"ఇంటర్ తర్వాత చదువు మానేయండి"
భారత విద్యా విధానంపై మార్సెలస్ ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్స్ వ్యవస్థాపకుడు సౌరభ్ ముఖర్జియా సంచలన వ్యాఖ్యలు చేశారు. మన దేశంలో ఉన్నత చదువుల కంటే ఇంటర్మీడియట్ (12వ తరగతి) పూర్తి కాగానే ఉద్యోగాల్లో చేరడం ఆర్థికంగా మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఉన్న విద్యావ్యవస్థ విద్యార్థులలో ఆలోచనా శక్తిని పెంచడం లేదని, కేవలం బట్టీ పద్ధతికే పరిమితం చేస్తోందని ఆయన విమర్శించారు.
ఒక ప్రముఖ పోడ్ కాస్ట్ లో సౌరభ్ ముఖర్జియా మాట్లాడుతూ.. భారత్ లోని పాఠశాలలు, కళాశాలల్లో ప్రణాళికాబద్ధమైన బోధన కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. పరీక్షల్లో మార్కుల కోసం విద్యార్థులు కేవలం చదివింది గుర్తుపెట్టుకుని రాయడానికే ప్రాధాన్యత ఇస్తున్నారని దుయ్యబట్టారు. ఈ కారణంగానే డిగ్రీలు పూర్తి చేసిన ప్రతి 100 మందిలో కేవలం ముగ్గురికి మాత్రమే వెంటనే ఉద్యోగాలు లభిస్తున్నాయని అధికారిక గణాంకాలను ప్రస్తావించారు. చదువుకోని వారి కంటే డిగ్రీలు ఉన్నవారే ఎక్కువ నిరుద్యోగులుగా మారుతున్నారని పేర్కొన్నారు.
ప్రస్తుతం అంతర్జాతీయంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), ఎలక్ట్రిక్ వాహనాలు (EV), బయోటెక్నాలజీ, క్లీన్ టెక్నాలజీ వంటి రంగాలు వేగంగా వృద్ధి చెందుతున్నాయి. అయితే మన దేశ విద్యావ్యవస్థలోని లోపాల వల్ల భారత్ ఈ నూతన సాంకేతిక రంగాలలో వెనుకబడి ఉందని ముఖర్జియా ఆందోళన వ్యక్తం చేశారు.
ఆధునిక పరిశ్రమలకు అవసరమైన విశ్లేషణాత్మక నైపుణ్యాలను పాఠశాల స్థాయి నుంచే నేర్పించకపోవడం వల్ల యువత సరైన ఉపాధిని పొందలేకపోతోందన్నారు. కంపెనీలు కూడా ఇప్పుడు కేవలం డిగ్రీ సర్టిఫికేట్లను చూసి ఉద్యోగాలు ఇవ్వడం లేదని నైపుణ్యాలకే ప్రాధాన్యత ఇస్తున్నాయని ఆయన తెలిపారు.
ఇంటర్మీడియట్ పూర్తి చేసి నేరుగా పనిలోకి చేరిన చాలా మంది యువకులు, గ్రాడ్యుయేట్ల కంటే ఎక్కువ సంపాదిస్తున్నారని తన 'బ్రేక్ పాయింట్' పుస్తక పరిశోధనను ఉటంకించారు. ముంబై వంటి నగరాలలో ట్రాక్టర్లు, జేసీబీలు నడిపే ఆపరేటర్లు లేదా నైపుణ్యం కలిగిన నిర్మాణ కార్మికులు.. సాధారణ కార్యాలయాల్లో ఉద్యోగాలు చేసే గ్రాడ్యుయేట్ల కంటే రెండింతలు ఎక్కువగా సంపాదిస్తున్నారని ఆయన ఉదాహరణలతో వివరించారు.

సౌరభ్ ముఖర్జియా చేసిన ఈ విమర్శలు దేశంలోని విద్యా రంగంలో తక్షణ మార్పుల అవసరాన్ని గుర్తుచేస్తున్నాయి. కేవలం డిగ్రీ పట్టాల కోసం పాకులాడకుండా, మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకోవడంపైనే యువత దృష్టి పెట్టాలి. అప్పుడే భవిష్యత్తులో మెరుగైన ఉపాధి అవకాశాలను అందుకోగలరని విశ్లేషకులు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications