షీనా హత్య కేసులో ట్విస్ట్‌ల మీద ట్వీస్ట్‌లు
ముంబై: సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసు మలుపుల మీద మలుపులు తిరుగుతోంది. పోలీసులు షీనా బోరాను హత్య చేయడానికి ఉపయోగించిన కారును స్వాధీనం చేసుకున్నారు. షీనా బొరా అస్తిపంజరానికి సంబంధించిన ఫోరెన్సిక్ నివేదిక వస్తే కేసు దర్యాప్తు మరింత ముందుకు సాగే అవకాశం ఉంది.
ఇంద్రాణిని ఖర్ పోలీసులు మరోసారి విచారిస్తున్నారు. ఆమె విచారణలో మరిన్ని విషయాలు తెలిసే అవకాశాలుంటాయని భావిస్తున్నారు. ఆగస్టు 25వ తేదీన ఖర్ పోలీసులు ఇంద్రాణిని అరెస్టు చేశారు. ఇంద్రాణి డ్రైవర్‌ను కూడా అదే రోజు పోలీసులు అరెస్టు చేశారు. షీనాను హత్య చేయడానికి ఇంద్రాణికి తాను సహకరించినట్లు అతను పోలీసులకు చెప్పాడు.
నన్నూ హత్య చేసి ఉండేవారు..
షీనా హత్య జరిగిన రోజున తాను తప్పించుకోకుండా ఉంటే ఇంద్రాణి, ఆమె రెండో భర్త తనను కూడా హత్య చేసి ఉండేవారని మైఖేల్ చెబుతున్నారు. కాగా, సంజీవ్ ఖన్నా నేరాన్ని అంగీకరించినట్లు ముంబై పోలీస్ కమిషనర్ రాకేష్ మారియా తెలిపారు. చిక్కుముడిలాంటి ఇంద్రాణి అనుబంధాల కారణంగా కేసు పలు మలుపులు తిరుగుతోంది.
పెళ్లి జరిగిపోయేదే..
ముగ్గురు భర్తలు, ఇద్దరు భార్యలు, చెల్లిలా మారిన కూతురు, భర్త కొడుకుతో కూతురి ప్రేమ, షీనా హత్య సినిమా కథను ఇంద్రాణీ వ్యవహారం తలపిస్తోంది. స్టార్ ఇండియా మాజీ సీఈఓ పీటర్ ముఖర్జీని వివాహం చేసుకున్న ఇంద్రాణి తన కుమార్తె షీనాను హత్య చేసినట్లు ఇప్పటికే అంగీకరించిన విషయం తెలిసిందే. ఈ హత్య జరగకపోతే షీనా, రాహుల్ ముఖర్జీల పెళ్లి కూడా జరిగిపోయేదని పీటర్ ముఖర్జీ అన్నారు. మొదటి భార్య షబ్నమ్ శుక్రవారం ఈ వివరాలు తెలిపారు. భర్త నుంచి విడిపోయిన షబ్నమ్ ప్రస్తుతం ఉత్తరాఖండ్‌లోని తన స్వస్థలంలో స్థిరపడ్డారు.

మొదటి భర్త పిల్లలు కారు..
మేఖేల్, షీనాలను ఇంద్రాణికి ఆమె మొదటి భర్త సిద్దార్థ దాస్ ద్వారా పుట్టిన పిల్లలని ఇప్పటివరకు అనుకుంటున్నారు. అయితే ఈ బంధం కూడా మలుపు తిరిగింది. తన తండ్రిని తాము ఎప్పుడూ చూడలేదని మైఖేల్ తెలిపారు. తమని అందరికీ చెల్లి, తమ్ముడు గానే పరిచయం చేసేదని వివరించారు. షీనా హత్య జరిగిన సమయానికి ఆమె గర్భవతి అని అనుమానం కలుగుతోంది. ముంబై వచ్చిన మైఖేల్ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. షీనా హత్య జరిగిన రోజున తాను కూడా ముంబైలోనే ఉన్నానని తెలిపారు.
మత్తుమందు కలిపి ఇచ్చారు..
ఇంద్రాణి మాజీ భర్త సంజీవ్ ఖన్నా బస చేసిన హోటల్ లోనే తాను ఉన్నానని, ఆ రోజు తనకు ఇచ్చిన పానీయంలో మత్తుమందు కలిపి ఇచ్చారని మైఖేల్ తెలిపారు. దాంతో పరిస్థితి అర్థం చేసుకున్న తాను అక్కడి నుంచి తప్పించుకుని గౌహతి చేరుకున్నానని ఆయన చెప్పారు. షీనా హత్య తర్వాత తనను కూడా హత్య చేసేవారేనని మైఖేల్ అనుమానం వ్యక్తం చేశారు. మైఖేల్‌ను పోలీసులు ఇంద్రాణి ఎదుట కూర్చొబెట్టడంతో ఆమె అసహనంగా కనిపించారు. మైఖేల్ తనను డబ్బు కోసం బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని ఇంద్రాణి అన్నారు.
రాయగఢ్ జిల్లాలో షీనా మృతదేహాన్ని పడేసిన స్థలంలో కొన్ని ఎముకలు, పుర్రే, ఒక సూట్‌కేస్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కోల్‌కత్తాలో అరెస్టు చేసిన సంజీవ్ ఖన్నాను ముంబై తరలించి విచారించారు. షీనా హత్య జరిగినప్పుడు ఆ కారులోనే ఉన్నానని, అయితే కారు ఎక్కగానే నిద్రపోయానని సంజీవ్ వెల్లడించారు.

డెహ్రూడూన్‌లో షీనా పాస్‌పోర్ట్
ముంబై పోలీస్ కమిషనర్ రాకేష్ మారియా మీడియాతో మాట్లాడుతూ షీనా బోరా పాస్‌పోర్టును డెహ్రాడూన్‌లో స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఆమె అమెరికా వెళ్లిన మాట నిజం కాదని తెలిసిపోయిందని ఆయన అన్నారు. ఈ కేసులో మూడో నిందితుడు సంజీవ్ ఖన్నాను ప్రశ్నించామని, నేరంలో తనకూ పాత్ర ఉందని అంగీకరించారని రాకేష్ తెలిపారు.
ఈ కేసులో ఇంకా లోతైన విచారణ జరుగుతోందని ఆయన వెల్లడించారు. ముంబై కోర్టు సంజీవ్ ఖన్నాను సోమవారం వరకు పోలీస్ కస్టడీకి అప్పగించింది.. ఇదిలా ఉంటే షీనా, మైఖేల్ తండ్రి ఎవరు అనేది అర్థం చేసుకోవడం కష్టంగా ఉందని పోలీసు అధికారులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications