అరెస్ట్ చేసినా డబ్బు రాబట్టలేరు: మాల్యా ఆసక్తికర వ్యాఖ్య
లండన్: కింగ్ ఫిషర్ అధినేత, వేల కోట్లు ఎగ్గొట్టి విదేశాల్లో ఉంటున్న విజయ్ మాల్యా ఆసక్తికర, సంచలన వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది. తన పాస్‌పోర్టు రద్దు చేసినా, తనను అరెస్టు చేసినా తన నుంచి డబ్బులు రాబట్టలేరని ఆయన వ్యాఖ్యానించాడని తెలుస్తోంది.
రుణం మొత్తం చెల్లించడం తన వల్ల అయ్యే పని కాదని తేల్చి చెప్పాడు. అలాగని రుణాలను ఎగ్గొట్టనని, తీసుకున్న రుణంలో శక్తిమేర చెల్లిస్తానని చెప్పాడు. అరెస్ట్ చేస్తే, పాస్‌పోర్ట్ రద్దు చేస్తే డబ్బులు ఎలా వస్తాయని ప్రశ్నించాడు. కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ కోసం తీసుకున్న రుణాన్ని తాను దుర్వినియోగం చేయలేదని చెప్పాడు.
తాను భద్రతా కారణాలతోనే లండన్‌లో ఉంటున్నానని చెప్పాడు. తాను లండన్‌ను విడిచి ఎక్కడకు వెళ్లనని స్పష్టం చేశాడు. తాను భారత్ వదిలి రావాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పాడని తెలుస్తోంది. అతను ఓ మీడియా సంస్థకు నాలుగు గంటల పాటు ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందులో పైవ్యాఖ్యలు చేశాడు.

మాల్యాను అప్పగించండి
విజయ్ మాల్యాను వెనక్కి పంపించాలని యూకేను భారత ప్రభుత్వం అధికారికంగా కోరింది. బ్యాంకులకు చెల్లించాల్సిన వేల కోట్ల రూపాయల రుణం చెల్లించకుండా విజయ్ మాల్యా లండన్‌లో ఉంటున్నాడు.
ఆయన బిలియన్ డాలర్ల రుణానికి సంబంధించి భారత్ విచారించాల్సి ఉందని, తప్పకుండా మాల్యాను వెనక్కి పంపాలని భారత విదేశాంగ శాఖ బ్రిటన్ ప్రభుత్వానికి లేఖ రాసింది. మాల్యా మార్చి రెండో తేదిన దేశం విడిచి లండన్‌కు వెళ్లిపోయిన విషయం తెలిసిందే.
విచారణకు హాజరవ్వాలని ఈడీ పలుమార్లు సమన్లు పంపినా పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మాల్యా పాస్‌పోర్టును కూడా రద్దు చేసింది. ఆయన రాజ్యసభ సభ్యత్వాన్ని రద్దు చేసే దిశలోను ఆలోచన చేస్తున్నారు. రాజ్యసభ సభ్యత్వం ఎప్పుడైన రద్దయ్యే అవకాశముంది.
విజయ్ మాల్యా 2003లో కింగ్‌ఫిషర్ ఎయిర్ లైన్స్‌ను ప్రారంభించారు. సాధారణ ధరలకే భారతీయులకు లగ్జరీ ప్రయాణం అందిస్తామంటూ ప్రారంభించిన ఈ ఎయిర్ లైన్స్ 2012కల్లా దివాలా తీసి మూతపడింది. మాల్యా పలు బ్యాంకుల వద్ద తీసుకున్న వేల కోట్ల రూపాయల రుణాలు చెల్లించకుండా లండన్ వెళ్లారు. దీనిపై సీబీఐ విచారణ కూడా జరుగుతోంది.












Click it and Unblock the Notifications