లగ్జరీ ఐటెమ్స్ జాబితాలోకి సమోస, జిలేబీ, కచోరీ
పాట్నా: రాష్ట్ర ఖాజానాను నింపేందుకు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అభివృద్ధి పనులు జరగాలంటే పన్నులు విధించకతప్పదని తేల్చేశారు. 13.5 శాతం పన్నును విలాసవంతమైన వస్తువుల(లగ్జరీ ఐటెమ్స్)పై విధించాలని మంగళవారం నితీష్ ప్రభుత్వం నిర్ణయించింది.
కిలోకు రూ. 500లు ఉన్న స్వీట్లపై 13.5శాతం పన్ను కట్టాల్సిందే. దోమల నిరోధక వస్తువులపైనా ఈ పన్ను చెల్లించాల్సిందే. నితీష్ నేతృత్వంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. సీఎం ఆమోద ముద్ర వేసిన వెంటనే ఈ పన్నులు అమల్లోకి రానున్నాయి.

ఈ నిర్ణయాలపై కేబినెట్ కోఆర్డినేషన్ డిపార్ట్‌మెంట్ ప్రిన్సిపాల్ సెక్రటరీ బ్రిజేష్ హెహ్రోతా మాట్లాడుతూ.. కిలోకు రూ. 500కు పైగా ఉన్న స్వీట్లపై 13.5శాతం పన్ను విధించాలని నిర్ణయించినట్లు తెలిపారు.
సమోసా, కచోరీ, బ్రాండ్ కలిగిన ఉప్పు లాంటి పదార్థాలపైనా 13.5శాతం పన్ను విధించాలని నిర్ణయించినట్లు తెలిపారు. అదే విధంగా ఆటో విడి భాగాలు, బ్యాటరీ విడి భాగాలపై, అన్ని రకాల యూపీఎస్‌లపైనా పన్ను విధించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
ఇసుక, కాస్మోటిక్ వస్తువులు, సెంట్, హెయిర్ అయిల్స్ పైనా 13.5శాతం పన్ను విధించాలని నిర్ణయించామని చెప్పారు. బీహార్ కేబినెట్ 23 ప్రతిపాదనలకు ఆమోద ముద్ర వేసింది. అలాగే, ‘చాక్ ఎన్ డస్టర్' చిత్రానికి పన్ను మినహాయింపు ఇచ్చేందుకు నిర్ణయించినట్లు తెలిపారు. ప్రభుత్వ వైద్యులు, టీచర్లు ప్రైవేటు ప్రాక్టీస్ చేసుకోవడంపై నిషేధం విధించాలని కేబినెట్ నిర్ణయించిందని బ్రిజేష్ చెప్పారు.












Click it and Unblock the Notifications