బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం, అల్పపీడనం: ఏపీలో ఈ జిల్లాల్లో వర్షాలు
దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాల సందడి మందగించింది. వాటి రాక ఆలస్యం కావడం వల్ల సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతోంది. దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాలపై ఇప్పటికే దీని ప్రభావం పడింది కూడా. 315 జిల్లాల్లో సగటు కంటే 43 శాతం లోటు వర్షం కురిసింది. జూలై 2వ తేదీ నాటికీ పరిస్థితుల్లో ఎటువంటి మార్పు ఉండకపోవచ్చని భారత వాతావరణ కేంద్రం అంచనా వేసింది. దీనికి ప్రధాన కారణం.. ఎల్ నినో.
ఈ పరిస్థితుల్లో ఐఎండీ తీపికబురు ఇచ్చింది. బంగాళాఖాతంలో వాతావరణం వేగంగా మారుతోంది. జూలై మొదటి వారంలో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది. దీని ప్రభావం ఏపీ, తెలంగాణ, ఒడిశాపై అధికంగా ఉంటుందని తెలిపింది. రానున్న రోజుల్లో వర్షాలు కురిసేందుకు అనుకూల పరిస్థితులు ఏర్పడనున్నాయి. సాధారణంగా ఇటువంటి వాతావరణ మార్పులు రుతుపవనాల పురోగతికి ఊతం ఇవ్వొచ్చు.

ఒడిశా తీరానికి సమీపంలో బంగాళాఖాతం వాయువ్య ప్రాంతంలో జూలై 2వ తేదీ నాటికి ఉపరితల ఆవర్తనం బలపడనుంది. ఆ తర్వాత 3, 4వ తేదీ నాటికి మరింత బలపడి బంగాళాఖాతంలో ఉత్తర ప్రాంతం వైపు కదులుతుంది. క్రమంగా అల్పపీడనంగా ఏర్పడే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది. దీని ప్రభావం.. తీరప్రాంత రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఏపీ, తమిళనాడుతో పాటు తెలంగాణపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉంది.
దీని ప్రభావంతో నేడు ఏపీలో పలు జిల్లాల్లో చెదురుమదురు నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, ఉత్తర కోస్తా తీర జిల్లాలు కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, మధ్య కోస్తా ప్రాంతాలు కృష్ణాతో పాటు ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో చెదురుమదురుగా తేలికపాటి- మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు పడొచ్చు. రాయలసీమలోని తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప జిల్లాల్లో తేలికపాటి జల్లులు కురుస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ అంచనా వేసింది. అక్కడక్కడ పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఆకాశం మేఘావృతమై ఉరుములు వినిపించిన వెంటనే చెట్ల కింద, పోల్స్ దగ్గర ఉండకుండా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని కోరింది.












Click it and Unblock the Notifications