మహారాష్ట్ర పాలిటిక్స్..అస్సాంకు షిఫ్ట్: బాల్ థాకరే అసలు వారసులం: 40 మంది రెబెల్స్‌తో
గువాహటి: మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం పతాక స్థాయికి చేరినట్టే. శివసేన-నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ-కాంగ్రెస్ కూటమితో కూడిన మహా వికాస్ అగాఢీ కూటమిలో చిచ్చు రాజేసిన మంత్రి ఏక్‌నాథ్ షిండే.. గుజరాత్‌ను వీడారు. సూరత్ నుంచి అస్సాంకు చేరుకున్నారు. ఈ తెల్లవారు జామున ఆయన గువాహటి విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యారు. తన వెంట 40 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఉన్నట్లు ప్రకటించుకున్నారు. ఇందులో 33 మంది శివసేన తిరుగుబాటు ఎమ్యెల్యేలు కాగా.. మిగిలిన వారు స్వతంత్రులు.

మహా సర్కార్‌లో డేంజర్ బెల్స్..
మహారాష్ట్ర అసెంబ్లీలో శివసేనకు ఉన్న సంఖ్యాబలం 55. ఇందులో 33 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలు తనవెంటే ఉన్నారంటూ ఏక్‌నాథ్ షిండే ప్రకటించుకోవడం.. మహా వికాస్ అగాఢీ సంకీర్ణ కూటమి ప్రభుత్వంలో డేంజర్ బెల్స్ మోగినట్టే. మరో ఏడుమంది స్వతంత్రులు కూడా తనకే మద్దతు ఇస్తున్నారని చెప్పారు. షిండే సారథ్యంలో వారంతా ఇవ్వాళ భారతీయ జనతా పార్టీ అధిష్ఠానాన్ని కలుసుకుంటారనే ప్రచారం సాగుతోంది. తనకు మద్దతు ఇస్తోన్న 40 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలతో ఢిల్లీ వెళ్తారనీ సమాచారం.

బాల్ థాకరే హిందుత్వ వారసులం..
మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభానికి కారణమైన తరువాత తొలిసారిగా ఏక్‌నాథ్ షిండే.. మీడియా ముందుకొచ్చారు. మంగళవారం రాత్రి సూరత్‌లో విలేకరులతో మాట్లాడారు. బాల్ థాకరే అనుసరించిన హిందుత్వ విధానాలకు తామే అసలు వారసులమని ప్రకటించారు. హిందుత్వవాదంతో కూడిన శివసేనను వీడలేదని స్పష్టం చేశారు. మహా వికాస్ అగాఢీ ప్రభుత్వం గురించి ప్రస్తుతానికి తానేమీ మాట్లాడబోనని చెప్పారు.

స్వాగతించిన బీజేపీ ఎమ్మెల్యే..
గువాహటి విమానాశ్రయంలో దిగిన ఏక్‌నాథ్ షిండే.. ఇతర శివసేన తిరుగుబాటు శాసన సభ్యులకు బీజేపీ నాయకులు ఆహ్వానం పలికారు. లోక్‌సభ సభ్యుడు పల్లబ్ లోచన్ దాస్, ఎమ్మెల్యే సుశాంత బొర్గొహెయిన్ సారథ్యంలో పలువురు బీజేపీ నాయకులు గువాహటి విమానాశ్రయంలో శివసేన నేతలను రిసీవ్ చేసుకున్నారు. తాను పార్టీపరంగా రాలేదని, ఏక్‌నాథ్ షిండేతో ఉన్న స్నేహం కారణంగానే తాను ఆయనకు స్వాగతం పలకడానికి వచ్చానని బొర్గొహెయిన్ చెప్పడం కొసమెరుపు.

బీజేపీ అధిష్ఠానంతో..
ఇవ్వాళ ఏక్‌నాథ్ షిండే.. బీజేపీ అధిష్ఠానాన్ని కలుసుకునే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. రాష్ట్రపతి ఎన్నికల కోసం ఎన్డీఏ కూటమి తరఫున అభ్యర్థిని ప్రకటించిన కొన్ని గంటల వ్యవధిలోనే శివసేన తిరుగుబాటు శాసన సభ్యులందరూ గుజరాత్‌ను వీడి అస్సాంకు వెళ్లడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రాష్ట్రపతి అభ్యర్థి ప్రకటన అనంతరం బీజేపీ పెద్దలు ఇక మహారాష్ట్ర సంక్షోభ రాజకీయాలపై దృష్టి సారించారని, ఈ నెలాఖరులోగా లేదా వచ్చేనెల మొదటివారం నాటికి ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేలా వ్యూహాలు రూపొందిస్తున్నారని అంటున్నారు.












Click it and Unblock the Notifications