అల్లర్ల మాస్టర్ మైండ్ అరెస్ట్
Sandeshkhali violence: పశ్చిమ బెంగాల్‌లో ఆందోళనలు, తీవ్ర హింసాత్మక పరిస్థితులకు దారి తీసిన సందేశ్‌ఖలి ఉదంతంలో పోలీసులు పురోగతి సాధించారు. ఈ ఘటనకు ప్రధాన కారకుడైన అధికార తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు షేక్ షాజహాన్‌ను అరెస్ట్ చేశారు. ఈ మధ్యాహ్నం అతన్ని న్యాయస్థానంలో ప్రవేశపెట్టనున్నారు.
సందేశ్‌ఖలీ గ్రామంపై దండెత్తి, మహిళలపై లైంగిక దాడులకు పాల్పడిన ఘటనలో షాజహాన్ ప్రధాన నిందితుడు. ఈ ఘటన తరువాత అతను 55 రోజులుగా అజ్ఞాతంలో ఉంటోన్నాడు. అతన్ని అరెస్ట్ చేయాలంటూ పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ నాయకులు, మహిళా సంఘాలు ఆందోళనకు దిగాయి.

అతన్ని గాలించడానికి పశ్చిమ బెంగాల్ పోలీసులు ప్రత్యేకంగా ఎనిమిది బృందాలను ఏర్పాటు చేశారు. రాష్ట్రం మొత్తం గాలింపు చర్యలు చేపట్టాయి. ఎట్టకేలకు షాజహాన్ పోలీసుల చేతికి చిక్కాడు. 24 పరగణ జిల్లాలోని మనిఖన్ ప్రాంతంలో అర్ధరాత్రి షాజహాన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
మనిఖన్ ప్రాంతంలో షాజహాన్ తలదాచుకున్నట్లు పక్కా సమాచారం అందిన నేపథ్యంలో పోలీసులు దాడి చేశారు. అతన్ని అరెస్ట్ చేశారు. ఈ మధ్యాహ్నం 2 గంటలకు అతణ్ని బసీర్హాట్ కోర్టు సమక్షంలో ప్రవేశపెడతామని పోలీస్ అధికారి అమీనుల్ ఇస్లాం ఖాన్ తెలిపారు. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు చెప్పారు.
జనవరి 5వ తేదీన 24 పరగణ జిల్లాలోని సందేశ్‌ఖలి గ్రామంపై షాజహాన్, అతని అనుచరులు దాడులు చేసిన విషయం తెలిసిందే. మహిళలపై ఇష్టానుసారంగా లైంగిక దాడులకు పాల్పడ్డారు. కొందరిని వివస్త్రలను చేసి గ్రామంలో ఊరేగించారు. వారి పొలాలను ఆక్రమించుకున్నారు.
అతనిపై 1,250 ఫిర్యాదులు పోలీసులకు అందాయి. అందులో 400లకు పైగా ఫిర్యాదులు.. భూ ఆక్రమణలకు సంబంధించినవే. షాజహాన్, అతని అనుచరులు తమపై లైంగిక దాడులకు పాల్పడినట్లు 50 మంది మహిళలు జాతీయ గిరిజన కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. తమ భూములను లాక్కున్నాడంటూ కేసు పెట్టారు.
జనవరి 5వ తేదీన చోటు చేసుకున్న ఈ ఉదంతం వెలుగులోకి వచ్చిన వెంటనే షాజహాన్ అజ్ఞాతంలోకి వెళ్లాడు. అతన్ని అరెస్ట్ చేయాలంటూ బీజేపీ నాయకులు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని కంటి మీద కునుకు లేకుండా చేశారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, స్మృతి ఇరాని సహా పలువురు నాయకులు పశ్చిమ బెంగాల్‌ను సందర్శించారు.












Click it and Unblock the Notifications