వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మహా పీఠంపై ఉద్ధవ్: రేపు అధికారిక ప్రకటన: గవర్నర్ ను కలవనున్న మూడు పార్టీల నేతలు

|
Google Oneindia TeluguNews

ముంబై: నెల రోజులుగా మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ ఉత్కంఠతకు శనివారం తెరపడబోతోంది. మహారాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి శివసేన-నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ-కాంగ్రెస్ సమాయాత్తమౌతున్నాయి. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే పేరు ఖరారైంది. అయిదేళ్ల పాటూ ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఉప ముఖ్యమంత్రి పదవులు ఇవ్వనున్నారు.

అయిదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉద్ధవ్..

అయిదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉద్ధవ్..

తాజాగా కుదిరిన ఒప్పందాల ప్రకారం.. అయిదేళ్ల పాటు ఉద్ధవ్ థాకరే ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతారు. ముఖ్యమంత్రి పీఠాన్ని చెరో రెండున్నరేళ్ల కాలం పాటు పంచుకోవాలంటూ మొదట్లో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ పట్టుపట్టింది. దీనిపై శివసేన వెనక్కి తగ్గలేదు. ఫలితంగా.. తానే మెట్టు దిగింది ఎన్సీపీ. అయిదేళ్ల పాటు ముఖ్యమంత్రి పీఠాన్ని శివసేనకు వదిలివేయడానికి అంగీకరించింది. దీనితో ఉద్ధవ్ థాకరే మహారాష్ట్రకు కాబోయే ముఖ్యమంత్రిగా ఎన్నిక కావడం కేవలం లాంఛనప్రాయమే అయింది.

ఉద్ధవ్, శరద్ పవార్ ల కలయికలో..

ఉద్ధవ్, శరద్ పవార్ ల కలయికలో..

శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ సంకీర్ణ కూటమి ప్రభుత్వాన్ని ఉద్ధవ్ థాకరే, శరద్ పవార్ సంయుక్తంగా సారథ్యాన్ని వహిస్తారు. వారిద్దరూ ప్రభుత్వాన్ని అయిదేళ్ల పాటు నడిపించాలని కూటమి నాయకులు తీర్మానించారు. కాంగ్రెస్, ఎన్సీపీ నాయకులకు ఉప ముఖ్యమంత్రి పదవులు, అసెంబ్లీ స్పీకర్, మండలి ఛైర్మన్ పదవులతో పాటు మంత్రివర్గంలోనూ సమాన ప్రాతినిథ్యాన్ని కల్పించాల్సి ఉంటుంది. మంత్రివర్గ కూర్పు ఎలా ఉండాలనే అంశాన్ని ఉద్ధవ్, శరద్ పవార్ లు తేల్చాల్సి ఉంది.

రేపు అధికారికంగా వెల్లడి..

రేపు అధికారికంగా వెల్లడి..

ముఖ్యమంత్రిగా ఉద్ధవ్ థాకరే పేరును శనివారం అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని శరద్ పవార్ సూచనప్రాయంగా వెల్లడించారు. చర్చలు సుహృద్భావ వాతావరణంలో కొనసాగాయని అన్నారు. గవర్నర్ భగత్ సింగ్ కోష్యారిని ఎప్పుడు కలవాలనే విషయాన్ని కూడా శనివారమే నిర్ణయిస్తామని చెప్పారు. ప్రస్తుతం అరకొరగా కొన్ని అంశాలు మిగిలిపోయాయని, వాటిపై చర్చించాల్సి ఉందని అన్నారు. అవేవీ కూటమి స్నేహాన్ని ప్రభావితం చేసేవి కావని శరద్ పవార్ స్పష్టం చేశారు.

రాష్ట్రపతి పాలనలో.. మహా

రాష్ట్రపతి పాలనలో.. మహా

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచీ అక్కడి రాజకీయ వాతావరణం రోజుకో విధంగా మలుపులు తిరుగుతూ వచ్చింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేమంటూ భారతీయ జనతాపార్టీ రేసు నుంచి తప్పుకోవడం, గడువులోగా ఏ రాజకీయ పార్టీ కూడా ప్రభుత్వాన్ని నెలకొల్పడానికి ముందుకు రాలేకపోవడంతో అక్కడ రాష్ట్రపతి పాలనను విధించారు. ప్రస్తుతం మహారాష్ట్ర రాష్ట్రపతి పాలనలో కొనసాగుతోంది.

కనీస ఉమ్మడి ప్రణాళిక ప్రకారమే..

కనీస ఉమ్మడి ప్రణాళిక ప్రకారమే..

శివసేన సారథ్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ముందుకు వచ్చాయి. మూడు పార్టీల కలయికతో అక్కడ సంకీర్ణ కూటమి సర్కార్ ఏర్పాటు కాబోతున్నందున, భేదాభిప్రాయాలు రాకూడదనే ఉద్దేశంతో కనీస ఉమ్మడి ప్రణాళిక (కామన్ మినిమమ్ ప్రోగ్రామ్)ను రూపొందించుకున్నారు. ఈ ప్రణాళికపై శుక్రవారం సాయంత్రం వరకూ చర్చల మీద చర్చలు కొనసాగాయి.

రోజంతా చర్చలు..

రోజంతా చర్చలు..

శివసేన తరఫున ఆ పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్ థాకరే, సీనియర్ నాయకులు సంజయ్ రౌత్, ఏక్ నాథ్ షిండే. సుభాష్ దేశాయ్, ఎన్సీపీ తరఫున శరద్ పవార్, ప్రఫుల్ పటేల్, జయంత్ పాటిల్, అజిత్ పవార్, కాంగ్రెస్ నుంచి అహ్మద్ పటేల్, మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్, అవినాశ్ పాండే. బాలాసాహెబ్ థొర్రట్, పృథ్వీరాజ్ చవాన్ ఈ చర్చల్లో పాల్గొన్నారు. ముంబై దక్షిణ ప్రాంతంలోని నెహ్రూ సెంటర్ లో శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం 7 గంటల వరకూ ఈ చర్చలు కొనసాగాయి.

ఫలప్రదం అయ్యాయంటూ..

ఫలప్రదం అయ్యాయంటూ..

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ నేతలతో రోజంతా సాగిన చర్చలు ఫలప్రదం అయ్యాయని ఉద్ధవ్ థాకరే ప్రకటించారు. సమావేశం ముగిసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. కనీస ఉమ్మడి ప్రణాళికపై ఏకాభిప్రాయానికి వచ్చామని వెల్లడించారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తరువాత ఎలాంటి మనస్పర్థలు గానీ, భేదాభిప్రాయాలు గానీ చోటు చేసుకోకూడదనే ఉద్దేశంతోనే తాము అన్ని కోణాల్లోనూ చర్చలు సాగించామని అన్నారు.

English summary
Uddhav Thackeray is set to become Chief Minister of Maharashtra. Nationalist Congress Party Chief Sharad Pawar announced the decision after top leaders of Shiv Sena, Congress and NCP held deliberations on Friday. Sharad Pawar, Uddhav Thackeray, Eknath Shinde, Subhash Desai, Sanjay Raut, Ahmed Patel, Mallikarjun Kharge, K C Venugopal, Avinash Pande, Balasaheb Thorat, Prithviraj Chavan (Congress), Praful Patel, Jayant Patil and Ajit Pawar were among present in the meeing at Nehru Centre in South Mumbai.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X