Movie Tickets: సినిమా టికెట్ల ధరలకు రూ.200 పరిమితిపై హైకోర్టు స్టే..!
సినిమా టికెట్ల ధరల కారణంగా జనం థియేటర్లకు రావడం లేదన్న విమర్శల నేపథ్యంలో చిత్ర పరిశ్రమలు, ప్రభుత్వాలు వీటిపై సీరియస్ గానే ఫోకస్ పెట్టాయి. ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించడం కోసం కొత్త సినిమాలకు రేట్లు కూడా పెంచకుండా జనాన్ని ఆహ్వానిస్తున్నాయి. మరికొన్ని ప్రభుత్వాలు సినిమా టికెట్ల రేట్లపై పరిమితులు కూడా విధిస్తున్నాయి. ఇదే క్రమంలో తాజాగా ఓ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఇలాంటి నిర్ణయంపై హైకోర్టు స్టే ఇచ్చింది.
కర్నాటకలో సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సినిమా టికెట్ల ధరలపై రూ.200 పరిమితి విధిస్తూ గతంలో నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ముసాయిదా నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. వినోదపు పన్నుతో కలిపి టికెట్ రేటు రూ.200 దాటకూడదంటూ సింగిల్ స్క్రీన్లతో పాటు మల్టీప్లెక్స్ లపైనా ఆంక్షలు విధించింది. సామాన్యులకు సినిమాను అందుబాటులోకి తెచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం సిద్దరామయ్య అసెంబ్లీలో ప్రకటించారు. దీనిపై మిశ్రమ స్పందన వచ్చింది.

కర్నాటక ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా,, ఫిల్మ్ ప్రొడక్షన్ కంపెనీలు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. వీటిపై విచారణ జరిపిన హైకోర్టు.. ఇవాళ కీలక నిర్ణయం తీసుకుంది. సినిమా టికెట్లపై రూ.200 పరిమితి విధిస్తూ కర్నాటక సర్కార్ తీసుకున్న నిర్ణయంపై స్టే ఇచ్చింది. ఈ వ్యవహారంపై విచారణ జరిపి తుది నిర్ణయం తీసుకునే వరకూ ప్రభుత్వ నిర్ణయం అమలు కాకుండా ఉత్తర్వులు ఇచ్చింది.

దీంతో కర్నాటకలో సామాన్యులకు సినిమాను అందుబాటులోకి తీసుకురావాలన్న సిద్దరామయ్య సర్కార్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అన్ని రాష్ట్రాల్లో కార్యకలాపాలు సాగిస్తున్న మల్టీప్లెక్స్ సంస్థలు ఒక్క కర్నాటకలోనే ఇలా ధరలు తగ్గించేందుకు సిద్దంగా లేవు. దీంతో ప్రభుత్వంపై అన్ని రకాలుగా ఒత్తిడి పెంచుతున్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం వెనక్కి తగ్గేందుకు ససేమిరా అంటోంది. ఈ నేపథ్యంలో కర్నాటక హైకోర్టు తీసుకున్న నిర్ణయం ప్రభుత్వానికి షాకిచ్చింది.












Click it and Unblock the Notifications