నేరుగా రాహుల్‌తో పార్టీ మార్పు పై తేల్చేసిన శశిథరూర్..!!
కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ తేల్చేసారు. కొంత కాలంగా బీజేపీ అధినాయకత్వంతో సత్సంబంధాలు కొనసాగిస్తున్న శశిథరూర్ తీరు కేరళ అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ హైకమాండ్ కు పరీక్షగా మారింది. ఈ సమయంలో కాంగ్రెస్ చీఫ్ మల్లిఖార్జున ఖర్గే... అగ్రనేత రాహుల్ తో పార్లమెంట్ తో శశిథరూర్ సుదీర్ఘంగా భేటీ అయ్యారు. పార్టీలో పరిస్థితులు... కేరళ అసెంబ్లీ ఎన్నికల పైన చర్చించారు. పార్టీలోని లోపాలను ప్రస్తావించారు. అదే సమయంలో తాను కాంగ్రెస్ లో కొనసాగటం పైన శశిథరూర్ తేల్చి చెప్పారు.
కొంత కాలంగా బీజేపీ అగ్ర నాయకత్వంతో కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ సత్సంబంధాలు కొనసాగిస్తూ సొంత పార్టీలో కలకలం రేపారు. శశిథరూర్ తీరు పైన సొంత పార్టీ నేతలే ఆగ్రహంతో ఉన్నారు. ప్రధాని మోదీ స్వయంగా శశిథరూర్ పైన ప్రశంసలు కురిపించటంతో ఆయన ఇక కాంగ్రెస్ లో కొనసాగటం కష్టమనే అభిప్రాయం వ్యక్తమైంది. త్వరలోనే బీజేపీ గూటికి చేరుతారని అందరూ భావించారు. అయితే, ఈ సమయంలో ఆకస్మికంగా పార్లమెంట్ ప్రాంగణంలో ఏఐసీసీ అధ్యక్షుడు, ఎంపీ మల్లికార్జున ఖర్గేతో పాటు లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో శశిథరూర్ సమావేశం ఆసక్తిగా మారింది. సుదీర్ఘంగా సాగిన ఈ భేటీలో అనేక అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. ఆపరేషన్ సింథూర్ సమయం నుంచి శశిథరూర్ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పైన ప్రశంసలు కురిపిస్తూ.. సొంత పార్టీ నేతలకు పజిల్ గా మారారు. ఆ తరువాత ఆపరేషన్ సిందూర్ నిర్వహణ పై ప్రపంచ దేశాలకు వివరించేందుకు కేంద్రం ఎంపీలతో కమిటీలు ఏర్పాటు చేసింది.

పార్టీ మార్పు పై క్లారిటీ
దీంతో, కాంగ్రెస్ ఇచ్చిన జాబితా లో శశిథరూర్ పేరు లేకపోయినా.. కేంద్రం తమ లిస్టులో ఆయన పేరు చేర్చింది. దీనిపై కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయనను ఎలా ఎంపిక చేస్తారని కేంద్రం వైఖరిని ఆ పార్టీ నిలదీసింది. ఆ క్రమంలో కాంగ్రెస్ పార్టీలో శశిథరూర్ పాత్ర దాదాపుగా బలహీనంగా మారింది. బీజేపీలోకి శశిథరూర్ వెళ్లిపోతున్నారంటూ ఒక ప్రచారం సైతం ఊపందుకొంది. అలాంటి వేళ పార్టీ అగ్రనేతలు రాహుల్, మల్లికార్జున ఖర్గేతో శశిథరూర్ సమావేశం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే ఈ భేటీలో పార్టీ మార్పుపై జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో వారిద్దరికి ఎంపీ శశిథరూర్ వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. తాను కాంగ్రెస్ లోనే ఉంటానని... అంతా బాగుంది. పార్టీ నాయకత్వంతో నాకు ఎలాంటి విభేదాలు లేవు. మేమంతా ఒకే మాటపై ఉన్నాం. కలిసి ముందుకు సాగుతాం.. అంటూ శశిథరూర్ ప్రకటించారు. దీంతో, కేరళ ఎన్నికలకు సమాయత్తం అవుతున్న వేళ శశిథరూర్ ప్రకటన కాంగ్రెస్ కు భారీ రిలీఫ్ గా మారుతోంది.












Click it and Unblock the Notifications