శివసేన ఎంపీ గైక్వాడ్ పశ్చాత్తాప లేఖ, నిషేధం ఎత్తివేసిన ఎయిరిండియా
శివసేన వివాదాస్పద ఎంపీ రవీంద్ర గైక్వాడ్ విమాన ప్రయాణాలపై ఎయిరిండియా నిషేధం ఎత్తివేసింది.
న్యూఢిల్లీ: శివసేన వివాదాస్పద ఎంపీ రవీంద్ర గైక్వాడ్ విమాన ప్రయాణాలపై ఎయిరిండియా నిషేధం ఎత్తివేసింది. ఏంపీ ఒక మెట్టు దిగొచ్చి జరిగిన దానికి పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ కేంద్ర విమానయాన మంత్రికి లేఖ రాసిన నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నారు.
ఎంపీ గైక్వాడ్ నెల రోజుల క్రితం ఎయిరిండియా సిబ్బందిపై చెప్పుతో దాడి చేయడమేకాక తాను అతడిని 25 సార్లు కొట్టినట్లుగా చెప్పడంతో ఆయన విమాన ప్రయాణాలపై ఎయిరిండియా నిషేధం విధించింది. ఈ వ్యవహారం పార్లమెంటును కుదిపేయడం, గ్వైకాడ్ సైతం ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసిన నేపథ్యంలో తాజా పరిణామాలు చోటుచేసుకున్నాయి.
తనపై విమాన సంస్థలు విధించిన నిషేధాన్ని ఎత్తివేసేలా చర్యలు తీసుకోవాలంటూ ఎంపీ రవీంద్ర గైక్వాడ్ గురువారం లోక్ సభలో స్పీకర్ సుమిత్రా మహాజన్ ను కోరారు. పైగా జరిగిన దానిపై అవసరమైతే పార్లమెంటుకు క్షమాపణ చెబుతాను కానీ ఎయిరిండియా ఉద్యోగికి క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదంటూ ాయన తెగేసి చెప్పడంతో ఈ వివాదం పరిష్కారం కాలేదు.

నిన్న లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్, పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజుతో సమావేశమై చర్చించారు. ఎంపీ క్షమాపణ కోరితే తప్ప ఈ సమస్య పరిష్కారం కాదంటూ కేంద్రం స్పష్టం చేయడంతో ఎంపీ గైక్వాడ్ కు ప్రత్యామ్నాయం లేకపోయింది.
ఈ నేపథ్యంలో గైక్వాడ్ పశ్చాత్తాపం ప్రకటిస్తూ అశోక్ గజపతి రాజుకు లేఖ రాశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటానంటూ ఆయన హామీ పత్రం కూడా జతచేయడంతో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ వర్గాలు కూడా మెత్తబడ్డాయి.
దీంతో ఈరోజు పౌర విమానయాన శాఖ అధికారులు ఈ విషయమై ఎయిరిండియాకు లేఖ రాసి, గైక్వాడ్ పై విధించిన సిషేధాన్ని ఎత్తివేయాలని కోరారు. దీంతో గైక్వాడ్‌పై విధించిన నిషేధాన్ని ఎయిర్ ఇండియా ఎత్తివేసింది.












Click it and Unblock the Notifications