రిజర్వేషన్ టికెట్ల బుకింగ్ చేసుకుంటున్నారా ? దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్..
రైల్వే స్టేషన్లలో రిజర్వేషన్ టికెట్ బుకింగ్ చేసుకుంటున్న ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే ఇవాళ మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే చౌకగా ఆహారం అందించడంతో పాటు ప్రయాణికులకు పలు సౌకర్యాలు కల్పిస్తున్న దక్షిణ మధ్య రైల్వే.. ఇప్పుడు రిజర్వేషన్ టికెట్ల బుకింగ్ లో ఎదురవుతున్న ఇబ్బందుల్ని, రద్దీని దృష్టిలో ఉంచుకుని మరో కీలక నిర్ణయం తీసుకుంది. నాలుగు రాష్ట్రాల్లోని 40 స్టేషన్లలో ప్రయాణికుల కోసం అదనపు కౌంటర్లు అందుబాటులోకి తెచ్చింది.
రిజర్వేషన్ టిక్కెట్‌లను ఇకపై మరింత సులభంగా బుక్ చేసుకునేందుకు వీలుగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని 40 రైల్వే స్టేషన్లలో 50కి పైగా అదనపు కౌంటర్లను అందుబాటులోకి తెచ్చినట్లు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఉన్న ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, కర్నాటకలోని పలు స్టేషన్లలో ఇలా అదనపు కౌంటర్లు తెరిచినట్లు అధికారులు వెల్లడించారు. అలాగే ఈ స్టేషన్ల వివరాలను కూడా ప్రకటించారు.

తెలంగాణలో సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ, లింగంపల్లి, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, మహబూబ్ నగర్, మొదలైన స్టేషన్లలో ఇలా అదనపు కౌంటర్లు అందుబాటులోకి వచ్చాయి. అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, గుంటూరు, తిరుపతి, రాజమండ్రి, అనంతపురం, ఒంగోలు, ఏలూరు, మచిలీపట్నం మొదలైన స్టేషన్లలో ఈ అదనపు కౌంటర్లు అమల్లోకి తెచ్చారు. మహారాష్ట్రలోని నాందేడ్, ఔరంగాబాద్, జల్నా, పర్భానీ, అలాగే కర్ణాటకలోని బీదర్, రాయచూర్ స్టేషన్లలోనూ అదనపు కౌంటర్లు అందుబాటులోకి వచ్చాయి.
దక్షిణ మధ్య రైల్వే తాజా నిర్ణయంతో స్టేషన్లలో ఇకపై రద్దీగా క్యూలైన్లలో గంటల తరబడి నిలబడే ఇబ్బంది తొలగిపోనుంది. అలాగే పండుగలు, ఇతర సెలవు దినాల్లో రద్దీని తట్టుకునేందుకు రైల్వేకు కూడా అవకాశం కలుగుతుంది. ఈ అదనపు కౌంటర్ల కారణంగా గతంతో పోలిస్తే రద్దీ తగ్గుతుందని, ప్రయాణికులకు తక్కువ సమయంలో రిజర్వేషన్ టికెట్లు బుక్ చేసుకునేందుకు అవకాశం ఉంటుందని అధికారులు చెప్తున్నారు.












Click it and Unblock the Notifications