శరద్ పవార్ సంచలన ప్రకటన..ఎన్నికల్లో పోటీకి దూరం
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ సంచలన ప్రకటన చేశారు. ఇక మీద తాను ఏ ఎన్నికల్లో పోటీ చేయబోనని స్పష్టం చేశారు. అయితే ఇదే సమయంలో పార్టీ పటిష్టత కోసం పని చేస్తానని ఆయన తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శరద్ పవార్ మంగళవారం బారామతి నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన అక్కడకి వచ్చిన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. తన రాజ్యసభ పదవీకాలం ఇంకా ఏడాదిన్నర ఉందని, ఇది ముగిసిన తర్వాత మరో సారి సభకు వెళ్లాలా వద్దా అనే దానిపై నిర్ణయం తీసుకుంటానని చెప్పారు.
లోక్ సభకు మాత్రం పోటీ చేయబోనని తేల్చి చెప్పారు. నేను ఇక ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయదలచుకోలేదు. కొత్త తరం ముందుకు రావాలి. ఇప్పటి వరకు 14 సార్లు ఎన్నికల్లో పోటీ చేశా. నాకు అధికారం అక్కర్లేదు. ఇప్పటి వరకు 14 సార్లు పోటీ చేసినా ఒక్కసారి కూడా ప్రజలు ఇంట్లో కూర్చోబెట్టలేదని తెలిపారు.సమాజం కోసం మాత్రమే పని చేయాలనుకుంటున్నా అని ఆయన చెప్పుకొచ్చారు.30 ఏళ్లు పనిచేసే నాయకత్వాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం ఉత్కంఠగా కొనసాగుతున్న సమయంలో శరద్ పవార్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.ఆయన ఎన్నికలకు దూరంగా ఉండటం ఎన్సీపీకి కొంత నష్టమే అని చెప్పాలి. అయితే ఆయన పార్టీ వ్యవహారాలను చూసుకుంటానని చెప్పడంతో ఆయన ఇప్పట్లో రాజకీయాల నుంచి రిటైర్మెంట్ అయ్యే ఆలోచనలో లేరని అర్థం అవుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో జరుగుతున్న ఈ ఎన్నికల్లో ప్రజలకు ఏ కూటమికి పట్ట కడతారో అని దేశమంతా అతృతుగా ఎదురు చూస్తోంది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 20న జరగనుండగా, మొత్తం 288 నియోజకవర్గాలకు నవంబర్ 23న కౌంటింగ్ జరగనుంది.












Click it and Unblock the Notifications