Saranya Sasi:10ఏళ్లు పోరాడినా -మలయాళ నటి శరణ్య శశి కన్నుమూత -క్యాన్సర్‌లో కరోనా సోకడంతో
క్యాన్సర్ వ్యాధిపై పోరాటంలో అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచింది.. ఒకటీ రెండు కాదు, ఏకంగా 10ఏళ్లపాటు మహమ్మారితో తలపడింది.. క్యాన్సర్ చికిత్స పొందుతోన్న ఆమెను కరోనా వైరస్ సైతం వదల్లేదు.. చివరికి రెండు మహమ్మారులు కలిసి ఆ యువ ప్రాణాన్ని బలి తీసుకున్నాయి.. కేరళ సహా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆమె అభిమానులు, క్యాన్సర్ అవేర్నెస్ సంస్థలు, కరోనా యోధులు ఆమెకు నివాళులర్పిస్తున్నారు..
ప్రముఖ మలయాళ నటి శరణ్య శశి (35) ఇక లేరు. కేరళ రాజధాని త్రివేండ్రంలోని ఓ ప్రైవేటు ఆసుప్రతిలో చికిత్స పొందుతున్న ఆమె సోమవారం(ఆగస్టు9)న తుదిశ్వాస విడిచారు. గడిచిన 10ఏళ్లుగా క్యాన్సర్ వ్యాధితో సుదీర్ఘపోరాటం చేస్తోన్న శరణ్యకు ఇటీవల కరోనా సోకడంతో ఆరోగ్య పరిస్థితి విషమించింది. కరోనా నుంచి కోలుకున్నప్పటికీ సైడ్ ఎఫెక్ట్స్ కొనసాగడంతో ఆమె అంతకంతకూ క్షీణించి, ఇవాళ చనిపోయింది.

చిన్న వయసులోనే మలయాళ సినీ రంగంలో మంచి పేరు తెచ్చుకున్న శరణ్యకు బ్రెయిన్ ట్యూమర్ ఉన్నట్లు పదేళ్ల కిందటే నిర్థారణ అయింది. అయితే ఏమాత్రం బెరుకు లేకుండా మహమ్మారిపై ఆమె తన పోరాటాన్ని కొనసాగించింది. గడిచిన పదేళ్లలో శరణ్యకు 11 పెద్ద శస్త్రచికిత్సలు జరిగాయి. ఆ సమయంలోనే తీవ్ర ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న శరణ్యకు పరిశ్రమలోని పలువురి నటులు సహాయం అందించారు. కాగా,
ఓవైపు క్యాన్సర్ తో పారాడుతోన్న శరణ్య కొన్ని వారాల కిందట కరోనా బారినపడింది. దీంతో ఆమె పరిస్థితి విషమంగా మారింది. న్యుమోనియాతో పాటు రక్తంలో స్టోడియం స్థాయిలు పడిపోవడంతో కొన్ని రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందింది. కరోనా నుంచి కోలుకున్నప్పటికీ ఇతర అనారోగ్య సమస్యలు వెంటాడటంతో ఆమె ఆరోగ్యం మరింత క్షీణించి సోమవారం కన్నుమూసింది.

మలయాళంలో మంత్రకోడి, సీత అండ్ హరిచందనం లాంటి సినిమాలతోపాటు పలు మలయాళ టీవీ సిరియల్స్‌తోనూ శరణ్య శశి బాగా పాపులర్ అయింది. పలు సినిమాల్లో సహాయక పాత్రలను కూడా పోషించింది. శరణ్య శశి మృతిపై కేరళ సీఎం పినరయి విజయన్, మలయాళీ నటుల సంఘం, ఇతర భాషల సినీ సంఘాలు, అభిమానులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ నివాళి అర్పించారు.












Click it and Unblock the Notifications