శివసేన మరో యూటర్న్-యూపీలో వలసల ఓట్ల కోసం-రంగంలోకి ఆదిత్య థాక్రే
శివసేన మారుతోంది. గతంలో ముంబైలో రాజకీయంగా బలపడేందుకు అనుసరించిన పలు విధానాలను మార్చుకుంటోంది. అదే క్రమంలో పాతికేళ్ల పాటు కాపురం చేసిన బీజేపీని వదిలించుకుని లౌకిక ముద్ర కోసం తపిస్తోంది. అలాగే ఇప్పుడు యూపీ ఎన్నికల బరిలోకి దిగి మరో నిర్ణయాన్ని మార్చేసుకుంది.
ఒకప్పుడు ముంబైలో వలస కార్మికులు స్దానికుల ఉపాధి దెబ్బతీస్తున్నారంటూ ఉద్యమాలు చేసి రాజకీయంగా బలపడిన శివసేన ఇప్పుడు క్రమంగా రూటుమార్చుకుంటోంది. గతంలో తాము అనుసరించిన పలు విధానాలను సమీక్షిస్తోంది. ఇదే క్రమంలో యూపీ ఎన్నికల బరిలో అదే వలస కార్మికుల ఓట్లను కోరుతోంది. తాజాగా యూపీలో పర్యటించిన మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే కుమారుడు, రాష్ట్రమంత్రి ఆదిత్య థాక్రే వలస కార్మికులు యూపీ ఎన్నికల్లో తమకే ఓటు వేయాలని కోరుతున్నారు.

ఈ ఎన్నికల్లో బిజెపి పాలిత ఉత్తరప్రదేశ్‌లో శివసేన 45 స్థానాల్లో పోటీ చేస్తోంది. దీంతో ఈ అభ్యర్ధుల ప్రచారం కోసం ఆదిత్య థాక్రే యూపీలో ప్రచారం చేస్తున్నారు. ఇందులో భాగంగా వలస కార్మికుల ఓట్ల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. తాము 2024ని దృష్టిలో ఉంచుకుని శివసేనను మహారాష్ట్ర వెలుపల విస్తరించాలని ప్రయత్నిస్తున్నట్లు నేతలు చెప్తున్నారు. మహారాష్ట్ర క్యాబినెట్ మంత్రి ఆదిత్య ఠాక్రే , సీనియర్ నేత సంజయ్ రౌత్ యూపీలో ప్రచారం వెనుక కారణమిదేనని చెప్తున్నారు. గతంలో తాము గెలిచిన దాద్రా నగర్ హవేలీ ఉపఎన్నికల్లో తమ నాయకుడు ఆదిత్య ఠాక్రే ప్రచారానికి వెళ్లారని శివసేన గుర్తుచేస్తోంది. ఇప్పుడు పార్టీ సీనియర్ నాయకత్వం యూపీ వైపు చూస్తోందని పార్టీ యూపీ రాష్ట్ర అధ్యక్షుడు ఠాకూర్ అనిల్ సింగ్ తెలిపారు.












Click it and Unblock the Notifications