పౌరసత్వ చట్టం ఎఫెక్ట్: బెంగళూరులో భారీ మద్దతు, వ్యతిరేకంగా ముస్లింలు ర్యాలీ, డబ్బులు, బిర్యానీలు !
బెంగళూరు: పౌరసత్వ చట్టానికి (సీఏఏ) వ్యతిరేకంగా దేశంలో అనేక రాష్ట్రాల్లో ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ గొడవల్లో అనేక మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. బెంగళూరు నగరంలోని టౌన్ హాల్ ముందు పౌరసత్వ సవరణ చట్టానికి మద్దతుగా భారీ ర్యాలీ, ప్రదర్శన నిర్వహించారు. పౌరసత్వ సవరణ చట్టానికి మద్దతుగా జరిగిన భారీ ర్యాలీ, ప్రదర్శనలో మొదట కొంత మంది మాత్రమే పాల్గొన్నారు. అయితే కొంత సేపటికే మద్దతు తెలిపే వారి సంఖ్య వేలకు చేరింది. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా బెంగళూరు నగరంలో సోమవారం ముస్లీం సోదరులు భారీ ర్యాలీ నిర్వహించారు. సీఏఏకి మద్దతుగా డబ్బులు, బిర్యానీలు పంచిపెడితే ఇక్కడికి ఎవ్వరూ రాలేదని బీజేపీ నాయకులు అన్నారు.

నకిలీ మతస్తుల దందా
భారతదేశంలో అక్రమంగా ప్రవేశించి భారత పౌరసత్వం సంపాధించడానికి కొన్ని మతాలకు చెందిన నకిలీ మతస్లుల ముసుగులో అక్రమాలకు పాల్పడుతున్నారని, వారికి కళ్లేం వెయ్యడానికే ఈ చట్టం తీసుకువచ్చారని పలువురు ఆరోపించారు. కొన్ని వర్గాల వారి దందాలను అడ్డుకోవడానికే పౌరసత్వం సవరణ చట్టానికి మద్దతు ఇస్తున్నామని వారు అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఎవ్వరికీ ఇబ్బంది లేదు
పౌరసత్వ సవరణ చట్టం వలన భారతదేశంలో ఉన్న ఏ మతానికి ఇబ్బంది లేదని, కొందరు రాజకీయం చెయ్యడానికి ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇస్తున్నారని సీఏఏకి మద్దతు ఇస్తున్న వారు ఆరోపించారు. పౌరసత్వ సవరణ చట్టం వలన భారతదేశంలోని ముస్లీంలకు ఎలాంటి ఇబ్బందులు లేవని, వారు స్వేచ్చగా ఇక్కడ జీవించడానికి అవకాశం ఉందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు.

డబ్బులు, బిర్యానీలు ఇస్తే రాలేదు
పౌరసత్వ సవరణ చట్టానికి మద్దతు ఇస్తున్న వారిని ఉద్దేశించి బెంగళూరు నగరానికి చెందిన బీజేపీ ఎంపీ తేజస్వి సూర్యా మాట్లాడుతూ డబ్బులు, బిర్యానీ ప్యాకెట్లు ఇస్తే ఇక్కడ మద్దతు ఇస్తున్న వారు ఎవ్వరూ లేరని అన్నారు. స్వచ్చందంగా ఇక్కడికి వచ్చిన ప్రజలు పౌరసత్వ సవరణ చట్టానికి మద్దతుగా నినాదాలు చేస్తున్నారని, వీరే నిజమైన దేశభక్తులు అని బీజేపీ ఎంపీ తేజస్వి సూర్యా చెప్పారు.

మహమ్మద్ ఆలీ జిన్నా పనే
1947లో ఉమ్మడి భారతదేశాన్ని మతాలను బట్టి విభజించారని, తరువాత మహమ్మద్ ఆలీ జిన్నా పాకిస్తాన్ లో కుర్చొని ఇక్కడ ఉన్న హిందువులను బానిసల్లా చూస్తామని అన్నారని బీజేపీ నాయకులు ఆరోపించారు. ఆ రోజే పాకిస్తాన్ లో ఉన్న హిందువులను భారత్ కు తీసుకురావాలని డాక్టర్ బీఆర్. అంబేద్కర్ చెప్పారని బీజేపీ ఎంపీ తేజస్వి సూర్యా అన్నారు.

ఎవ్వరికీ ఏ హానీ జరగదు
పౌరసత్వ సవరణ చట్టానికి మద్దతుగా మేము ఇక్కడ శాంతియుతంగా ప్రదర్శన నిర్వహిస్తున్నామని, కాంగ్రెస్ కార్యకర్తలు లాగా తాము బస్సుల మీద రాళ్లు రువ్వలేదని, ప్రజలు, ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించలేదని బీజేపీ నాయకులు అన్నారు. దేశంలో ఈ రోజు ఇలా గొడవలు జరగడానికి కారణం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కారణం అని బీజేపీ నాయకులు ఆరోపించారు. మమతా బెనర్జీ దీదీ అనిపిలిచే వారని, ఇప్పుడు ఛీ ఛీ అని పిలుస్తున్నారని బీజేపీ నాయకులు ఆరోపించారు.












Click it and Unblock the Notifications