ప్రధాని మోదీ వైపు దూసుకెళ్లిన గుర్తు తెలియని వ్యక్తి..
బెంగళూరు: కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల గడువు సమీపిస్తోంది. ఏప్రిల్ మొదటివారంలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. మే 12వ తేదీన పోలింగ్ జరగొచ్చనే అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలన్నీ తమ ప్రచార కార్యక్రమాలను విస్తృతం చేస్తోన్నాయి. జిల్లాల్లో పర్యటిస్తోన్నాయి. అధికార భారతీయ జనతా పార్టీ, ప్రతిపక్ష కాంగ్రెస్, జనతాదళ్ (సెక్యులర్).. సీనియర్ నేతలు రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలను నిర్వహిస్తోన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి కర్ణాటకలో అడుగు పెట్టారు. నెల రోజుల వ్యవధిలో ఆయన కర్ణాటక పర్యటనకు రావడం ఇది మూడోసారి. ఇదివరకు శివమొగ్గలో విమానాశ్రయాన్ని ప్రారంభించారు. అనంతరం మండ్యలో బెంగళూరు-మైసూరు జాతీయ రహదారిని అందుబాటులోకి తీసుకొచ్చారు. హుబ్బళ్లి రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులనూ ఆయన ప్రారంభించారు. ఇవ్వాళ మోదీ బెంగళూరులో పర్యటించారు. కొత్త మెట్రో రైలును అందుబాటులోకి తీసుకొచ్చారు.

బెంగళూరు వైట్ ఫీల్డ్- కృష్ణరాజపుర 13.50 కిలోమీటర్ల మేర నిర్మించిన ఈ కొత్త మెట్రో రైల్వే లైన్ ను మోదీ ప్రారంభించారు. అనంతరం అందులో ప్రయాణించారు. గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్, ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై సహా, పలువురు మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాడుగోడి మెట్రో స్టేషన్ లో కౌంటర్‌లో టిక్కెట్‌ను కొనుగోలు చేశారు మోదీ. వైట్ ఫీల్డ్ నుంచి శ్రీ సత్యసాయి హాస్పిటల్ స్టేషన్ వరకు ట్రావెల్ చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ- కొందరు విద్యార్థులు, మెట్రో రైల్ ఉద్యోగులు, కార్మికులతో ముచ్చటించారు. మెట్రో రైలు అనుభవాలను అడిగి తెలుసుకున్నారు.
#WATCH | Karnataka: Security breach during PM Modi's roadshow in Davanagere, earlier today, when a man tried to run towards his convoy. He was later detained by police.
— ANI (@ANI) March 25, 2023
(Visuals confirmed by police) pic.twitter.com/nibVxzgekz
అనంతరం ఆయన దావణగెరెకు బయలుదేరి వెళ్లారు. విజయ సంకల్ప యాత్రలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు నళిన్ కుమార్ కటీల్, మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప, పలువురు మంత్రులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. బహిరంగ సభ ప్రారంభం కావడానికి ముందు ప్రధాని మోదీ- రోడ్ షో నిర్వహించారు. బహిరంగ సభా వేదిక వద్దకు ర్యాలీగా తరలి వెళ్లారు. ఆ సమయంలో మోదీ భద్రత వైఫల్యం చోటు చేసుకుంది.
రోడ్ షోలో ప్రజలకు అభివాదం చేసుకుంటూ వెళ్తోన్న సమయంలో ఓ వ్యక్తి ఆయన కాన్వాయ్ వైపు దూసుకెళ్లాడు. మోదీ ప్రయాణిస్తోన్న వాహనాన్ని చేరుకునే ప్రయత్నం చేశాడు. రోడ్డుకు ఒకవైపు ఏర్పాటు చేసిన బ్యారికేడ్లను దాటుకుని ఆ వ్యక్తి కాన్వాయ్ వైపు రావడాన్ని గమనించిన భద్రత సిబ్బంది అప్రమత్తం అయ్యారు. రోడ్డెక్కడానికి ముందే అతన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. లాఠీలకు పనిచెప్పారు పోలీసులు. అతణ్ని అదుపులోకి తీసుకున్నారు.












Click it and Unblock the Notifications