పట్టపగలు భార్య కళ్లదుటే ఆర్ఎస్ఎస్ కార్యకర్త దారుణ హత్య: ఎస్‌డీపీఐ పనే?
తిరువనంతపురం: కేరళ రాష్ట్రంలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. రాష్ట్రంలో మరో రాష్ట్రీయ స్వయం సేవక్(ఆర్ఎస్ఎస్) కార్యకర్త దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటన మంబరమ్ ప్రాంతంలో సోమవారం ఉదయం చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు.
సోమవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో తన భార్యను ఆమె పనిచేసే ప్రాంతానికి తీసుకెళుతుండగా సంజిత్ అనే ఆర్ఎస్ఎస్ కార్యకర్తను.. అతని భార్య కళ్ల ముందే దారుణంగా హత్య చేశారు. ఇస్లామిస్ట్ ఔట్‌ఫిట్ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ) పొలిటికల్ విభాగమైన సోషల్ డెమోక్రసి పార్టీ ఆఫ్ ఇండియా(ఎస్‌డీపీఐ) కార్యకర్తలు ఈ హత్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

హత్య చేసిన అనంతరం పారిపోయిన నిందితుల కోసం గాలింపు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఎలప్పుల్లీకి చెందిన సంజిత్ తన భార్యతో కలిసి ద్విచక్ర వాహనంపై వెళుతుండగా.. వెంబడించిన దుండగులు అతని వాహనాన్ని కారుతో ఢీకొట్టి కిందపడేశారు. ఆ తర్వాత సంజిత్‌ను అతని భార్య ముందే కత్తులతో నరికి చంపారు.
పక్కా ప్రణాళిక ప్రకారమే సంజిత్‌ను హత్య చేశారని, పూర్తిగా పోలీసులు, ప్రభుత్వం విఫలం చెందాయని కేరళ బీజేపీ అధ్యక్షుడు కే సురేంద్రన్ ఆరోపించారు. పట్టపగలే అందరూ చూస్తుండగానే ఈ హత్య జరగడం ప్రభుత్వంపై విమర్శలకు తావిస్తోంది. కాగా, సంజిత్ హత్యకు నిరసనగా సోమవారం పాలక్కడ్ వ్యాప్తంగా నిరసనలు చేపట్టాయి. కేరళ రాష్ట్రంలో గతంలోనూ పదుల సంఖ్యలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు హత్యకు గురైన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications