పట్టాలు తప్పిన సికింద్రాబాద్- షాలిమార్ ఎక్స్‌ప్రెస్..
దేశంలో గత కొన్ని రోజుల నుంచి వరుస రైలు ప్రమాదాలు జరగడం చూస్తున్నాం. తాజాగా పశ్చిమ బెంగాల్లో మరో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. సికింద్రాబాద్ టు షాలిమార్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ నేడు (నవంబర్ 9 శనివారం) నల్పూర్‌లో పట్టాలు తప్పింది. ఈ సంఘటనలో షాలిమార్ ఎక్స్ ప్రెస్ మూడు బోగీలు పట్టాలు తప్పినట్లు తెలుస్తోంది.
ఈ రైలు ప్రమాదంలో పలువరు ప్రయాణికులు గాయపడినట్లు తెలుస్తోంది. ఈ ట్రైన్ సికింద్రాబాద్ నుండి షాలిమార్ వెళ్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న రైల్వే ఆధికారులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు వేగవంతం చేశారు.

ఈ ప్రమాదంలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది. రైల్వే అందించిన సమాచారం మేరకు.. అయితే, ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, ఒకరిద్దరూ ప్రయాణీకులకు మాత్రమే స్వల్ప గాయాలయ్యాయని పేర్కొన్నారు. సంఘటన స్థలంలో రైల్వే అధికారులు, సిబ్బంది సహయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదం కారణంగా ట్రాక్ మీద అడ్డంగా ఉన్న బోగీలను రైల్వే సిబ్బంది పక్కకు తొలగించారు. అధికారులు, రైల్వే సిబ్బంది కలిసి యుద్ధ ప్రాతిపదికన ట్రాక్ మరమ్మత్తు పనులు చేపట్టారు.

పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం...
సికింద్రాబాద్ నుంచి షాలిమార్ వెళ్తున్న ట్రైన్ పట్టాలు తప్పడంతో ఈ మార్గంలో వెళ్లే పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. రైలు పట్టాలు తప్పడానికి గల కారణాలపై రైల్వే శాఖ అధికారులు ఆరా తీస్తున్నారు. ఇక, ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications