మహా ట్విస్ట్: థాకరేకి కోపంతెప్పించిన మోడీ, గీతే రిజైన్?
న్యూఢిల్లీ: కేంద్రమంత్రి వర్గ విస్తరణ కార్యక్రమానికి శివసేన దూరం జరిగింది. దీంతో ఇప్పుడు ఇది చర్చనీయాంశమైంది. ఆ పార్టీ తరఫున సురేష్ ప్రభాకర్ ప్రభు కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే, అతని పేరును శివసేన సూచించలేదని వార్తలు వచ్చాయి. శివసేన నుండి అనిల్ దేశాయ్ ప్రమాణ స్వీకారం చేస్తారని భావించినప్పటికీ.. ప్రమాణ స్వీకారానికి ఆయన హాజరుకాలేదు.
దీంతో మహారాష్ట్రలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి శివసేన మద్దతు పలుకుతుందా లేక ప్రతిపక్షంగా వ్యవహరిస్తుందా అన్నది ఉత్కంఠగా మారింది. శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరే సాయంత్రం పార్టీకి చెందిన ముఖ్యనేతలతో భేటీ కానున్నారు. ఈ భేటీలో బీజేపీతో మైత్రి పైన నిర్ణయం తీసుకోనున్నారు. శివసేన ప్రతిపక్షంలో కూర్చునేందుకు సిద్ధంగా ఉందని చెబుతున్నారు.

పార్టీ ప్రతిపాదించిన ఎంపీకి కాకుండా మరొకరిచే ప్రమాణ స్వీకారం చేయించడం పైన శివసేన మండిపడుతోంది. శివసేనతో బీజేపీ దోస్తీ విషయమై మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలప్పటి నుండి రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పుడు అనిల్‌కు బదులు సురేష్ ప్రభుచే ప్రమాణ స్వీకారం చేయించడంతో తమ ఎంపీని (అనిల్) శివసేన వెనక్కి రప్పించింది. దీంతో పదవి చేపట్టకుండానే ఆయన వెను దిరిగారు.
కేబినెట్లో శివసేనకు రెండు పదవులు ఇస్తామని నరేంద్ర మోడీ ప్రతిపాదించారు. దీంతో అనిల్ దేశాయ్‌కి కేబినెట్ హోదా, సురేశ్ ప్రభుకు సహాయ మంత్రి పదవులివ్వాలని ఉద్ధవ్ థాకరే మోడీకి సూచించారు. అయితే సురేశ్ ప్రభుకు కేబినెట్ హోదా, అనిల్‌కు సహాయ మంత్రి పదవి ఇస్తున్నారన్న సమాచారంతో థాకరే ఆగ్రహానికి గురయ్యారు.
వెనువెంటనే అనిల్‌కు ఫోన్ చేసిన ఉద్ధవ్ తిరిగొచ్చేయమని ఆదేశాలు జారీ చేశారు. మోడీ తీరుపై ఉద్ధవ్ సాయంత్రం 4.30 గంటలకు ప్రత్యేకంగా భేటీ అవుతున్నారు. మోడీతో పాటు బీజేపీ వ్యవహారంపై ఉద్ధవ్ కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. కాగా, కేంద్రమంత్రి అనంత్ గీతే కూడా రాజీనామా చేయనున్నారని వార్తలు వస్తున్నాయి.












Click it and Unblock the Notifications