అన్నదమ్ముల మధ్య గొడవ.. తండ్రి మృతదేహాన్ని రెండు ముక్కలు చేసి..!
ఓవైపు కుటుంబ పెద్ద మృతిచెందాడని ఆ కుటుంబం అంతా తీవ్రశోకంలో ఉంది. మరోవైపు తండ్రికి నేను అంత్యక్రియలు చేస్తానంటే.. నేను చేస్తానని ఇద్దరు అన్నదమ్ములు గొడవకు దిగారు. పెద్దకొడుకు.. నేనే అంత్యక్రియలు చేస్తానని చెప్పగా.. చిన్నకొడుకు మాత్రం..లేదు నాన్నకు నేనంటే ఇష్టం ఆయన కోరిక మేరకు నేనే అంత్యక్రియలు చేస్తానంటూ గొడవకు దిగాడు. దీంతో కుటుంబసభ్యులు, గ్రామస్థులకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఈ షాకింగ్ ఘటన మధ్యప్రదేశ్ తీకమ్ ఘర్ జిల్లాలోని లిధోరాతల్ గ్రామంలో జరిగింది. అన్నదమ్ముల మధ్య గొడవ మరీ తీవ్రతరం కావడంతో గ్రామస్థులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
మృతదేహాన్ని ముక్కలు చేసి..
పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. మధ్యప్రదేశ్ తీకమ్ ఘర్ జిల్లాలోని లిధోరాతల్ గ్రామానికి చెందిన దయాని సింగ్ ఘోష్(84), చిన్న కుమారుడు దేశ్ రాజ్ వద్ద ఉంటున్నాడు. అయితే అనారోగ్యం కారణంగా అతను ఆదివారం మృతిచెందాడు. ఈ విషయం తెలుసుకున్న పెద్దకుమారుడు కిషన్.. తండ్రి మృతదేహాన్ని చూసేందుకు అక్కడకు వచ్చాడు.

ఈ క్రమంలో అంత్యక్రియలు జరిపే విషయంలో ఇద్దరిమధ్య గొడవ మొదలైంది. తండ్రి కోరిక మేరకు తానే అంత్యక్రియలు నిర్వహిస్తానని దేశ్ రాజ్ చెప్పగా.. లేదు ఆ హక్కు నాకే ఉందని కిషన్ మొండికేశాడు. దీంతో ఇరువరి మధ్య ఘర్షణ జరిగింది. అయితే సహనం కోల్పోయిన కిషన్.. తండ్రి మృతదేహాన్ని రెండు ముక్కలుగా చేసి చెరో ముక్క ఇవ్వాలని డిమాండ్ చేశాడు.
ఈ వివాదంలో పోలీసులు జోక్యం చేసుకున్నారు. ఎలాగోలా కిషన్ కు నచ్చజెప్పి అక్కడినుంచి పంపించేశారు.దీంతో చిన్నకుమారుడు దేశ్ రాజ్ తండ్రి మృతదేహానికి అంత్యక్రియలు చేశాడు. ఇక ఈ ఘటనపై ఎలాంటి కేసు నమోదు చేయలేదని జాతర స్టేషన్ పోలీస్ అధికారి అరవింద్ సింగ్ ధాంగి తెలిపారు.












Click it and Unblock the Notifications