరిచి ఆగస్టు 30నాటికి సిద్ధం చేసే బాధ్యతను పంచాయతీరాజ్, మున్సిపల్‌ శాఖలకు అప్పగించారు. కరోనా రెండోవేవ్‌ ఉధృతి కారణంగా మూసివేసిన విద్యాసంస్థలను తిరిగి ప్రారంభించే అంశంపై సీఎం కేసీఆర్‌ సోమవారం ప్రగతిభవన్‌లో మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. విస్తృ తంగా చర్చించిన అనంతరం నిర్ణయాలను ప్రకటించారు. ఈ వివరాలు కేసీఆర్‌ మాటల్లోనే..

అన్ని అంశాలను పరిశీలించాం..

''కరోనాతో రాష్ట్రంలో విద్యావ్యవస్థ ఇబ్బందుల్లో పడింది. విద్యాసంస్థలు మూతపడడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రైవేటు స్కూళ్ల టీచర్లు, విద్యా అనుబంధ రంగాల్లో అయోమయ పరిస్థితి నెలకొంది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో విద్యాసంస్థల పునః ప్రారంభానికి తీసుకుంటున్న చర్యలను, అనుసరిస్తున్న వ్యూహాలపై సమావేశంలో క్షుణ్నంగా చర్చించాం. రాష్ట్రవ్యాప్తంగా కరోనా పరిస్థితులపై వైద్యశాఖ అధికారులతో చర్చించాం. గతంలో కంటే రాష్ట్రంలో కరోనా నియంత్రణలోకి వచ్చిందని వారు నివేదికలు అందించారు. ప్రస్తుతం రాష్ట్రంలో జనసంచారం సాధారణ స్థితికి చేరుకుంటోంది.

విద్యాసంస్థలను నిరంతరాయంగా మూసివేయడంతో విద్యార్థుల్లో మానసిక ఒత్తిడి పెరుగుతున్నదని, వారి భవిష్యత్తుపై ప్రభావం చూపే పరిస్థితి ఉందనే అధ్యయనాన్ని వైద్యశాఖ అధికారులు సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. రాష్ట్రంలో కేజీ నుంచి పీజీ దాకా ప్రైవేట్, ప్రభుత్వ విద్యాసంస్థల్లో అన్నిరకాల విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని.. సమావేశంలో పాల్గొన్న అందరి అభిప్రాయాలను తీసుకుని.. విద్యా సంస్థలు తెరవాలని నిర్ణయం తీసుకున్నాం. అన్నిజాగ్రత్తలు తీసుకుంటూ సెప్టెంబర్‌ 1 నుంచి విద్యాసంస్థలను పునఃప్రారంభిస్తాం.

పరిశుభ్రతకు ప్రాధాన్యమిస్తూ..

గ్రామాలు, పట్టణాల్లో ఇన్నిరోజులుగా మూతపడి ఉన్న ప్రభుత్వ విద్యాసంస్థల్లో పారిశుధ్యాన్ని తిరిగి సాధారణ స్థాయికి తెచ్చే బాధ్యతను పంచాయతీరాజ్, మున్సిపల్‌ శాఖలు తప్పనిసరిగా తీసుకోవాలి. పాఠశాలలు, విద్యాసంస్థల ఆవరణలను పరిశుభ్రంగా ఉంచే బాధ్యత ఆయా గ్రామాల్లోని సర్పంచులు, మున్సిపల్‌ చైర్మన్‌లదే. జిల్లాపరిషత్‌ చైర్మన్లు తమ జిల్లాల్లో, మండలాధ్యక్షులు తమ మండలాల్లో పర్యటించి.. అన్ని పాఠశాలలు పరిశుభ్రంగా, శానిటైజేషన్‌ చేసి ఉన్నాయో లేదో పరిశీలించాలి. జిల్లాల డీపీవోలు, జెడ్పీ సీఈవోలు, ఎంపీవోలు, ఎంపీడీవోలు, డీపీవోలు ఎప్పటికప్పుడు పరిశీలించి నిర్థారించాల్సిన బాధ్యత తీసుకోవాలి. ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ నెల 30లోగా ప్రభుత్వ విద్యాసంస్థల శానిటైజేషన్‌ ప్రక్రియను పూర్తి చేయాలి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+