బీర్భూమ్ హింసపై చర్చకు బీజేపీ పట్టు: అసెంబ్లీలో ఎమ్మెల్యేల ఘర్షణ, సువేందు సహా ఐదుగురి సస్పెండ్
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ అసెంబ్లీలో సోమవారం ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. రాష్ట్రంలో ఇటీవల చోటుచేసుకున్న బీర్భూం సజీవదహనాల ఘటనపై అధికార తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం నెలకొంది. బీర్భూమ్ హింసపై చర్చకు బీజేపీ పట్టుబట్టడంతో ఉద్రిక్తతకు దారితీసింది. ఎమ్మెల్యేలు పరస్పరం దాడులకు దిగారు. ఈ క్రమంలో బీజేపీ ఎమ్మెల్యేలపై వేటు పడింది.
కాగా, ఇటీవల బీర్భూం జిల్లాలో పలు ఇళ్లకు నిప్పంటించడంతో 8 మంది సజీవ దహనమయ్యారు. ఈ ఘటనపై అసెంబ్లీలో చర్చకు పట్టుబట్టిన బీజేపీ సభ్యులు.. రాష్ట్రంలో శాంతి భద్రతలపై మమతా బెనర్జీ టీఎంసీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీనిపై సీఎం మమతా బెనర్జీ సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేసింది. అయితే, బీజేపీ నేతల వ్యాఖ్యలను టీఎంసీ ఎమ్మెల్యేలు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరుపక్షాల సభ్యులు ఘర్షణ పడ్డారు.

బీజేపీ, టీఎంసీ సభ్యులు తమ సీట్ల నుంచి లేచి గొడవకు దిగారు. అంతేగాక, తోసుకోవడం, దాడి చేసుకోవడం చేసుకున్నారు. దీంతో పలువురు సభ్యులు గాయపడ్డారు. మార్షల్స్ ఇరువర్గాలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. కాగా, ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. టీఎంసీ ఎమ్మెల్యేలు తమపై దాడి చేశారంటూ బీజేపీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Absolute pandemonium in the West Bengal Assembly. After Bengal Governor, TMC MLAs now assault BJP MLAs, including Chief Whip Manoj Tigga, as they were demanding a discussion on the Rampurhat massacre on the floor of the house.
— Amit Malviya (@amitmalviya) March 28, 2022
What is Mamata Banerjee trying to hide? pic.twitter.com/umyJhp0jnE
అనంతరం బీజేపీ ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్ చేశారు. ఈ క్రమంలో ఐదుగురు బీజేపీ సభ్యులను స్పీకర్ సభ నుంచి సస్పెండ్ చేశారు. సువేందు అధికారితోపాటు మనోజ్ టిగ్గా, నరహరి మహతో, శంకర్ ఘోష్, దీపర్ బర్మాన్ ను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. కాగా, అసెంబ్లీలో కూడా ఎమ్మెల్యేలకు రక్షణ లేకుండా పోయిందని, తమపై టీఎంసీ ఎమ్మెల్యేలు దాడి చేశారని బీజేపీ పక్షనేత సువేందు అధికారి తెలిపారు. అయితే, టీఎంసీ మాత్రం తాము ఎలాంటి దాడులు చేయలేదన్నారు.
కాగా, అసెంబ్లీలో బీజేపీ సభ్యులపై దాడులు జరిగాయంటూ ఆ పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోనే కాదు అసెంబ్లీలో కూడా శాంతియుత పరిస్థితులు లేవని మండిపడుతున్నారు. టీఎంసీ దౌర్జాన్యాలకు అంతేలేకుండా పోతోందని బీజేపీ సీనియర్ నేతలు ధ్వజమెత్తారు.












Click it and Unblock the Notifications