ధుబ్రీ జిల్లాలో రాత్రిపూట కనిపిస్తే కాల్చివేత.. సీఎం ఆదేశాలు
Assam CM Himanta Biswa Sarma:బంగ్లాదేశ్ సరిహద్దులో ఉన్న అస్సాంలోని ధుబ్రీ జిల్లాలో ఉద్రిక్తత దృష్ఠ్యా రాత్రిపూట కాల్చివేత ఆదేశాలు అమలులో ఉంటాయని ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ శుక్రవారం వెల్లడించారు. ఒక మత సమూహం అల్లర్లు సృష్టించడానికి ప్రయత్నిస్తోందని, దీని ప్రభుత్వం సహించదని ఆయన అన్నారు. ఆదివారం ధుబ్రీ పట్టణంలోని ఒక ఆలయం సమీపంలో మాంసం ముక్కలు కనిపించడంతో ప్రజలు నిరసన తెలిపారు. ఈ క్రమంలో సోమవారం పట్టణంలో నిషేధాజ్ఞలు విధించారు. మరుసటి రోజు వాటిని ఉపసంహరించారు. శుక్రవారం ముఖ్యమంత్రి పరిస్థితిని సమీక్షించడానికి ధుబ్రీని సందర్శించారు.
ధుబ్రీ జిల్లాలో రాపిడ్ యాక్షన్ ఫోర్స్ (RAF), సీఆర్పీఎఫఅ సిబ్బందిని మోహరిస్తామని కూడా సీఎం చెప్పారు. అదే సమయంలో ధుబ్రీలోని అందరు నేరస్థులను అరెస్టు చేస్తామన్నారు. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకున్న వారందరినీ కఠినంగా శిక్షిస్తామని ముఖ్యమంత్రి అన్నారు. గత వారం రోజులుగా ధూబ్రిలో శాంతిభద్రతల పరిస్థితి సవాలుగా మారిందని ఆయన అన్నారు.బక్రీద్ తర్వాత రోజు జూన్ 7న జిల్లా ప్రధాన కార్యాలయంలోని హనుమాన్ ఆలయం ముందు ఒక ఆవు తల కనిపించిందని అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ అన్నారు. దీని తర్వాత హిందూ, ముస్లిం సంఘాలు శాంతి, సామరస్యం కోసం విజ్ఞప్తి చేశాయి. మరుసటి రోజు మళ్లీ ఒక ఆవు తలను ఆలయం ముందు ఉంచి రాత్రి రాళ్లు విసిరారని సీఎం చెప్పారు. బక్రీద్‌కు ఒక రోజు ముందు 'నబీనా బంగ్లా' అనే సంస్థ ధుబ్రీ జిల్లాను బంగ్లాదేశ్‌లో చేర్చాలనే తన లక్ష్యాన్ని హైలైట్ చేస్తూ "రెచ్చగొట్టే పోస్టర్లు" ఏర్పాటు చేసిందని సీఎం హిమంత బిస్వా శర్మ చెప్పారు. అల్లర్లు సృష్టించడానికి ధుబ్రీలో ఒక మత సమూహం యాక్టివ్ గా మారిందని.. ఈ విషయం తెలుసుకున్న తర్వాత తాను ధుబ్రీకి వచ్చానని.. రాత్రిపూట కాల్చివేత ఆదేశాలు అమలులో ఉంటాయని ఆయన అన్నారు.

బక్రీద్ సందర్భంగా కొంత మంది గోమాంసం తిన్నారని.. అయితే ఈ సారి పశ్చిమ బెంగాల్ నుంచి వేలాది పశువులను తీసుకువచ్చారని.. ధుబ్రీలో పండుగకు ముందు వేలాది జంతువులను సేకరించిన "కొత్త బీఫ్ మాఫియా" ఉద్భవించిందని సీఎం హిమంత బిస్వా శర్మ చెప్పారు. దీనిపై విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. ఈ పశువుల వ్యాపారాన్ని ప్రారంభించిన వారిని అరెస్ట్ చేయాలని అధికారులను ఆదేశించామన్నారు. ఒక వర్గం ప్రజలు ఇలాంటి అల్లర్లు సృష్టించడానికి అనుమతించమని.. మా ప్రభుత్వం దీనిని సహించదన్నారు. అవసరమైతే తాను హనుమాన్ మందిరం వద్ద రాత్రంతా కాపలా ఉంటామన్నారు. జిల్లాలో శాంతిభద్రతలను రక్షించేందుకు, అన్ని మత శక్తులను ఓడించేందుకు పూర్తిగా కట్టుబడి ఉన్నామన్నారు.












Click it and Unblock the Notifications