అసాధారణ వర్షాలు: మరో 5 రోజులపాటు: ఐఎండీ వార్నింగ్
ముంబై: నైరుతి రుతుపవనాల ప్రభావంతో మహారాష్ట్రలో అసాధారణ వర్షాలు కురుస్తోన్నాయి. అతి భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఈదురుగాలులు వణికిస్తోన్నాయి. ఏకధాటిగా కురుస్తోన్న వర్షాల దెబ్బకు జనజీవనం అస్తవ్యస్తమైంది. వాహనాల రాకపోకలు ఎక్కడికక్కడ స్తంభించిపోయాయి. చెట్లు విరిగిపడటంతో ఒకరు మరణించారు.
ఒక్క ముంబైలో మాత్రమే కాదు.. పొరుగునే ఉన్న థానె సహా మరో ఎనిమిది జిల్లాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. వర్షాల తీవ్రత మరో అయిదు రోజుల పాటు ఉంటుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్‌ను జారీ చేసింది. అత్యవసరమైన పనులు ఉంటే తప్ప ప్రజలు బయటికి వెళ్లొద్దంటూ సూచించింది.

ఈ హెచ్చరికల నేపథ్యంలో- బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అప్రమత్తమైంది. లోతట్టు ప్రాంతాలవాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించింది. వారి కోసం ప్రత్యేకంగా సహాయక శిబిరాలను ఏర్పాటు చేసింది. రౌండ్ ద క్లాక్ పనిచేసేలా కంట్రోల్ రూమ్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది. మహారాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తోంది.
#WATCH | Maharashtra: Andheri Subway waterlogged in Mumbai as rain continues to lash the city pic.twitter.com/YRfX3RbO2v
— ANI (@ANI) June 28, 2023
ముంబై, థానె, రత్నగిరి, పాల్ఘర్, రాయగఢ్..వంటి జిల్లాల్లో రాత్రి నుంచీ భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. మధ్యాహ్నం వరకు తెరిపినివ్వలేదు. బలమైన ఈదురుగాలులు వీచాయి. 24 గంటల వ్యవధిలో 26 చోట్ల చెట్లు పడిపోయాయంటే గాలుల తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. భారీ వర్షాలకు అనేక ప్రాంతాలు జలమయం అయ్యాయి.
అండర్‌పాస్‌లన్నీ వరదనీటితో నిండిపోయాయి. వాహనాల రాకపోకలు ఎక్కడికక్కడ స్తంభించాయి. సబర్బన్ రైళ్లు పాక్షికంగా రద్దయ్యాయి. మలాడ్‌లో చెట్టు కూలిపోవడంతో కౌశల్ దోషి అనే వ్యక్తి మరణించాడు. గాయపడ్డ అతణ్ని హుటాహుటిన శతాబ్ది ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మరణించినట్లు డాక్టర్లు ధృవీకరించారు. వరద ముంచెత్తడంతో అంధేరీ సబ్‌వేలో రెండు అడుగుల మేర నీళ్లు నిలిచిపోయాయి. బీఎంసీ అధికారులు దీన్ని మూసి వేశారు.












Click it and Unblock the Notifications