హైవేపై అదుపు తప్పిన కంటైనర్: వాహనాలు నుజ్జునుజ్జు- 10 మంది దుర్మరణం
ముంబై: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 10 మంది దుర్మరణం పాలయ్యారు. 28 మంది గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే హైవే పెట్రోలింగ్, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలను చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. గాయపడ్డ వారిని సమీప ఆసుపత్రికి తరలించారు.
మహారాష్ట్రలోని ధూలే జిల్లా షిర్పూర్ సమీపంలో ఈ మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. జాతీయ రహదారిపై వేగంగా వెళ్తోన్న ఓ భారీ కంటైనర్ అదుపు తప్పడమే ఈ ఘోర రోడ్డు ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు. అదుపు తప్పిన కంటైనర్.. సినీ ఫక్కీలో ప్రమాదానికి గురైంది. రోడ్డుపై రాకపోకలు సాగిస్తోన్న పలు వాహనాలను ఢీ కొడుతూ వెళ్లింది.

రోడ్డు మధ్యలో ఉండే డివైడర్‌ను సైతం దాటుకుని అటుగా వెళ్తోన్న వాహనాలను కూడా ఢీ కొట్టింది. అనంతరం బోల్తా పడింది. ఈ ఘటనలో ఆయా వాహనాల్లో ప్రయాణిస్తోన్న వారిలో 10 మంది దుర్మరణం పాలయ్యారు. 28 మంది గాయపడ్డారు. కొన్ని వాహనాలు తుక్కు తుక్కయ్యాయి. ఒకట్రెండు కార్లు నామరూపాల్లేకుండా ధ్వంసం అయ్యాయి.
ఈ ఘటనలో ఏడుమంది అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. ఆసుపత్రికి తరలిస్తోండగా.. మరో ముగ్గురు మరణించారు. వివిధ వాహనాలను ఢీ కొట్టడం వల్ల అందులో ప్రయాణిస్తోన్న 28 మంది గాయపడ్డారు. వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు.

కార్లల్లో ఇరుక్కుపోయిన మృతదేహాలను వెలికి తీయడానికి శ్రమించాల్సి వచ్చింది. స్థానికులు వారికి సహకారం అందించారు. ధ్వంసమైన కార్లు, పగిలిన అద్దాలతో సంఘటన స్థలం మొత్తం భీతావహంగా మారింది. ఈ ఘటనతో జాతీయ రహదారిపై రెండు వైపులా వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి.












Click it and Unblock the Notifications