అనేక స్కూళ్లకు బాంబు బెదిరింపులు: ఉలిక్కిపడ్డ బెంగళూరు- ఉద్రిక్తత
Bengaluru: బెంగళూరులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నగరంలోని పలు స్కూళ్లకు బాంబు బెదిరింపులు అందాయి. దాదాపుగా అరగంట వ్యవధిలో 15కు పైగా పాఠశాలలకు బెదిరింపు ఇ-మెయిల్స్ అందాయి. ఈ ఘటనతో విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
ఈ ఉదయం 8 గంటల సమయంలో పాఠశాలలు తెరచుకున్న కొద్దిసేపటికే ఈ మెయిల్స్ అందాయి. ఆయా పాఠశాలలన్నీ బసవేశ్వర నగర, యలహంక, సదాశివ నగర పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉన్నాయి. మొత్తంగా ఏకకాలంలో15 పాఠశాలలకు బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చినట్లు తేలింది.

వాటిని చూసిన వెంటనే ఆయా పాఠశాలల యాజమాన్యం పోలీస్ స్టేషన్లకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న వెంటనే బెంగళూరు నగర పోలీసులు యుద్ధ ప్రాతిపదికన చర్యలకు దిగారు. బాంబు బెదిరింపు మెయిల్స్ అందిన పాఠశాలలన్నింటికీ బాంబు డిస్పోజల్ స్క్వాడ్‌ను పంపించారు.
పాఠశాలలకు బాంబు బెదిరింపుల నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్.. సదాశివ నగర్‌లోని నీవ్ అకాడమీ పాఠశాలను సందర్శించారు. పోలీసులతో మాట్లాడారు. టీవీ ద్వారా ఈ సమాచారం తనకు తెలిసిందని, వెంటనే తన ఇంటికి దగ్గరలో ఉన్న నీవ్ పాఠశాలకు వచ్చానని అన్నారు.
ఈ ఘటనపై బెంగళూరు నగర పోలీస్ కమిషనర్ బీ దయానంద.. స్పందించారు. పిల్లలు, తల్లిదండ్రులు భయపడాల్సిన అవసరం లేదని, బాంబు డిస్పోజల్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టారని పేర్కొన్నారు. సంఘటన స్థలంలో పోలీసులను మోహరింపజేసినట్లు వివరించారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొంటామని అన్నారు.












Click it and Unblock the Notifications