కేసుల్లో కూరుకుపోతున్న విజయ్
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన కరూర్ తొక్కిసలాట ఘటనలో భారీగా అరెస్టులు చోటు చేసుకుంటోన్నాయి. ఈ ఘటనకు సంబంధించి యూట్యూబర్ కమ్ జర్నలిస్ట్ ఫెలిక్స్ గెరాల్డ్‌ను చెన్నై సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై ఆయన చిత్రీకరించిన ప్రచురించిన వీడియోల నిమిత్తం విచారణ కోసం ఆయనను అదుపులోకి తీసుకున్నారు. తొక్కిసలాట ఘటనకు సంబంధించి నకిలీ వార్తలను ప్రచారం చేశారనే ఆరోపణలు ఆయనపై ఉన్నాయి.
తాజాగా విజయ్ ఎన్నికల ప్రచార వాహనం డ్రైవర్‌పై కేసు నమోదైంది. మనుషుల ప్రాణాలకు ముప్పు వాటిల్లేలా వాహనం నడిపినందుకు కరూర్ వేలాయుధపాళ్యం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వాహనాన్ని సీజ్ చేశారు. ప్రమాదానికి కారణమైన విజయ్ ప్రచార వాహనాన్ని ఎందుకు స్వాధీనం చేసుకోకూడదని మద్రాస్ హైకోర్టు పోలీసు అధికారులను ప్రశ్నించిన మరుసటి రోజే ఈ ఘటన చోటు చేసుకుంది.

తొక్కిసలాట ఘటనపై దాఖలైన పిటీషన్ విచారణ సందర్భంగా మద్రాస్ హైకోర్టు టీవీకేపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. విజయ్ ప్రచార వాహనం ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడాన్నీ తప్పుపట్టింది. ఈ ఘటనలో విజయ్ ప్రచార వాహనాన్ని ఇంకా ఎందుకు ఇంకా ఎటువంటి చర్యలు తీసుకోలేదని, వాహనాన్ని ఇంకా స్వాధీనం చేసుకోలేదని నిలదీసింది. వాహనం ప్రయాణించిన మార్గంలో బయటి, లోపలి సీసీటీవీ ఫుటేజీని స్వాధీనం చేసుకోవాలని కూడా కోర్టు ఆదేశించింది.
కరూర్ ఘటన మానవ తప్పిదమని, చట్టానికి ఎవరూ అతీతులు కారని స్పష్టం చేసింది. పిల్లలు మరణించినా కూడా విజయ్ అక్కడి నుంచి వెళ్లిపోయాడని, తన అనుచరులను వదిలేసిన వ్యక్తికి నాయకత్వ లక్షణాలు లేవని కఠినంగా వ్యాఖ్యానించింది. ఇది ఎలాంటి రాజకీయ పార్టీ అని కోర్టు అసహనం వ్యక్తం చేసింది. కేసు దర్యాప్తులో ప్రభుత్వం ఎందుకు వెనుకాడుతోందని ప్రశ్నించింది. దీంతో పోలీసులు సత్వరమే స్పందించారు. విజయ్ ప్రచార వాహనం కేసు నమోదు చేశారు.
ద్విచక్ర వాహనంపై వచ్చిన యువకుడు చంద్రుపైనా కేసు పెట్టారు. అలాగే- ఆ వాహనం డ్రైవర్ పై హిట్ అండ్ రన్ కింద కేసు నమోదు చేశారు పోలీసులు. టీవీకే కార్యాలయం నుంచి ఈ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీస్ స్టేషన్ కు తరలించారు. ప్రస్తుతం విజయ్ ప్రచార వాహనం చెన్నై పనయూరులో నిలిపి ఉంచారు. దీనిపై తదుపరి విచారణ కొనసాగుతోంది. మద్రాస్ హైకోర్టు జోక్యం అనంతరం మరిన్ని అరెస్టులు ఉండొచ్చని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications