రైతుల ఆత్మలు క్షోభింపజేసేలా మంగోలియాకు ఆర్ధిక సాయం: మోడీపై శివసేన
న్యూఢిల్లీ: శివసేనకు చెందిన సామ్నా పత్రికలో ప్రధాని నరేంద్ర మోడీపై మరోసారి తీవ్ర విమర్శలు చేసింది. మంగోలియాకు ప్రధాని మోడీ బిలియన్ డాలర్ల ఆర్ధిక సాయాన్ని ప్రకటించడంపై సామ్నా సంపాదకీయంలో మండిపడింది. మంగోలియాపై ప్రదర్శించిన ఆసక్తిని, మోడీ కరువుతో విలవిలాడుతున్న మహారాష్ట్రపై ఎందుకు చూపలేకపోతున్నారని ప్రశ్నించింది.
"ప్రధాని మంగోలియాకు బిలియన్ డాలర్ల సాయం ప్రకటించారు. దీంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు బలోపేతమవుతాయి. చిన్నదేశమైన మంగోలియా అభివృద్ధికి ప్రధాని నైతిక బాధ్యత తీసుకున్నట్టుంది. ఆయన ప్రకటించింది చిన్న మొత్తం అయితే కాదు. మహారాష్ట్రలో ఆత్మహత్య చేసుకున్న రైతుల ఆత్మలను ఇది మరింత క్షోభింపజేస్తుంది" అని పేర్కొంది.

'భారత్ నుంచి ఆర్ధిక సాయాన్ని అందుకున్న మంగోలియా, మహారాష్ట్ర కంటే అదృష్టశాలి అని భావిస్తున్నాం. కారణం ప్రధాని మోడీ మంగోలియా ఆర్ధిక స్ధితిగతులను మార్చేంత పెద్ద మొత్తంలో సాయం ప్రకటించారు' అని పేర్కొంది. ఇటీవలే ముగిసిన విదేశీ పర్యనటలో భాగంగా మంగోలియాని సందర్శిన ప్రధాని మోడీ మంగోలియా ఆర్థికంగా స్థిరపడేందుకు బిలియన్ డాలర్ల రుణాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే.
మంగోలియా ప్రధాని చిమెద్ షేక్ హన్ బిలెగ్‌తో సమావేశమైన మోడీ ఇరుదేశాల మధ్య ప్రతినిధి స్థాయి చర్చలు పూర్తి కావడంతో ద్వైపాక్షిక సంబంధాలకు సంబంధించి 14 ఒప్పందాలు చేసుకున్నారు. మంగోలియా రాజధానిలో గాందన్ తెచిలెన్ బౌద్ధ విహారం ప్రధానాచార్యుడు హంబా లామాకు మోడీ బోధివృక్షం మొక్కను బహుమతిగా అందించారు.












Click it and Unblock the Notifications